Abhishek Pathak: రీమేక్ చిత్రాల విజయ రహస్యమిదే!
ABN , First Publish Date - 2022-12-30T16:52:41+05:30 IST
బాలీవుడ్ ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు పరాజయం పాలయ్యాయి. స్టార్ హీరో చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. సౌత్‌లో హిట్ అయిన మూవీస్‌ను గతంలో రీమేక్ చేసి బీ టౌన్ మేకర్స్ భారీగా లాభాలను సంపాదించేవారు.
బాలీవుడ్ ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు పరాజయం పాలయ్యాయి. స్టార్ హీరో చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. సౌత్‌లో హిట్ అయిన మూవీస్‌ను గతంలో రీమేక్ చేసి బీ టౌన్ మేకర్స్ భారీగా లాభాలను సంపాదించేవారు. అయితే, ఈ ఏడాది సౌత్ రీమేక్స్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ అయ్యాయి. ఒక్క ‘దృశ్యం 2’ (Drishyam 2) మాత్రమే లాభాలను అర్జించకలిగింది. ఈ మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలను ‘దృశ్యం 2’ డైరెక్టర్ అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) మీడియాతో పంచుకున్నాడు. రీమేక్ చిత్రాల విజయ రహస్యాన్ని తెలిపాడు.
‘దృశ్యం 2’ లో అజయ్ దేవగణ్ (Ajay Devgn), టబు (Tabu), అక్షయ్ ఖన్నా, శ్రియ శరణ్, ఇషితా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో హిట్ అయిన దృశ్యం 2 సినిమాను హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. అజయ్ ఈ సినిమాలో విజయ్ సల్గోంకర్ పాత్రలో కనిపించాడు. సౌత్ రీమేక్స్ అన్ని ప్లాఫ్ అవుతున్న కాలంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించింది. భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమా విజయంపై అభిషేక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘దృశ్యం చూసిన వారికీ రెండో భాగంపై ఆసక్తి ఉంటుంది. విజయ్ సల్గోంకర్ గురించి అప్పటికే ఆడియన్స్‌కు తెలుసు. అందువల్ల రెండో భాగాన్ని చూడాలనుకుంటారు. ప్రేక్షకుల అభిరుచులను బట్టి రీమేక్ చిత్రాలకు కథలను రాయాల్సి ఉంటుంది. సమయాన్ని కూడా బాగా వెచ్చించాలి. ఒరిజినల్ వెర్షన్‌ను యదాతథంగా రీమేక్ చేయకూడదు. మేం రీమేక్ చేసేటప్పుడు కథను మరల రాశాం. అందువల్లే ఒరిజినల్, రీమేక్‌కు మధ్య ఏడాదిన్నర గ్యాప్ ఉంది. హిందీ, పాన్ ఇండియాతో పోల్చుకుంటే మలయాళం ప్రేక్షకులు విభిన్నమైనవారు. ఆడియన్స్ కూడా కొత్త దృక్పథంతోనే చిత్రాలను చూస్తారు. రీమేక్ సినిమాల విజయం కొత్తగా ప్రజెంట్ చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. మంచి కంటెంట్‌ను ఎల్లప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అని అభిషేక్ పాఠక్ చెప్పాడు.