నిర్మాత దిల్ రాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

ABN , First Publish Date - 2022-12-13T17:37:27+05:30 IST

నిర్మాత దిల్ రాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. అవేంటంటే..

నిర్మాత దిల్ రాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
Dil Raju Open Heart with RK

పధ్నాలుగేళ్ల వయసులో సినిమాలు ప్రదర్శించేవారు. ఆ తర్వాత ఆటోమొబైల్‌ రంగంలోకెళ్లి అక్కడినుంచి యూటర్న్‌ తీసుకొని డిస్ట్రిబ్యూటర్‌ రాణించారు. నిర్మాతగా కూడా సక్సెస్‌ అయ్యారు. ఆయనే దిల్‌ రాజు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కెరీర్‌, వ్యక్తిగత విశేషాలను దిల్‌ రాజు పంచుకున్నారిలా..

ఆర్కే: అసలు పేరును మర్చిపోయారు. మీకైనా గుర్తుందా?

దిల్‌ రాజు: అసలు పేరు వెంకట రమణా రెడ్డి.

ఆర్కే: మరి దిల్‌ రాజు అనే పేరెందుకు పెట్టుకున్నారు?

దిల్‌ రాజు: ఇంట్లో, ఫ్రెండ్‌ సర్కిల్‌లో ముద్దుగా రాజు అని పిలుస్తారు. మొదటి చిత్రం ‘దిల్‌’తో ‘దిల్‌ రాజు’ అయిపోయింది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌ను కాబట్టి నన్ను నైజాం రాజు అనేవాళ్లు.

ఆర్కే: ఇంతమందిని హీరోలుగా సినిమాలు తీసే బదులు, మీరే సినిమా హీరోగా ఉండొచ్చుగా?

దిల్‌ రాజు: అలాంటి ఆలోచన నాకెప్పుడూ లేదు. ప్రొడ్యూసర్‌గానే నేను నా పనిని ఎంజాయ్‌ చేస్తున్నాను.

ఆర్కే: ప్రొడ్యూసర్‌ అయిన డి రామానాయుడు లాంటివాళ్లు కూడా ఏదో ఓ సందర్భంలో నటించడానికి ఇష్టపడేవాళ్లు.

దిల్‌ రాజు: నా డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడూ అడుగుతూ ఉంటారు. ‘శతమానంభవతి’లో పల్లకి మోసే సీన్‌లో ప్రకాష్‌ రాజ్‌, శర్వానంద్‌లతో పాటు నటించాను. ‘గీతాంజలి’లో కూడా కనిపించాను.

ఆర్కే: మీది ఆటొమొబైల్‌ రంగానికి చెందిన కుటుంబం కదా? సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది?

దిల్‌ రాజు: యాక్సిడెంటల్‌గానే ఈ రంగంలోకి వచ్చాను. వెనక్కి వెళ్లి చూసుకుంటే.. మా స్కూలు రోజుల్లో తెలంగాణాలో 16ఎమ్‌ఎమ్‌ సినిమా సంస్కృతి లేదు. 14 ఏళ్ల వయసులో షోలు వేసేవాడిని. అప్పుడు ప్రొజెక్టర్‌కి, సినిమాకి కలిపి 300 అద్దె కట్టి, షో ప్రదర్శించి, టిక్కెట్లతో 400 వరకూ డబ్బులు వసూలు చేసేవాళ్లం. విహెచ్‌ఎస్‌లు వచ్చాక టివిల్లో సినిమాలు వేసేవాడిని. తర్వాత హైదరాబాద్‌లో ఆటొమొబైల్‌ రంగంలోకి వచ్చాక.. మా షాపు చుట్టూ సినిమా ఆఫీసులుండేవి. ఆటొమొబైల్‌లో సక్సెస్‌ అయ్యాను. అప్పటి నైజాం లీడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ మహేందర్‌ రెడ్డి గారు మా ఆవిడకు బాబాయ్‌. అలా డిస్ట్రిబ్యూషన్‌ మొదలుపెట్టాను. తర్వాత నాలుగేళ్ల పాటు ఫ్లాప్స్‌ వచ్చాయి.

ఆర్కే: మరి బాగానే దెబ్బలు తగిలినట్టున్నాయి.

దిల్‌ రాజు: అవును. 1994 నుంచి 1996 వరకూ కోటి రూపాయలు నష్టపోయా. ఆ నష్టం నుంచి కోలుకోవడం కోసం ఆటొమొబైల్‌ను ఇంప్రూవ్‌ చేసుకున్నాను. ‘పెళ్లిపందిరి’ తీశా. బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అలా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలైంది. అప్పుడు కూడా ఒక అనుమానం వేధించేది. ఎవరో తీస్తారు. చివరివరకూ ఎలా ఉంటుందో తెలియదు.

ఆర్కే: ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారా?

దిల్‌ రాజు: అవును. ఎవరూ సినిమా చూపించరు. అందుకే డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ నిలబడదు.

ఆర్కే: సినిమా చూపించకుండా అమ్మడమేంటి అని మీరెప్పుడూ ఫైట్‌ చేయలేదా?

దిల్‌ రాజు: డిస్ట్రిబ్యూటర్లు ఆరుగురు, ఏడుగురు ఉన్నప్పుడు మేమందరం అదే సినిమా కావాలనుకుంటాం.

ఆర్కే: ‘లైగర్‌’, ‘ఆచార్య’ విషయంలో డిస్ర్టిబ్యూటర్లు ధర్నాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది కదా...?

దిల్‌ రాజు: ఇప్పుడు అదే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ ఎందుకు వెళ్లిపోతుందంటే, అందుకు ఉన్న సమస్య ప్రొడ్యూసర్లే!

ఆర్కే: మీరు ఇండస్ట్రీలో ఒక నాయకుడి స్థాయిలో ఉన్నారు. ఈ పరిస్థితిని మీరు చక్కదిద్దలేరా?

దిల్‌ రాజు: ఇండస్ట్రీలో మన మాట ఎవరూ వినరు. ఇక్కడ ఎవరి దారి వారిదే! ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ స్థిరపడిపోయింది. దానికొక సంస్కృతి ఉంది. విజయవాడ బేస్‌గా ఉన్న రోజుల్లో డిస్ట్రిబ్యూటర్‌ డబ్బు ఇస్తేనే ప్రొడ్యూసర్‌ సినిమా తీసేవాడు. ప్రొడ్యూసర్‌ వెళ్లి వాళ్లకు కథ చెప్పడం జరిగేది. నిర్మాతకు భయం ఉండేది. లాంగ్‌ రన్‌లో ప్రొడ్యూసర్‌లు నిలదొక్కుకోలేకపోవడానికి ఇదొక కారణం.

ఆర్కే: డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రొడ్యూసర్లు కూడా ఐదారు సినిమాలు తీస్తారు. ఒకట్రెండు భారీ హిట్లు, ఫట్లు అయిన తర్వాత ఎక్కడా కనపడరు?

దిల్‌ రాజు: ప్రొడ్యూసర్‌కు మార్జిన్‌ తక్కువ. వంద కోట్ల సినిమా అనుకుంటే, దాన్లో 100 బిజినెస్‌ అవుతుందని 95 నుంచి 98 ఖర్చు చేస్తే ఆ మిగిలే మార్జిన్‌ చిన్నది. ఇలాంటి సేఫ్‌ గేమ్‌ సాధ్యపడనప్పుడు నష్టమే కదా? ఇప్పుడు సినిమా రిలీజ్‌ సమయానికి సెన్సార్‌ రూపంలో, ఇంకేదైనా రూపంలో సినిమా వీక్‌ అనే టాక్‌ వచ్చేస్తుంది. ఉదాహరణకు నేను కమిట్‌ అయి ఉంటే, సినిమా వీక్‌ అని తెలియగానే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా బేరమాడడం మొదలుపెడతారు. దాంతో ఒక ప్రొడ్యూసర్‌గా నాకెప్పుడైనా రాంగ్‌ సినిమా పడ్డప్పుడు నేను కూడా నెగిటివ్‌లోకి వెళ్లిపోతూ ఉంటాను. అప్పుడిక డ్యామేజ్‌ తప్పదు. అలాగే ఫైనాన్స్‌ వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి.

ఆర్కే: ఒక భారీ బడ్జెట్‌ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తే నిర్మాతకు దాన్లో ఎంత మిగులుతుంది?

దిల్‌ రాజు: వెయ్యి కోట్లలో ప్రొడ్యూసర్‌ చేతికొచ్చేదెంత అనే విషయం ఎవరూ మాట్లాడరు. నిజాలు మాట్లాడుకుంటే చాలా స్పష్టత వస్తుంది. పెద్ద సినిమా తెలుగు స్టేట్స్‌లో 200 కోట్లు గ్రాస్‌ వసూలు చేస్తే 18% జిఎస్‌టి 36 కోట్లు పోతాయి. ఇది ఎవరూ మాట్లాడరు. ధియేటరికల్‌ రెంటల్స్‌ రూపంలో 25% 50 కోట్లు పోతే 200 కోట్లలో 110 కోట్లే డిస్ట్రిబ్యూటర్‌ చేతికొస్తాయి. నేను ప్రొడ్యూసర్‌గా డిస్ట్రిబ్యూటర్‌కు సినిమా ఇస్తే, వాళ్లకొక 20% పోతుంది. అలా 25 కోట్లు పోతే చేతికొచ్చేది 85 కోట్లే!

ఆర్కే: డిస్ట్రిబ్యూటర్‌కు ఇంకేం ట్యాక్స్‌ ఉండదా?

దిల్‌ రాజు: జిఎస్‌టి రూపంలో సింగిల్‌ ట్యాక్స్‌ ఉంటుంది. లాభం వస్తే, డిస్ట్రిబ్యూటర్‌కూ, ప్రొడ్యూసర్‌కూ 35% ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కూడా ఉంటుంది. అందుకే ఎకానమీ పరంగా దీర్ఘకాలంలో ఈ రంగంలో నిలదొక్కుకుని నిలబడడం కష్టం. ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే జాగ్రత్తగా అదే పనిగా సస్టెయిన్‌ అవుతూ ఉండాలి. నేను ప్రొడ్యూసర్‌గా మారి ఇరవై ఏళ్లయింది. నాతో పాటు రియల్‌ ఎస్టేట్‌ మొదలుపెట్టిన వాళ్లున్నారు. వాళ్ల ముందు నేను నథింగ్‌.

ఆర్కే: మీరొక్కరే అన్‌ హర్ట్‌... గాయాలపాలు కాకుండా.

దిల్‌ రాజు: గాయాలైనా రికవరీ ఫాస్ట్‌గా ఉంటుంది. స్ర్కిప్ట్‌, బడ్జెట్‌. బడ్జెట్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. సక్సెస్‌ ముఖ్యం కాబట్టి, సినిమా చూసిన తర్వాత అవసరమనుకుంటే రీషూట్స్‌ చేస్తాను. ఉత్తరాంధ్ర, కృష్ట, గుంటూరు జిల్లాల్లో నా ఓన్‌ రిలీజ్‌. అంటే మేజర్‌ 60% నేనే రిలీజ్‌ చేసుకుంటాను. మిగతా 40% నాకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా పర్మినెంట్‌ వాళ్లే! వాళ్లను నేను మార్చను.

ఆర్కే: బడ్జెట్‌ పెరిగిపోయిందనేదే ఇప్పుడు పెద్ద సమస్య..

దిల్‌ రాజు: నాన్‌ థియేటిరికల్‌ బిజినెస్‌ పెరగడం ఒకటి. దాని వల్ల ప్రతి రెమ్యునరేషన్‌ నాలుగింతలు పెరిగింది.

ఆర్కే: ‘బాహుబలి’ లాంటి సినిమాలతో బలుపు అనుకుంటే ఎలా?

దిల్‌ రాజు: డబ్బులు తీసుకునేవాళ్లది తప్పు కాదు. ఇచ్చే నిర్మాతలదే తప్పు. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను కాబట్టే నేను కాలిక్యులేటెడ్‌గా చేస్తాను. హీరో వంద అడిగితే, మిగతా టెక్నీషియన్లకు ఎంతవుతుంది? మేకింగ్‌, పీరియడ్‌లను కూడా లెక్కిస్తా. ఆరు నెలల్లో పూర్తయితే ఇంట్రస్ట్‌లు మిగులుతాయి. ఏడాది అయితే పెరుగుతాయి. లాభాలతో పని లేకుండా డ్యామేజీ జరగకుండా కాలిక్యేలేటెడ్‌గా ఉండడం ప్రొడ్యూసర్‌ పని. అలాగే డిస్ట్రిబ్యూటర్‌ను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ప్రొడ్యూసర్‌దే! అలా కాకుండా అబ్‌నార్మల్‌ ప్రైజులకు అమ్మేస్తే, సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు వచ్చి మన మీద పడిపోతారు.

ఆర్కే: నెల రోజులు షూటింగ్స్‌ ఆగినప్పుడు సమస్య పరిష్కారమైందా?

దిల్‌ రాజు: వంద శాతం వర్కవుట్‌ అవుతుంది. ప్రొడ్యూసర్‌గా నేను లాంగ్‌ గేమ్‌ ఆడాలి అంటే కొన్ని ప్రిన్సిపుల్స్‌తో సినిమా తీయవలసి ఉంటుంది. కానీ ప్రిన్సిపుల్స్‌లేని ప్రొడ్యూసర్లం ఎక్కువ మందిమి అయిపోయాం. ప్రిన్సిపుల్స్‌ను పెట్టుకుంటే ప్రొడ్యూసర్‌ ఎందుకు సక్సెస్‌ఫుల్‌గా ఉండడు? నెల రోజుల పాటు షూటింగ్స్‌ ఆపి హోమ్‌వర్క్‌ చేసినప్పుడు, ఎన్నో వాల్యుబుల్‌ పాయింట్ల మీద చర్చించాం.

ఆర్కే: ఈ కారవాన్‌ కల్చర్‌ ఏంటి?

దిల్‌ రాజు: క్యారవాన్‌ లేకుండా షూటింగ్‌ లేదు. అవి ఉండడంలో తప్పు లేదు. పూర్వం పొల్యూషన్‌ ఉండేది కాదు. సెల్‌ఫోన్లు ఉండేవి కావు. ఇప్పుడు అలా కాదు. కాబట్టి దుస్తులు మార్చుకోవాలన్నా క్యారవాన్‌ లాంటివి ఉండాలి కదా! కానీ డిసిప్లైన్‌ పోయింది. షాట్‌ రెడీ అంటే వెంటనే వచ్చే పరిస్థితి లేదు. వాళ్ల అసిస్టెంట్‌కు చెప్తే, ఆయన క్యారవాన్‌ లోపలికి వెళ్లి నటుడికి చెప్తే, ఆయన దిగొచ్చేసరికి పదిహేను నిమిషాలు పడుతోంది. అలాగే ప్రతి ఆర్టిస్టు వెనకాల ముగ్గురు, నలుగురు పనివాళ్లు ఉంటున్నారు. దాంతో ఎక్కువ సమయం వృథా అవుతోంది. ఈ విషయాలన్నీ ప్రొడ్యూసర్లు అందరం చర్చించాం.

ఆర్కే: దిల్‌ రాజు మీద అసూయ వచ్చేసిందా?

దిల్‌ రాజు: సినిమా ఇండస్ట్రీలో అది సర్వసాధారణం.

ఆర్కే: మీకెవరూ టర్మ్స్‌ డిక్టేట్‌ చేయలేని పరిస్థితికి మీరు చేరుకున్నారు.

దిల్‌ రాజు: స్టార్‌ హీరోలందరితో సినిమాలు తీశా. సమస్య ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడి పరిష్కరించుకుంటా.

ఆర్కే: ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఉన్నప్పుడు, గిల్డ్‌ అని ఎందుకు పెట్టుకున్నారు?

దిల్‌ రాజు: గిల్డ్‌ది చెప్పాలంటే అదొక చరిత్ర. దాని కంటే ముందు, మనీ ఎలా సేవ్‌ చేసుకోవచ్చు అనే విషయం మీద రన్నింగ్‌ ప్రొడ్యూసర్లం కలిసి యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అనే ఒకదాన్ని స్టార్ట్‌ చేశాం. దాన్ని ఒకరిద్దరికి అప్పజెప్పాం. తర్వాత ఫైనాన్షియల్‌గా అది రాంగ్‌ ట్రాక్‌లోకి వెళ్లిపోయిందని మూయించేశాం. రన్నింగ్‌ ప్రొడ్యూసర్లే ఉండాలనే కారణంతో గిల్డ్‌ను ఫార్మ్‌ చేశాం. ఇందుకు మెయిన్‌ కారణం కౌన్సెల్‌. యాడ్స్‌ను కౌన్సెల్‌ ద్వారానే ఇచ్చేవారు. బాడీలో రన్నింగ్‌ ప్రొడ్యూసర్లే ఉండాలని అన్నప్పుడు ఎలక్షన్లకు వెళ్లారు. నన్ను ప్రెసిడెంట్‌, ఆపొజిషన్‌గా రామ్మోహనరావును పెట్టారు. అలా నాకిష్టం లేకపోయినా, అందరి బలవంతం మీద ఎలక్షన్లు ఆగిపోయాయి. నాకిదంతా నచ్చలేదు. ఇప్పుడు గిల్డ్‌లో మేం 20 మంది యాక్టివ్‌ ప్రొడ్యూసర్లం.

ఆర్కే: సినిమా బడ్జెట్‌లో పబ్లిసిటీ బడ్జెట్‌ ఎంత ఉంటుంది?

దిల్‌ రాజు: స్టార్‌ హీరో సినిమాకు 3 కోట్లు. మిడ్‌ రేంజ్‌ హీరోకు ఒకటిన్నర నుంచి రెండు కోట్లు, చిన్న హీరోకు 75 లక్షల నుంచి కోటి రూపాయలు పెడతాను. అందరూ నన్నే అనుసరిస్తారు. కానీ ఈ విషయంలో పోటీ పడం. కంటెంట్‌ ఇస్తే కనెక్ట్‌ అవుతాం. పెయిడ్‌ పబ్లిసిటీ వల్ల ఉపయోగం ఉండదు.

ఆర్కే: మీరొక్కరు టిక్కెట్‌ రేట్‌ తగ్గించి రిలీజ్‌ చేస్తారట?

దిల్‌ రాజు: పాండమిక్‌ తర్వాత, టిక్కెట్‌ రేట్లు పెంచడం వల్ల ఆడియన్స్‌ థియేటర్లకు రావడం తగ్గుతూ వచ్చింది. ప్రేక్షకులు ఖర్చు పెట్టే సామర్థ్యం తగ్గింది.

ఆర్కే: వివాదాలకు అతీతం అయిపోదామని అనిపించడం లేదా?

దిల్‌ రాజు: అందుకే ఎప్పుడూ నేను స్టేట్‌మెంట్లు ఇవ్వను. కోపమొస్తుంది. ప్రెస్‌మీట్‌ పెట్టి తిట్టేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీ సమస్య మాది. కామన్‌ మ్యాన్‌కి, ప్రేక్షకుడికి ఏం అవసరం? వాళ్లకు ఆసక్తి కలిగించే కంటెంట్‌ ఇంకా చాలా ఉంటున్నాయి.

ఆర్కే: పెళ్లి ఆలోచన మీకొచ్చిందా? మీ అమ్మాయికి వచ్చిందా?

దిల్‌ రాజు: భార్య పోయిన తర్వాత రెండేళ్ల పాటు న్యాచురల్‌ స్ట్రగుల్స్‌ ఉంటాయి కదా? భార్య పోయాక అల్లుడూ, కూతురూ నాతోనే ఉన్నారు. నాకున్న వేరే వ్యాపకం గ్యాంబ్లింగ్‌ ఒక్కటే! ఇలా ఉండిపోవడం సరైనది కాదని పేరెంట్స్‌ మాట్లాడడం మొదలుపెడితే కూతురు సపోర్ట్‌ చేసింది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా బాగా ఒత్తిడి చేశారు. అప్పుడు నా వయసు 47. ఆవిడది హైదరాబాదే! నా ఫ్యామిలీ, ప్రొషెషనల్‌ లైఫ్‌ డిస్టర్బ్‌ కావద్దనే ఆలోచనతో ఆవిడను అన్ని విధాలా ప్రిపేర్‌ చేసి, చేసుకున్నాను.

ఆర్కే: మీ బాబుకు ఏం పేరు పెట్టారు?

దిల్‌ రాజు: నా ఇద్దరు భార్యల పేర్లు వచ్చేలా ‘అన్వయి’ అని పెట్టాం

ఇరవై ఏళ్లలో 50 సినిమాలు తీశాను. పని పూర్తవగానే ఇంటికెళ్లిపోతాను. ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎవర్నీ కలవను. పొద్దున్న ఐదింటికి లేస్తాను. రాత్రి పది గంటలకు పడుకుంటాను. నాకొక లైఫ్‌ స్టైల్‌ ఉంది. అన్ని భాషల్లో నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌ అనిపించుకోవాలి. సక్సెస్‌ శాతం పది నుంచి ఇరవయ్యే ఉంటుంది. అయితే నా సక్సెస్‌ పర్సెంటేజ్‌ పడిపోకుండా హోల్డ్‌ చేసే పనిలో ఉన్నాను.

Updated Date - 2023-04-15T22:14:50+05:30 IST