Kaikala: సినీ ప్రయాణంలో పెద్దన్నలా నిలిచారు
ABN , First Publish Date - 2022-12-24T12:40:41+05:30 IST
తన సినీ ప్రయాణంలో పలు విధాలుగా సహకరించిన లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) తనకు పెద్దన్నలా
తన సినీ ప్రయాణంలో పలు విధాలుగా సహకరించిన లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) తనకు పెద్దన్నలా సలహాలిచ్చారని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ (Katragadda Prasad) పేర్కొన్నారు. నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆయన కైకాలతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల మృతి తెలుగు సినీ రంగానికే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.
తాను 1988లో తొలిసారి సుమన్ హీరోగా నిర్మించిన ‘బందిపోటు’ (Bandipotu) చిత్రం మొదలు చివరి చిత్రం ‘మాఇంటి ఆడపడుచు’ వరకు కైకాలతో తన సినీ ప్రయాణం సాగిందన్నారు. తాను నిర్మించిన అన్ని చిత్రాల్లో ఆయన నటించారని, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వద్దకు వచ్చేసరికి రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదన్నారు. సినిమా బడ్జెట్‌కు అనుగుణంగా రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పిన పెద్ద మనసున్న నటుడు అని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌తో తీసిన ‘కాలేజీ బుల్లోడు’ చిత్రం నుంచి ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారని తెలిపారు. గత ఐదారు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసినా.. ఇంత త్వరగా ఈ విషాదకర వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు కాట్రగడ్డ ప్రసాద్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కాగా, కైకాల సత్యనారాయణ పలు తమిళ చిత్రాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే.