Kaikala Satyanarayana-NTR: ఎన్టీఆర్కి అవమానం.. అందుకే కొత్త పార్టీ!
ABN , First Publish Date - 2022-12-24T11:56:02+05:30 IST
నందమూరి తారక రామారావు (NT Ramarao)ని కొందరు రాజకీయ ప్రముఖులు అవమానించారు.. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రం..
నందమూరి తారక రామారావు (NT Ramarao)ని కొందరు రాజకీయ ప్రముఖులు అవమానించారు.. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రం చేసి కొత్త పార్టీని స్థాపించారని తెలిపారు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana). అప్పట్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు.
కైకాల మాట్లాడుతూ.. ‘‘రామారావుగారి దగ్గర నాకు చాలా స్వతంత్రం. చివరివరకు అదే రిలేషన్ ఉంది. సీఎం అయినా ఇంటికొచ్చి మా అమ్మను పలకరించారు. ఆయన టీడీపీ పెట్టడానికి అసలు కారణం ఏంటో నాతో చర్చించారు. ప్రజలు గుర్తించినందున వాళ్ల రుణం తీర్చుకోడానికి ఏదో ఒకటి చేయాలన్నారు. ఆయన జాతకం ప్రకారం 60 ఏళ్లు వచ్చేసరికి లైన్ మార్చేయాలి. అప్పట్లో బీవీ మోహనరెడ్డి రాజకీయాల్లోకి వెళ్లాలని సలహా ఇచ్చారు. సరోజినీ పుల్లారెడ్డి దగ్గరికి ఓసారి ఆయన వెళ్తే రెండుగంటలు కూర్చోబెట్టి, కలవకుండా అవమానించారు. తర్వాత వెంకట్రామారెడ్డిగారు ఆయన్ని లోపలకు రానివ్వలేదు. మూడు నాలుగు నెలలకు ఓ సీఎంను మార్చేసేవారు. అదే సమయంలో నాదెండ్ల భాస్కరరావు కూడా వచ్చారు. రాజకీయాల గురించి మాకేమీ తెలియక.. ఆయన చెప్పేవారు. అలా ఓ శుభ ముహూర్తంలో పార్టీ ప్రారంభించారు. నన్నూ రమ్మన్నారు గానీ సున్నితంగా తిరస్కరించాను. 94లో మొదట నన్ను నన్ను కైకలూరులో నిలబెట్టాలనుకున్నారు. నేను ముదుమలైలో వర్షాల్లో ఇరుక్కుపోయా. విషయం తెలీలేదు. చివరకు ఎన్నికలు అయిపోయి.. మంత్రివర్గం కూడా పెట్టేశాక అభినందిద్దామని వెళ్తే తిట్టారు. ‘‘బుద్ధీ జ్ఞానం ఉన్నాయా.. మనిద్దరం బతికున్నన్నాళ్లు పక్కపక్కన ఉండాల్సిందే. ఎన్ని సార్లు ఫోన్ చేశాను’’ అన్నారు. తర్వాత ఓరోజు తెల్లారే పిలిచి.. నాకేమీ చేయలేకపోయానంటూ రాజ్యసభ సభ్యత్వం ఇస్తానన్నారు. కానీ మళ్లీ మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామని రెండు రోజుల ముందు చెప్పారు. 85వేల మెజార్టీతో గెలిచా..’’ అని చెప్పుకొచ్చారు.