Celebrities on Dasara : చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక

ABN , First Publish Date - 2023-10-22T10:43:48+05:30 IST

చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకే ‘విజయదశమి’. ఈ సీజన్‌లో దుర్గామాత పూజలతో దేశంలోని అన్ని ప్రాంతాలు కళకళలాడుతాయి. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా అందరిలాగే దసరా వేళ... కుటుంబం చెంతకు చేరిపోతారు సినీతారలు.

Celebrities on Dasara : చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక

చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకే ‘విజయదశమి’. ఈ సీజన్‌లో దుర్గామాత పూజలతో దేశంలోని అన్ని ప్రాంతాలు కళకళలాడుతాయి. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా అందరిలాగే దసరా వేళ... కుటుంబం చెంతకు చేరిపోతారు సినీతారలు. ఈ సరదా దసరాతో ముడిపడి ఉన్న కొందరు తారల మధుర జ్ఞాపకాలివి... (Dasara Special)

దాండియా ఆడాల్సిందే...

నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తా. వీధిలో ఇరుగుపొరుగుతో కలిసి దాండియా ఆడుతాం. అది పూర్తయ్యాక నచ్చిన వంటకాలను ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతాం. పండగవేళ... తొమ్మిదిరోజుల పాటు రోజుకొక కొత్త డ్రెస్‌తో హల్‌చల్‌ చేస్తుంటా. నేను ఢిల్లీలో చదువుకునే రోజుల్లో స్నేహితులందరం కలసి రామ్‌లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనేవాళ్లం. అక్కడ జరిగే రావణ దహనం కన్నుల పండుగగా ఉండేది. నేను ముంబాయికి మకాం మార్చాకే అక్కడ జరిగే నవరాత్రి వేడుకలు, గార్బా గురించి తెలుసుకున్నా.

- మౌనీ రాయ్‌ (mouny roy)

urvashirautela.jpg

తొమ్మిది అద్భుతాలు (Urvashi Routhela)

నా దృష్టిలో నవరాత్రి అంటే తొమ్మిది అద్భుతాలు. శక్తిమంతమైన మహిళ సాధించిన అద్భుతాలకు ప్రతిరూపమే ఈ పండుగ. అందుకే ఈ పండగకి తొమ్మిది రకాల విశిష్టతలు ఉన్నాయి. అవేంటంటే... శక్తి, సంతోషం, మానవత్వం, శాంతి, విజ్ఞానం, భక్తి, పేరు, ప్రఖ్యాతులు, ఆరోగ్యం. నవరాత్రుల గొప్పతనం అర్థమయ్యాక ఆయా పండగల విశిష్టత తెలుసుకోవడం మొదలెట్టా. నవరాత్రుల్లో వివిధ రూపాల్లో కొలువయ్యే అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తా.

- ఊర్వశి రౌటేలా

Shradda-kapoor.jpg

ఒక్కో వర్ణం... ఒక్కో ప్రతీక (Shradda Kapoor)

నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తాం. అందుకే తొమ్మిది రంగుల వస్త్రాలు ధరించాలి. మొదటిరోజు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. తెలుపు శాంతి, ప్రశాంతత, స్వచ్ఛతకి సంకేతం. రెండో రోజు ఎరుపు రంగు వస్త్రాలు ఽధరించడం మంచిది. ఇది విజయం, శక్తికి ప్రతీక. మూడో రోజు నీలం రంగు దస్తులు... ఇది అన్ని భయాలను తొలగిస్తుంది. నాలుగో రోజు పసుపు రంగు... ఆనందం, ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఐదో రోజు ఆకుపచ్చ రంగు... సంతానోత్పత్తి, ఎదుగుదల, ప్రశాంతతను సూచిస్తుంది. ఆరో రోజు బూడిద రంగు... ఇది చెడు అలవాట్లను తొలగిస్తుంది. ఏడో రోజు నారింజ రంగు... జీవితంలో ఆనందం, సానుకూలతను తెస్తుంది. ఎనిమిదో రోజు నెమలి ఆకుపచ్చ రంగు... ప్రత్యేకతకు ప్రతీక. తొమ్మిదో రోజు గులాబీ రంగు దుస్తులు... కరుణ, ఆప్యాయత, సామరస్యాన్ని సూచిస్తుంది. ఇలా ఒక్కో వర్ణం ఒక్కో గుణానికి ప్రతీక అని పెద్దలు చెప్పిన వాటిని నేను ఇప్పటికీ పాటిస్తా.

- శ్రద్ధాకపూర్‌

rajkummar-rao.jpg

నా స్టయిల్‌లో గార్బా(Rajkumar rao)

దసరా అంటే ఠక్కున నాకు గుర్తొచ్చేవి.. పూజలు, ఉపవాసాలు, గల్లీలో ప్రదర్శించే రామ్‌లీలా. చిన్నప్పుడు నవరాత్రుల్లో అమ్మతో పాటు నేనూ ఉపవాసం ఉండేవాడిని. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు నాకొక బెంగాలీ స్నేహితుడు ఉండేవాడు. దసరా వస్తే చాలు... ఇద్దరం కలసి దగ్గరలో ఉన్న దుర్గా మండపాలన్నింటినీ చుట్టొచ్చేవాళ్లం. నవరాత్రులంటే గార్బా డ్యాన్స్‌ ఉండాల్సిందే. ఒకప్పుడు గార్బాని సినిమాల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం నా స్టైల్‌లో గార్బా ఆడుతా. నాకు ఇష్టమైన డ్యాన్స్‌ ఫామ్స్‌లో గార్బా ఒకటి.

- రాజ్‌కుమార్‌ రావు

Untitled-1.jpg

దసరాకి అక్కడికే... (Raishab Shetty)

నాకు ఇష్టమైన పండుగల్లో దసరా ఒకటి. చిన్నప్పుడు దసరా సెలవులకు కుటుంబమంతా కలసి అజ్జానమనేకి(కర్ణాటక) వెళ్లేవాళ్లం. అది మా ఫేవరెట్‌ పిక్నిక్‌ స్పాట్‌. నవరాత్రులకు అక్కడే ఉండి ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేవాళ్లం. మా కజిన్స్‌ అందరం చెరో పని పంచుకునేవాళ్లం. అమ్మాయిలంతా పూలమాలలు కడుతూ ఉంటే, అబ్బాయిలం వాటితో ఇంటిని అలంకరించేవాళ్లం. ఘుమఘుమలాడే పిండివంటకాలు చేస్తే... మేమంతా పోటీపడి మరీ లాగించేవాళ్లం. నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసే గోడి పాయసం నా ఫేవరెట్‌. ఇప్పుడంటే షూటింగ్స్‌, ఇతరత్రా పనులు వల్ల కుటుంబమంతా కలుసుకోలేకపోతున్నాం గానీ అప్పట్లో ఎక్కడున్నా దసరాకి మాత్రం అందరం ఓ చోట వాలిపోయేవాళ్లం.

- రిషబ్‌ శెట్టి

Updated Date - 2023-10-22T10:43:48+05:30 IST