The Kerala Story: ‘కేరళ స్టోరీ’లో అలా చూపించడమే వివాదానికి కారణమా?

ABN , First Publish Date - 2023-05-01T15:31:47+05:30 IST

అదాశర్మ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ, యోగిత బిహాని కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తోసేన్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

The Kerala Story: ‘కేరళ స్టోరీ’లో అలా చూపించడమే వివాదానికి కారణమా?

అదాశర్మ (Adha sharma), సిద్ధి ఇద్నానీ(Siddhi idnani), సోనియా బలానీ, యోగిత బిహాని కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). సుదీప్తోసేన్‌ (Sudipto SEN) ఈ చిత్రానికి దర్శకుడు. విపుల్‌ అమృత్‌లాల్‌ నిర్మాత. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సినిమా కథ రివీల్‌ అయినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఏప్రిల్‌ 26న విడుదల చేసిన ట్రైలర్‌తో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సెన్సార్‌ బోర్డు అనుమతి రావడంతో మే 5న విడుదలకు సిద్థమైంది. అయితే ఇప్పుడీ సినిమా విడుదల గురించి కేరళలో గట్టి పోరాటమే జరుగుతోంది. సినిమా విడుదల నిలిపేయాలని, నిషేదించాలని అధికార, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. (The Kerala Story controversy)

అసలు విషయంలోకి వెళ్తే... కొన్నేళ్లగా కేరళలో జరుగుతున్న ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. కేరళలోని 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి, వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివిధ మతాలకు చెందిన నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, ఉగ్ర సంస్థల కోసం పని చేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా మండిపడ్డారు. కేరళలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు హిందీ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారని పినరయి విజయన్‌ (Pinarayi vijayan) మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి రాజకీయాలు కేరళలో ఉండవని తెలిపారు. ఈ చిత్రాన్ని నిషేధించాలని అధికార పార్టీతోపాటు, కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించాయి. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా ేస్వచ్ఛ లైసెన్సు కాదంటూ మండిపడ్డాయి. మత విశ్వాసాలను దెబ్బ తీయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తోందని ఐయూఎంఎల్‌ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కేరళలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తుంటే క్రిస్టియన్‌ అసోసియేషన్స్‌ మాత్రం మద్దతు పలుకుతున్నాయి. ‘లవ్‌ జిహాద్‌’కు ఛిద్రమైన ఎన్నో కేరళ కుటుంబాల కథను ఇది ఆవిష్కరిస్తుందని సీఏఎస్‌ఏ పేర్కొంది. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండే ఇలాంటి చిత్రాలు తీయొద్దని అధికార, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

మూడు రోజుల్లో... కోట్ల వ్యూస్‌...

ఏప్రిల్‌ 26న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కేవలం మూడు రోజుల్లో 1.3 కోట్లు వ్యూస్‌ సాధించింది. ‘ఇందులో పెద్ద స్టార్స్‌ లేరు. భారీ స్టూడియో సెట్స్‌ లేవు.. నిజం, నిజాయతీ, కమిట్‌మెంట్‌ మాత్రమే ఉన్నాయి. ‘ది కేరళ స్టోరీ’ మీకోసం. ఈ సినిమా చూడటానికి అందరికీ ఆహ్వానం’’ అని దర్శకుడు ట్వీట్‌ చేశారు. సినిమా విడుదలపై జరుగుతున్న వివాదంపై దర్శకుడు సుదీప్తో సేన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘కేరళ వాసులారా.. అక్షరాస్యతలో మీరు అగ్రస్థానంలో ఉన్నారు. విద్య మనకు సహనాన్ని నేర్పింది. సినిమా చూడకుండానే కంగారుగా ఒక అభిప్రాయానికి ఎందుకు వస్తారు. మొదట సినిమా చూడండి. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు చర్చిద్దాం. ఈ చిత్రం కోసం ఏడేళ్లు కేరళలో పనిచేశాం, ఎంతో రీసెర్చ్‌ చేశాం. మేమూ మీలో మేము భాగమే. మనమందరం భారతీయులమే’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-05-01T15:32:13+05:30 IST