Pavitra Lokesh: ఆయన లేకపోతే ఆత్మహత్యే శరణ్యం
ABN , First Publish Date - 2023-05-24T01:53:16+05:30 IST
నరేశ్‌తో తనకున్న బంధం గురించి తాజాగా పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చారు. నరేశ్‌తో కలిసి ఆమె నటించిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం ఈ నెల 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నరేశ్‌గారు లేకపోతే ఆత్మహత్య చేసుకొనేదాన్నేమో.. అని చెప్పుకొచ్చారు.
పవిత్రా లోకేశ్.. సహాయ నటిగా కొన్ని మంచి సినిమాలు చేశారామె. అయితే నటనతో కంటే, వ్యక్తిగత విషయాలతోనే ఆమె పేరు వార్తల్లో ఎక్కువగా వినిపించింది. నరేశ్ - పవిత్రా లోకేశ్‌ల వ్యవహారం ఆమెను హాట్ టాపిక్‌గా మార్చాయి. వీరిద్దరూ కలసి ‘మళ్లీ పెళ్లి’లో నటించడం, ఈ కథ వారిద్దరి వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండడంతో మరోసారి వార్తల్లో నిలిచారామె. ఈనెల 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా పవిత్ర చెప్పిన ‘మళ్లీ పెళ్లి’ ముచ్చట్లు.
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచీ నాకొచ్చిన పాత్రల్ని చేసుకొంటూ వెళ్లాను. హీరోయిన్‌గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సహాయక పాత్రలు నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ‘మళ్లీ పెళ్లి’లో నేను హీరోయినా? కాదా? అనేది నేను చెప్పకూడదు. ప్రేక్షకులే నిర్ణయించాలి. కథని నడిపే ప్రధాన పాత్ర ఇది’’
‘‘అందరూ అనుకొంటున్నట్టు ఇది బయోపిక్ కాదు. అందరి జీవితాల్లో జరిగే విషయాల సమాహారమే. ఎం.ఎస్.రాజు గారి సినిమాలు కాస్త ‘బోల్డ్’గా ఉంటాయి. ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశాలు, సందర్భాలూ కనిపిస్తాయి. ‘బోల్డ్’ అంటే అర్థం.. హాట్ అని కాదు. సమాజంలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికీ ఇబ్బంది పడుతుంటాం. అలాంటివన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి, వినిపిస్తాయి. పాత్రలు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకొంటాయి’’
‘‘ఎం.ఎస్.రాజుగారు కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. సెకండాఫ్‌కి కనెక్ట్ అయిపోయా. నరేశ్‌గారి పాత్ర, నా పాత్ర.. రెండూ గొప్పగానే ఉంటాయి. ఈ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేరు. మా పాత్రలకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు. ఓ సినిమా నుంచి ఎన్నిరకాల ఎమోషన్స్ ప్రేక్షకులు కోరుకొంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’’
‘‘నరేశ్‌గారితో నా బంధం దాగుడుమూతల ఆటలా సాగింది. చాలామంది చాలా రకాలుగా అనుకొన్నారు. మా బంధాన్ని మేం బయటపెట్టాలని అనుకోలేదు. పరిస్థితుల వల్ల అన్ని విషయాలూ బయటకు వచ్చాయి. నా జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నరేశ్‌గారు లేకపోతే ఆత్మహత్య చేసుకొనేదాన్నేమో. నా పక్కనే ఉండి నాకు మోరల్ సపోర్ట్ అందించారాయన’’.