Tamannaa : ఇంతకంటే కోరేదేముంది..?
ABN , First Publish Date - 2023-08-05T00:09:15+05:30 IST
తమన్నా కెరీర్ ఎప్పుడూ లేనంత జోష్‌లో ఉంది. సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. ఒకేసారి చిరంజీవితో ‘భోళా శంకర్’, రజనీకాంత్‌తో ‘జైలర్’ చిత్రాల్లో నటించింది.
తమన్నా కెరీర్ ఎప్పుడూ లేనంత జోష్‌లో ఉంది. సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. ఒకేసారి చిరంజీవితో ‘భోళా శంకర్’, రజనీకాంత్‌తో ‘జైలర్’ చిత్రాల్లో నటించింది. ఇవి రెండూ ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా తమన్నా ఈ రెండు చిత్రాల గురించీ ఏం చెప్పిందంటే..?
‘‘ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇద్దరి సినిమాల్లోనూ నటించాను. అవి రెండూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఓ కథానాయికగా ఇంతకంటే కోరుకొనేది ఏముంది? ఇదో కలలా ఉంది. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే. కాబట్టి రెండూ నాకు ప్రత్యేకమే. నా కెరీర్లో ఇదో మర్చిపోలేని మలుపు అనిపిస్తోంది’’.
‘‘ఇది వరకు చిరు సార్‌తో ‘సైరా’లో నటించాను. అందులో ఇద్దరం డాన్స్ చేసే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదులుకోలేదు. ‘మిల్కీ బ్యూటీ’లో ఆయనతో కలిసి స్టెప్పులేసే అవకాశం వచ్చింది. చిరు గొప్ప డాన్సర్. ఆయన మేనరిజం ఇప్పటికీ మేం ఫాలో అవుతూనే ఉన్నాం. ‘మిల్కీ బ్యూటీ’ని అందమైన లొకేషన్లలో తెరకెక్కించాం. అదో మంచి అనుభవం’’.
‘‘వేదాళంలో పోలిస్తే.. ఈ సినిమాలో నా పాత్ర పరిధి ఎక్కువే. కీర్తి సురేశ్లాంటి మంచి నటితో స్ర్కీన్ పంచుకోవడం ఆనందంగా ఉంది. కీర్తి ఈదేశంలోని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరు. తన నటన, స్ర్కీన్ ప్రెజెన్స్ బాగుంటాయి. ‘కాళిదాసు’ తరవాత సుశాంత్ తో మళ్లీ కలిసి నటించాను. అప్పటి రోజులు నా కళ్ల ముందు మెదిలాయి’’
‘‘మెహర్ రమేశ్ చాలా స్పష్టత ఉన్న దర్శకుడు. ఆయనకేం కావాలో బాగా తెలుసు. ప్రతీ పాత్రనీ అందంగా మలిచారు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఈ టైటిల్‌కి తగ్గట్టు భోళా మనిషి’’.
‘‘ఇటీవల రెండు వెబ్ సిరీస్‌లు చేశాను. అందులో నా గురించీ, నా నటన గురించి, బోల్డ్‌గా కనిపించిన విధానం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ నేను వాటిని పట్టించుకోను. ‘ఈ వెబ్ సిరీస్‌లో నేను బోల్డ్‌గా కనిపిస్తా..’ అని ముందే చెప్పాను. వెబ్ సిరీస్‌లు నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక మీదటా ఇలాంటి ప్రయత్నాలు చేస్తా’’.
‘‘నా కెరీర్ ఎప్పుడూ లేనంత స్పీడుగా ఉంది. అన్ని భాషల్లోనూ నటిస్తున్నా. పెళ్లి గురించి ఇప్పుడే ఏం ఆలోచించడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వస్తే.. తప్పకుండా అందరికీ చెబుతాను’’.