Ugram Film Review: అల్లరి నరేష్ కొత్త అవతారం ఎలా ఉందంటే..
ABN , First Publish Date - 2023-05-05T17:18:14+05:30 IST
కామెడీ సినిమాలతో నవ్విస్తూ వుండే అల్లరి నరేష్ కొత్త బాటను ఎంచుకొని కొంచెం సీరియస్ కథలను ఎంచుకున్నాడు. ఆలా వచ్చిందే ఈ 'ఉగ్రం' కూడా. ఇందులో అతను ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసాడు, మరి సినిమా ఎలా ఉందంటే...
సినిమా: ఉగ్రం
నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్ (MirnaMenon), ఇంద్రజ (Indraja), శత్రు తదితరులు
కథ: తూము వెంకట్
మాటలు: అబ్బూరి రవి
ఛాయాగ్రహణం: జె సిద్ధార్థ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)
నిర్మాతలు: సాహూ గార్లపాటి, సురేష్ పెద్ది
-- సురేష్ కవిరాయని
అల్లరి నరేష్ (Allari Naresh) అనగానే మనకి కామెడీ సినిమాలు అందులో అల్లరి చేసే కుర్రాడిగా అందరికీ తెలుసు. అయితే మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'మహర్షి' (Maharshi) సినిమా తరువాత అతను కొత్త బాటను ఎంచుకున్నాడు. కామెడీకి చిన్న బ్రేక్ ఇచ్చి, కొంచెం సీరియస్ గా వుండే కథలను ఎంచుకున్నాడు. ఆలా వచ్చినవే 'నాంది' (Naandi), 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam). 'నాంది' సినిమా మంచి పేరు తెచ్చింది, ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడలతో మళ్ళీ చేతులు కలిపి ‘ఉగ్రం’ (UgramFilmReview) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నరేష్ ఒక యాంగ్రీ పోలీస్ పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమా విడుదలకి ముందు ఈ కథ మిస్సింగ్ పర్సన్స్ నేపధ్యం అని అన్నారు. (UgramReview) ఈ సినిమా ఎలా ఉంది, నరేష్ కి ఇంకో బ్రేక్ ఇస్తుందో లేదో చూద్దాం.
Ugram story కథ:
వరంగల్ లో శివకుమార్ (నరేష్) సిన్సియర్ పోలీసాఫీసర్ గా పని చేస్తుంటాడు. అతను భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురుతో కలిసి కారులో వెళ్తూ ఉండగా ఆ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. భార్య, కూతురు గాయపడతారు, ఆ ఇద్దరినీ హాస్పిటల్లో జాయిన్ చేసి, అదే హాస్పిటల్ లో పడుకుండిపోతాడు. లేచాక కూతురికి, భార్యకి ఎలావుందో అని హాస్పిటల్ వాళ్ళని అడుగుతాడు, మీరు ఎవరినీ తీసుకురాలేదని, మీరొక్కరే వచ్చారని అక్కడున్న డాక్టర్లు చెప్తారు. యాక్సిడెంట్లో శివ తలకు దెబ్బ తగలడం వలన అతనికి డిమెన్షియా (Dementia) అనే వ్యాధి వచ్చిందని, దానివల్ల లేనివాళ్ళని కూడా వున్నారు అని ఊహించుకొని, భార్య, కూతురిని తీసుకురాకపోయినా తీసుకొచ్చానని ఊహించుకున్నాడని డాక్టర్ (ఇంద్రజ) చెబుతుంది. అదే డాక్టర్ వెంటనే పోలీస్ లకు ఫోన్ చేస్తే, వాళ్ళు హాస్పిటల్ వచ్చి సిసిటివి కెమెరాలు చూస్తే అందులో శివ ఒక్కడే హాస్పిటల్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అలా అయితే మరి శివ భార్య, కూతురు ఏమయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారు? నగరంలో వరసగా మిస్ అవుతున్న కేసులకు ఈ ఇద్దరికీ ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ వాళ్ళు బతికే వున్నారా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇవన్నీ తెలియాలంటే 'ఉగ్రం' (UgramFilmReview) సినిమా చూసి తెలుసుకోవాల్సిందే !
విశ్లేషణ:
దర్శకుడు విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కథానాయకుడిగా ‘నాంది’ అనే సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. #UgramFilmReview ఆ సినిమా అతనికి మంచి పేరే తెచ్చి పెట్టింది. అతను కొంచెం రియాలిటీ సినిమాలు చేస్తాడన్న భావం ఏర్పడింది. మళ్ళీ అదే నరేష్ తో ఇప్పుడు ఈ 'ఉగ్రం' (UgramReview) సినిమా కూడా రావటం ఈ కథ నేపధ్యం మిస్సింగ్ పర్సన్స్ అనటం వలన ఇది కూడా కొంచెం రియాలిటీ కి దగ్గరగా వున్న కథ అని అనిపించింది. అందుకే ఈ సినిమా మీద ఆసక్తి కూడా కలిగింది. విజయ్ ఈ సినిమాని ఆసక్తికరంగా మొదలెట్టాడు, మొదటి సన్నివేశంలో యాక్సిడెంట్ అవటం, హాస్పిటల్ లో నరేష్ తన భార్య, కూతురు గురించి విచారణ చెయ్యటం, అక్కడి స్టాఫ్ వాళ్ళతో రాలేదు అనటం ఇవన్నీ బాగున్నాయి. అలాగే అదే హాస్పిటల్ లో వేరే వాళ్ళు కూడా తమ వాళ్ళు గురించి అడగటం, వాళ్ళకి కూడా అదే సమాధానం ఇవ్వటం చూపించాడు. ఇక్కడవరకు కథ బాగుంది, సీరియస్ గా వుంది.
వెంటనే నరేష్ ఫ్లాష్ బ్యాక్ కి వెళతాడు దర్శకుడు. సడన్ గా మిస్సింగ్ పర్సన్స్ నుండి నరేష్ ప్రేమ, పెళ్లి ఆ తరువాత అతను పనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి భార్యని పట్టించుకోకపోవటం ఇవన్నీ కొంచెం కథని మిస్ లీడ్ చేసాయి. దానికి తోడు ఇదొక సీరియస్ సబ్జెక్టు, దీనికి మధ్య మధ్యలో పాటలు కొంచెం విసుగు పుట్టిస్తాయి. దర్శకుడు మంచి కథని ఎంచుకున్నాడు, కానీ దాని మీద మరికొంచెం పరిశోధన చేసి, ఇంకా కొంచెం ఆమోదయోగ్యాంగా (Convincing) ఉండేట్టు తీస్తే బాగుండేది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఆ తరువాత మామూలుగా కొన్ని ఉంటాయి. కొంతమంది హిజ్రాలు పేరును ఎలా వాడుకుంటున్నారు, ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే విషయం, ఆ సన్నివేశాలు బాగున్నాయి.
అదే విధంగా పోరాట సన్నివేశాలు కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే మరీ ఓవర్ చేశారేమో అనిపిస్తుంది. హిజ్రాలతో పోరాట సన్నివేశం, విరామం ముందు వచ్చే పోరాట సన్నివేశం బాగున్నాయి. మొదటి సగం సినిమా బాగా సాగుతుంది, కానీ దర్శకుడు రెండో సగంలోనే కొంచెం గాడి తప్పాడు. మరీ కమర్షియల్ గా వెళ్ళిపోయాడు, అందుకే కథ ఆసక్తికరంగా లేకపోవటం అయింది. ఎప్పుడయితే విలన్ ని రివీల్ చేసాడో, కథ అక్కడికే వస్తుందని ప్రేక్షకుడికి తెలిసిపోతుంది, అందుకని సన్నివేశాలు ఊచించుకోవచ్చు. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కొంచెం బిలీవబుల్ గా తీస్తే బాగుండేది. ఏమైనా వీళ్లిద్దరి మొదటి సినిమా 'నాంది' తో పోలిస్తే ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి.
నటీనటులు ఎలా చేశారంటే:
అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో బాగా నటించాడు, ఇలాంటి పాత్ర చెయ్యడం నరేష్ కి కొత్త. సినిమా అంతా అతని భుజస్కందాలపై నడుస్తుంది. మిర్నా మీనన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది అని చెప్పాలి. #UgramFilmReview నరేష్ కూతురిగా వేసిన చిన్న అమ్మాయి క్యూట్ గా వుంది. శత్రుకి మంచి పాత్ర లభించింది ఇందులో. ఇంద్రజ డాక్టరుగా కనపడుతుంది. మిగతా నటీనటులు కూడా బాగానే సపోర్ట్ చేశారు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగుంది. పాటలు ఈ సినిమాకు అంత ముఖ్యం కాదు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది.
చివరగా, దర్శకుడు విజయ్ కనకమేడల ఈ 'ఉగ్రం' సినిమాలో అల్లరి నరేష్ ని ఒక మాస్ పాత్రలో కొత్తగా చూపించాడు. కథ కొత్తగా వున్నా, దానిమీద కొంచెం పరిశోధన చేసి, నమ్మేట్టు చూపిస్తే బాగుండేది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని యాక్షన్ సీన్స్ మరీ ఓవర్ గా కూడా ఉంటాయి. ఇదొక టైం పాస్ సినిమా అని అనుకోవచ్చు.