Kabzaa Review: ఉపేంద్ర నటించిన ఈ సినిమా చూడాలంటే ఇది ఉండాలి
ABN , First Publish Date - 2023-03-17T20:58:22+05:30 IST
ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి పెద్ద నటులు వున్న 'కబ్జా' కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి విడుదల అయింది. శ్రియ శరన్ కథానాయిక, ఆర్ చంద్రు దీనికి దర్శకుడు. మరి సినిమా ఎలా వుంది అంటే...
సినిమా: కబ్జా
నటీనటులు: ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ, సుధ, మురళీ శర్మ తదితరులు
ఛాయాగ్రహణం: ఏ జే శెట్టి
సంగీతం: రవి బస్రూర్
రచన, దర్శకత్వం: ఆర్. చంద్రు (R Chundru)
నిర్మాతలు : ఆనంద్ పండిట్, ఆర్ చంద్రు, అలంకార్ పాండియన్
-- సురేష్ కవిరాయని
దక్షిణాదిన ఒకప్పుడు వెనుకబడి వున్న కన్నడ సినిమా పరిశ్రమను ఇప్పుడు 'కెజియఫ్' (KGF), 'కాంతార' (Kantara) లాంటి సినిమాలు ఎక్కడికో తీసుకెళ్లాయి. అందుకని ఇప్పుడు కన్నడ సినిమా ఒక పాన్ ఇండియా సినిమాగా వస్తోంది అంటే, ఆ సినిమా మీద అందరి కళ్లు ఉంటాయి. ఇప్పుడు తాజాగా 'కబ్జా' (Kabzaa) అనే కన్నడ సినిమా అన్ని భాషలతో పాటు, తెలుగులో కూడా విడుదల అయింది. ఇందులో కన్నడంలో అగ్ర నటుల్లో ఒకరు అయిన ఉపేంద్ర (Upendra) కథానాయకుడిగా నటించగా, అతని పక్కన శ్రియ (Shirya Saran) కథానాయికగా నటించింది. కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) కూడా ఇందులో ఉండటం విశేషం. ట్రైలర్ ప్రచార చిత్రం చూస్తే ఈ సినిమా చాలా భారీగా తీసారని అర్థం అవుతోంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
Kabzaa story కథ:
ఇది ఒక పీరియడ్ డ్రామా. అంటే స్వాతంత్రం రాకముందు మొదలై.. వచ్చాక అంటే 1975 మధ్యలో జరిగిన కథ. అర్కేశ్వర (ఉపేంద్ర) పైలట్ అవ్వాలి అనుకుంటాడు, అవుతాడు కూడా. అతని తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో మరణిస్తే, తల్లి (సుధ), అన్నయ్య తనను పెంచి పెద్ద చేసారు అని వాళ్లిద్దరూ అంటే ఎనలేని ప్రేమ అతనికి. అలాగే అతని ప్రియురాలు అమరాపురం యువరాణి మధుమతి (శ్రియ). పైలట్ గా జాయిన్ అయ్యే ముందు 15 రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చిన ఆర్కేశ్వరుడుకి ఒక సంఘటనతో కుటుంబం అంతా చెల్లా చెదురు అయిపోతుంది. (Kabzaa Review) అన్నయ్య ని మాఫియా వాళ్ళు చంపేస్తారు, దానితో చిన్నప్పటి నుంచి భయపడే ఆర్కేశ్వరుడు ఇంక తట్టుకోలేక ధైర్యంతో మాఫియా కి ఎదురుతిరుగుతాడు. మధుమతి ని పెళ్లి చేసుకుందామని అనుకుంటే, మధుమతి తండ్రి వీర బహదూర్ (మురళీ శర్మ) తన కూతురిని ఆర్కేశ్వర కి ఇవ్వను, రాజ కుటుంబంలోని వ్యక్తికే ఇస్తాను అని అంటాడు. మరి తండ్రిని ఎదిరించి మధుమతి ఆర్కేశ్వరుడిని పెళ్లి చేసుకుండా? అలాగే మాఫియా కి ఎదురుతిరిగిన ఆర్కేశ్వరుడికి ఎదురయిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే 'కబ్జా' చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈమధ్య అదేంటో కానీ ఒక సినిమా హిట్ అయితే చాలు, అదే సినిమా తరహాలో దర్శకులు తీస్తున్నారు. 'కెజియఫ్' పెద్ద విజయం సాధించటంతో, ఇప్పుడు కథానాయకులు అందరూ గ్లామర్ ని వదిలేసి, నల్లగా, బ్యాక్ గ్రౌండ్ లో అంటే వెనకాల వాతావరణం కూడా నలుపు తరహా ఉండేట్టు చూసుకొని మరీ సినిమాలు చేస్తున్నారు. (Kabzaa Review) ఇప్పుడు వచ్చిన ఈ 'కబ్జా' (Kabzaa Review) కూడా అటువంటిదే. దర్శకుడు ఆర్. చంద్రు 'కెజియఫ్' తరహాలోనే ఈ సినిమాని కూడా తీసాడు. అయితే అందులో కొంచెం కథ వుంది, కథానాయకుడు కొంచెం యువకుడు, బాగా కనిపిస్తాడు, నమ్మే తరహాలో వున్నాడు. మంచి మంచి సన్నివేశాలతో అందులో కథని, కథానాయకుడిని బాగా ఎలివేట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
కానీ ఈ 'కబ్జా' సినిమాకి వచ్చేసరికి దర్శకుడు చంద్రు, 'కెజియఫ్' మాదిరి ఒక క్యారెక్టర్ ముందు వచ్చి (Kabzaa Review) సినిమా నేరేషన్ మొదలు పెడతాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అప్పుడు ఏమి జరిగిందో చెప్తాడు. అంతవరకు బాగానే వుంది కానీ, అసలు చంద్రు ఈ 'కబ్జా' తో ఏమి చెప్పాలని అనుకున్నాడో అస్సలు ఎవరికీ అర్థం కాలేదు. దీపావళి సామాను పేల్చినట్టు, పిస్తోలు, తుపాకులతో కాల్చుకోవటం, ఎవరు ఎవరిని కొడుతున్నారు, ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. చంపుడు, నరుకుడే. మన బాలకృష్ణ సినిమాలు అయినా అర్థం అవుతాయేమో కానీ, ఈ 'కబ్జా' మాత్రం అస్సలు అర్థం కాదు.
పోనీ కథ ఏమయినా సరిగా నేరేట్ చేశాడా అంటే అదీ లేదు. ఒక బవిరి గెడ్డం వాడు, గుబురు మీసాల వాడు వస్తాడు, వాడిని కథానాయకుడు చంపేస్తాడు, వాడి తరువాత ఇంకొకడు వీడికన్నా ఓ 200 కేజీల బరువున్న వాడు వస్తాడు అదే గెటప్ అంటే ముందు వాడికన్నా పెద్ద మీసాలు, పొడుగాటి జుత్తు, గెడ్డం, వాడు మాఫియా వాడు అని తెలియటం కోసం అదో రకమయిన దుస్తులు వేసుకొని వస్తాడు. వాడూ చస్తాడు. కథానాయకుడు మాత్రం తెల్లని చొక్కా వేసుకుంటాడు. రక్తం ఏరులయి ప్రవహిస్తూ ఉంటుంది, చనిపోయిన వ్యక్తులు వందల్లో ఉంటూ వుంటారు, కానీ కథానాయకుడి తెల్ల చొక్కా మీద మాత్ర ఒక్క రక్తపు బొట్టు పడదు.
ఇంక ఆ పేర్లు గుర్తు పెట్టుకోవటం కష్టం బాబోయ్. దుబాయ్ అంటాడు, సింగపూర్ అంటాడు, బ్యాంకాక్ అంటాడు ఇంకా ఏవేవో అంటూ ఉంటాడు, ప్రైవేట్ సైన్యం అంటూ వస్తూనే వుంటారు, కొట్టుకుంటూనే వుంటారు. మధ్య మధ్య లో అదేదో కొత్త స్టైల్ అనుకుంటా, సడన్ గా కొన్ని సెకండ్స్ సౌండ్, బొమ్మ అన్నీ ఆగిపోతాయి, మళ్ళీ వస్తూ ఉంటుంది. నాకయితే నా కళ్ళు పోతాయేమో అనిపించింది అలా చూడటం వలన, అలుపెరగని పోరాట సన్నివేశాలు ఉండటం వలన.
ఒక స్వాతంత్య్ర సమారయోధుని కొడుకు, అతి సౌమ్యుడు, నెమ్మదస్తుడు, భయపడే మనస్తత్వం వున్నవాడు అంత రౌద్రం గా ఎలా తయారయ్యాడు అని దర్శకుడు చెప్పాలని అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. అది చెప్పడానికి ఇంత తతంగం ఎందుకో. గొప్ప కండలతో, 200 కేజీల బరువుతో, చూడటానికి భయంకరంగా, గెడ్డం, పెద్ద మీసాలు, పెరిగిన జులపాల జుత్తు తో మనకు తెలిసిన అండర్ వరల్డ్ డాన్ ఎవరూ ఇలా లేరు. కానీ ఈ సినిమాలో అందరూ అలాంటి వారే.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటికీ తోడు సౌండ్ పొల్యూషన్. బాబోయ్ ఒక్కొక్కడు ఏమా అరుపులు. మామూలుగా ఎవరూ మాట్లాడారు, సౌమ్యంగా మాట్లాడరు. ఒకవేళ అలాంటి మాటలు కూడా చాలా గట్టిగా ఒక్కో పాత్రకి చెప్పించారు. అసలే దీపావళి టపాకాయల్లా సినిమా అంతా సౌండ్ పొల్యూషన్ అనుకుంటే, లౌడ్ గా ఒక్కో పాత్రకి డైలాగ్స్ చెప్పటం చెవులు నిజంగా పోతాయేమో అనిపించింది. రవి బస్రూర్ సంగీతం అన్నారు కానీ, అది సంగీతం కాదు, సౌండ్ పొల్యూషన్. పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రంలా, అన్నిటికీ అదే మోత మోయించాడు సినిమా అంతా. క్లైమాక్స్ కూడా 'బాహుబలి' లా చేద్దాం అనుకున్నాడేమో, సడన్ గా ఆగిపోయి 'కబ్జా' పార్ట్ 2 అని వేస్తాడు. ఇదే భరించలేము అనుకుంటే, దీనికో సీక్వెల్ కూడానా అని ప్రేక్షకుడు చాలా బరువుగా బయటకి వస్తూ ఉంటాడు.
ఎవరు ఎలా చేసారంటే:
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఉపేంద్ర సినిమాలో కథానాయకుడు. కానీ అతను అంత హెవీ పాత్రకు సూట్ కాలేదేమో అనిపించింది. ఎందుకంటే 'కెజియఫ్' కి ఈ సినిమా అంత అనుకరణే, అందులో యష్ (Yash) అనే నటుడు బాగుంటాడు, కానీ ఉపేంద్ర వయసు తెలిసిపోతోంది. దానికి తోడు గిరజాల జుట్టు, మీసాలు, పదిమందిని కొడితే నమ్మబుద్ధి కావాలి కదా, అలాంటిది వందలమందిని కొడుతూ ఉంటాడు. కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) చిన్న పాత్రలో కనపడతాడు. అంటే నేరేట్ చేస్తాడు కథని. అలాగే శ్రియ శరన్ బాగుంది. సుధ తల్లిగా చేసింది. మురళి శర్మ ని చూస్తే భయం వేసింది. ఎందుకంటే మనం ఇన్ని తెలుగు సినిమాల్లో చూసాం, అతని వాయిస్ విన్నాం, కానీ ఇందులో అతను తెర మీద మాట్లాడుతుంటే ఒక పెద్ద బొంగురు గొంతు ఒకటి అతనికి డబ్బింగ్, అందుకని అతన్నీ చూస్తే అదొకలా అయిపోతాం. మిగతా నటులకి కూడా సాయి కుమార్ వాయిస్ కి రెండింతలు పెద్దగా చెప్పారు డబ్బింగ్. వాళ్ళందరూ వస్తూ వుంటారు, పోతూ వుంటారు.
పోరాట సన్నివేశాలు ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. అలాగే ఎడిటింగ్ కూడా. ఛాయాగ్రహణం పరవాలేదు. మాటలు కూడా అంతంత మాత్రమే, అర్థవంతమయిన మాటలు లేవు.
చివరగా, ఈ 'కబ్జా' అనే సినిమా 'కెజిఫ్' సినిమాకి పక్క అనుకరణగా తీశారు. దర్శకుడు చంద్రు ఏమి చెప్పాలనుకున్నాడో, ఏమి తెర మీద చూపించాడో అతనికే తెలియాలి. సినిమా అంత కేకలు, అరుపులు, కొట్టుకోవడాలు, తుపాకీ మోతలు, తన్నుకోవడాలూ, అర్థంపర్థం లేని సన్నివేశాలూ, కథ కూడా బలంగా లేదు, భావోద్వేగాలు లేవు.