Meter film review: ఈ మీటర్ పాతది, అందుకే పని చెయ్యలేదు

ABN , First Publish Date - 2023-04-07T16:36:14+05:30 IST

కిరణ్ అబ్బవరం సినిమా 'మీటర్' విడుదల అయింది. మైత్రీ మూవీ మేకర్స్ అనే ఒక పెద్ద సంస్థ ఈ సినిమాకి మొదటి నుండీ దన్నుగా వుంది ఈ సినిమాకి నిలబడింది. అందులోనే చేస్తున్న చెర్రీ (చిరంజీవి) ఈ సినిమాకి నిర్మాత. మరి సినిమా ఎలా వుందో ...

Meter film review: ఈ మీటర్ పాతది, అందుకే పని చెయ్యలేదు

సినిమా: మీటర్

నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం: సాయి కార్తీక్

ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్, సురేష్ సరంగం

నిర్మాత‌: చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు

రచన, ద‌ర్శ‌క‌త్వం: రమేష్ కదూరి

-- సురేష్ కవిరాయని

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాలు నెలకి ఒకటి ఎలా విడుదల అవుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోయేలోపే, ఇంకో సినిమా విడుదల అయిపోతోంది. అంత తొందరగా సినిమాలు చేస్తున్నాడు కిరణ్. ఇంతకు ముందు 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyam Vishnu Katha) అనే సినిమాతో వచ్చాడు, ఆ సినిమా పరవాలేదు, బాగానే ఆడింది అన్నారు, ఇప్పుడు 'మీటర్' (MeterReview) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) లో భాగం అయిన చెర్రీ (చిరంజీవి) ఈ సినిమాకి నిర్మాత, కాగా రమేష్ కదూరి (Ramesh Kaduri) దర్శకత్వం చేసాడు. అతుల్య రవి (Athulya Ravi) ఇందులో కథానాయకురాలిగా నటించింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

kiranabbavaram2.jpg

Meter story కథ:

అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటాడు. తన నిజాయితీ కారణంగా అతనికి బదిలీలు, అలాగే ఒకసారి ఒక చెంప దెబ్బ కూడా తింటాడు. కొడుకుని కూడా తనలాగే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ని చెయ్యాలని అనుకొని, కొడుకు కి కూడా అదే చెప్తాడు. తండ్రి మాట కాదనలేక, అర్జున్ కళ్యాణ్ అలాగే అంటాడు కానీ, అతనికి తండ్రికి జరిగిన అవమానాలు చూసాక పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. తండ్రి ప్రోద్బలం మీదే పోలీస్ సెలక్షన్ కి వెళ్లి అక్కడ పాస్ అయి ఎస్.ఐ. అయిపోతాడు అర్జున్. డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు, ఎలా డిస్మిస్ అవ్వాలా అని ఎదురు చూస్తూ తప్పుడు పనులు చేస్తుంటాడు. కానీ అతను చేసే పనులు డిపార్ట్ మెంట్ కి హెల్ప్ అవుతాయి. ఆలా వున్న సమయంలో అవినీతి హోం మినిస్టర్ బైరెడ్డితో (ధనుష్ పవన్) అర్జున్ కళ్యాణ్‌ కలుస్తాడు. తరువాత అర్జుని కి ఒక నిజం తెలుస్తుంది, అది ఏంటి ఎలా దాన్ని ఎదుర్కొన్నాడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Kiran.jpg

విశ్లేషణ:

కిరణ్ అబ్బవరం చాలా జోరుగా సినిమాలు చేస్తున్నాడు, మంచిదే కానీ కథ కూడా చూసుకోవాలి కదా. అదీ కాకుండా, ఈమధ్య తెలుగు సినిమాలు అన్నీ 'హీరో' జపం ఎక్కువయిపోయింది. చిన్న హీరో దగ్గరనుండి పెద్ద హీరో వరకు అందరూ సినిమాలో కథ, కథనం, మాటలు, పాటలు అన్నీ హీరో చుట్టూనే తిరగాలి, కథ కూడా ఏమీ అక్కరలేదు హీరో ఉంటే చాలు పెద్దగా అని అనుకుంటున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ 'మీటర్' (Meter) సినిమా. దర్శకుడు రమేష్ కదూరి కథలో కొత్తదనం లేకుండా అదే పాత కథని తిప్పి తిప్పి తీసాడు.

తండ్రి నిజాయితీగా డిపార్టు మెంట్ లో పని చేస్తూ ఉంటాడు, కొడుకు ని కూడా అలాగే తాయారు చేయాలనుకుంటాడు. కొడుక్కి మనసులో ఇష్టం లేకపోయినా తండ్రి కోసం చేస్తాడు. వద్దనుకుంటేనే తండ్రి మాటను చివరికి నిజం చేస్తాడు. ఇది టూకీగా కథ, (MeterReview) కానీ దర్శకుడు మొదటి సగం అసలు కథలోకి పోలేదు. ఒక్క మన తెలుగు సినిమాల్లోనే కథానాయకుడు అమ్మాయిని ఇంకా సగం కూడా చూడకుండానే ప్రేమలో పడిపోతాడు, వెంట పడతాడు. అదేంటో మరి. (MeterFilmReview) అలాగే డిపార్ట్ మెంట్ లో చేరాక, సస్పెండ్ అవడానికి ఖైదీలని వదిలేయమంటాడు. కమిషనర్ ని మరీ ఒక బఫూన్ లా చూపెడతాడు. చీఫ్ మినిస్టర్ ని, హోమ్ మినిస్టర్ తంతూ ఉంటాడు. అది ఇంకో విచిత్రం. ఇలా సినిమా అంతా లాజిక్ లేకుండా సాగుతూనే ఉంటుంది.

meterfilmreview.jpg

అతను పోలీస్ అయినా, అవ్వకపోయినా హీరో కాబట్టి ఫైట్స్ చేస్తాడు, పదిమందిని చితకొట్టేస్తాడు. రెండో సగం అంత విలన్ కి, కథానాయకుడికి మధ్య జరిగే సన్నివేశాలు. అవన్నీ మామూలే. ఇంకో విషయం ఏంటి అంటే ఒక్క మన తెలుగు సినిమాల్లోనే విలన్స్ డైలాగ్స్ చెప్పడం అంటే గట్టిగా అరవటం. ఎవరిచేతో డబ్బింగ్ చెప్పిస్తారు, వాళ్ళు హై పిచ్ లో డైలాగ్స్ చెపుతారు. సినిమా మొత్తం అసలు లాజిక్ లేకుండా నడుస్తూ ఉంటుంది. మొదటి సగం అవగానే ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తుంది. ఇంకా రెండో సగం చూసేవాళ్ళు చూస్తారు, బోర్ కొట్టినవాళ్లు సినిమా కథ ఎలాగు తెలుసు కాబట్టి వెళ్ళిపోతారు. నెలకో సినిమా విడుదల అవ్వటం మంచిదే కానీ, అందులో కంటెంట్ ఉందా, లేదా , మంచి సన్నివేశాలు, కథనం ఇవన్నీ చూడాలి కదా. అలాగే కథానాయకురాలి పాత్ర కేవలం పాటలకి మాత్రమే పరిమితం చేశారు. సంగీతం, మిగతా సాంకేతిక అంశాలు అన్నీ యావరేజ్.

నటీనటులు ఎలా చేశారు:

ఇంకా నటీనటుల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం చాలా హైపర్ గా చేశారు తన రోల్. పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) కమిషనర్ గా కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ధనుష్ పవన్ (Dhanush Pavan) కొత్తగా విలన్ గా పరిచయం అయ్యాడు అనిపిస్తోంది, కానీ బాగున్నాడు. సప్తగిరి (Saptagiri) పరవాలేదు, కొన్ని సన్నివేశాల్లో నవ్వులు తెప్పించాడు.

చివరగా, 'మీటర్' (MeterFilmReview) సినిమా కథ, కథనం సరిగా లేని సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ తమ సంస్థ నుండి ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే సంస్థ కి చెడ్డ పేరు వస్తుందని, అందులో భాగం అయిన చెర్రీ (చిరంజీవి) తో ఈ సినిమా తీయించారు. వాళ్ళకి కూడా ముందుగానే తెలుసు అనుకుంటా ఈ సినిమా ఫలితం.

Updated Date - 2023-04-07T16:36:16+05:30 IST