Martin Luther King movie review: సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం ఎలా ఉందంటే..
ABN , Publish Date - Oct 27 , 2023 | 03:40 PM
సంపూర్ణేష్ బాబు చాలా గ్యాప్ తరువాత 'మార్టిన్ లూథర్ కింగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తమిళ సినిమా 'మండేలా' కి రీమేక్. పూజ కొల్లూరు దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం అయింది. సీనియర్ నటుడు వికె నరేష్ ఒక ప్రధాన పాత్రలో కనపడితే, వెంకటేష్ మహా ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి
సినిమా: మార్టిన్ లూథర్ కింగ్
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, వికె నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ (SaranyaPradeep) తదితరులు
కథ: మడోన్ అశ్విన్
స్క్రీన్ ప్లే, మాటలు: వెంకటేష్ మహా
ఛాయాగ్రహణం: దీపక్ యరగెరా
సంగీతం: స్మరణ సాయి
దర్శకత్వం: పూజ కొల్లూరు
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
రేటింగ్: 3.5 (త్రి పాయింట్ ఫైవ్)
-- సురేష్ కవిరాయని
చాలా కాలం తరువాత సంపూర్ణేష్ బాబు (SampoorneshBabu) కథానాయకుడిగా 'మార్టిన్ లూథర్ కింగ్' #MartinLutherKing అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తమిళంలో హిట్ అయిన 'మండేలా' #Mandela అనే సినిమాకి రీమేక్. తమిళ సినిమాలో యోగి బాబు (YogiBabu) ప్రధాన పాత్రలో కనపడ్డాడు, ఈ సినిమాకి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. యోగి బాబు చేసిన పాత్రని తెలుగులో సంపూర్ణేష్ బాబు చేసాడు. (Martin Luther King movie review) ఇదే సినిమాని తెలుగు ప్రేక్షకులకి అనువైన విధంగా మార్చి, ఈ చిత్రం ద్వారా మహిళా దర్శకురాలు పూజ కొల్లూరు (PoojaKolluru) పరిచయం అయ్యారు. దీనికి మాటలు, స్క్రీన్ ప్లే 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా (VenkateshMaha) అందించడమే కాకుండా, ఒక ప్రధాన పాత్రలో కూడా కనపడతాడు. తమిళ సినిమా నిర్మించిన వై నాట్ స్టూడియో కి చెందిన శశికాంత్, చక్రవర్తి రామచంద్ర (Chakravarthy Ramachandra) ఈ తెలుగు సినిమాకి కూడా నిర్మాతలు. ఇందులో వికె నరేష్ (VKNaresh) ఇంకో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Martin Luther King movie review)
Martin Luther King story కథ:
పడమరపాడు అనే గ్రామంలో స్మైల్ (సంపూర్ణేష్ బాబు) ఒక మర్రి చెట్టు కింద చెప్పులు కుట్టుకుంటూ బతుకుతూ వుంటాడు. అతను ఒంటరి, తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ వుండరు. అదే వూర్లో అందరూ అతన్ని ఎడ్డోడా, వెర్రిబాగులోడా అని పిలుస్తూ వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయించుకుంటూ వాళ్ళకి తోచిన చిల్లర డబ్బులు ఇస్తూ వుంటారు. అతనికి సహాయంగా బాటా అనే ఇంకో కుర్రాడు ఉంటాడు. అతను కూడబెట్టిన డబ్బుని ఒక డబ్బాలో పెట్టి అదే మర్రిచెట్టు మీద దాచుకుంటే, ఎవరో దొంగిలించేస్తారు. స్నేహితుడు సలహా మేరకు డబ్బులు పోస్టాఫీసులో దాచుకోవచ్చని తెలిసి అక్కడ పనిచేసే వసంత (శరణ్య ప్రదీప్) సాయం అడుగుతాడు. #MartinLutherKingMovieReview అతని అసలు పేరు, ఓటర్ కార్డు, ఆధార్ కార్టు ఏమీ లేకపోవటంతో అతనికి అవన్నీ కావాలని చెప్పి తనే దగ్గరుండి ఆ ఊరి ప్రెసిడెంట్ తో సంతకం చేయించి అప్లికేషన్ పెట్టిస్తుంది వసంత. అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు కూడా తనే పెడుతుంది. పడమరపాడుకి ప్రెసిడెంట్ ఎన్నికలు వస్తాయి, అందులో దక్షిణ దిక్కు నుండి లోకి (వెంకటేష్ మహా) వుత్తరం దిక్కు నుండి జగ్గు (వికె నరేష్) పోటీలో పాల్గొంటారు. ఈ ఇద్దరూ వరసకి అన్నదమ్ములు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్లే కానీ తల్లులు వేరు, కానీ ఈ ఇద్దరికీ పడదు. ఇద్దరూ ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ, సర్వే కూడా చేస్తారు, ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక్క ఓటు ఎలా దొరుకుతుందా అని ఇద్దరూ తాపత్రయపడుతూ వున్న సమయంలో, మార్టిన్ లూథర్ కింగ్ కి ఓటు హక్కు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రెసిడెంట్ పదవితో పాటు 30 కోట్ల ప్రాజెక్ట్ ఆ వూరికి వస్తుంది అని లోకల్ ఎంఎల్ఏ చెప్పడంతో, ఆ ఒక్క ఓటు కోసం ఇద్దరూ తాపత్రయ పడతారు. ఓటు హక్కు రావటంతో మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎలా మారిపోయింది, అలాగే జగ్గు, లోకి ల వలన అతనికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి, ఓటు ఎంత బలమైంది దానితో వూరునే ఎలా మార్చవచ్చు అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
'మార్టిన్ లూథర్ కింగ్' అనే సినిమా ఒక సందేశాత్మక చిత్రంగా చెప్పవచ్చు. ఓటు విలువ, దానికుండే బలం, ఆ ఓటుతో ప్రజాస్వామ్యంలో ఎటువంటి మార్పులు చెయ్యొచ్చో చెప్పే చిత్రం ఇది. అలాగే సమకాలీన రాజకీయాలని ఒక పక్క ఎత్తి చూపుతూ, ఇంకో పక్క విమర్శనాస్త్రాలని కూడా ఈ చిత్రంలో సంధిస్తారు. ఓటు వేసే ముందు, అలాగే ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా ఇది. తమిళ సినిమా 'మండేలా' కి రీమేక్ అయినా, ఇది రీమేక్ లా కనిపించదు, తెలుగు సినిమా లానే ఉంటుంది, అందుకు దర్శకత్వం చేసిన పూజ అభినందనీయురాలు. ఆమె ఒక నిజాయితీతో తీసిన సినిమా అని తెరమీద చూస్తున్నప్పుడు కనపడుతుంది. #MartinLutherKingMovieReview
పడమరపాడు అనే గ్రామంలో ప్రజలు ఎలా వుంటారు అనే విషయం ఒక మరుగుదొడ్డి ప్రారంభోత్సవం చేసి చూపించారు. ఆ తరువాత దక్షిణం, ఉత్తరం దిక్కుల ప్రజలు రెండు గ్రూపులుగా ఉండటం వాళ్ళకి లోకి, జగ్గు నాయకులుగా చలామణీ అవటం, అక్కడి ప్రజల్లో తారతమ్యాలు అన్నీ చక్కగా చూపించారు. తరువాత స్మైల్ అనే అతను జీవనం, అతని ఊరి జనాలకి ఎటువంటి సాయం చేస్తాడు, అతడిని అక్కడి ప్రజలు ఎంత హీనంగా చూస్తారు ఇవన్నీ చూపించారు. అతనికి, పోస్టాఫీసులో పనిచేసే వసంతకి పరిచయం, డబ్బులు దాచుకోవటానికి గుర్తింపు కార్డు అవసరం అని చెప్పడం, స్మైల్ పేరుని మార్టిన్ లూథర్ కింగ్ గా మార్చి, అతనికి గుర్తిపు కార్డు కోసం పక్కనున్న చిన్న సిటీలో వసంత అప్లికేషన్ నింపి ఇవ్వడం జరుగుతుంది. ఇక వూర్లో ఎన్నికలు రావటం దగ్గర నుంచి కథ ఇంకో మలుపు తిరుగుతుంది.
ఎన్నికల్లో నాయకులు ఎటువంటి ప్రలోభాలు పెడతారు, ఎటువంటి సెంటిమెంట్ ను వాడతారు, కులం కూడా అందులో చోటు చేసుకుంటుంది అనే పాయింట్ లు అన్నీ నీట్ గా టచ్ చేసి చాలా బాగా ప్రేక్షకులకి ఆకట్టుకునేట్టు చూపించింది దర్శకురాలు పూజ. ఎందుకంటే ఈ ఇద్దరు ఓటర్లను ఆకర్షించే పథకాలు, చెప్పే మాటలు, ప్రస్తుతం ఆంధ్రలో వున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండటంతో, అవన్నీ చూస్తున్నామన్న ఆలోచనలతో ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటాయి అనటంలో సందేహం లేదు. ఆ తరువాత ఆ ఇద్దరు నాయకులనూ మార్టిన్ లూథర్ కింగ్ ఎలా వాడుకున్నాడు, ఓటుతో ఊరుని ఎలా మార్చవచ్చు అన్నవి ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ మాత్రం అంతగా పండదు. #MartinLutherKingMovieReview
అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు సాగదీతలా కూడా వున్నాయి. కింగ్ కి ఆ ఇద్దరు నాయకులూ పోటీపడి ఎటువంటి ప్రలోభాలు పెట్టారు అనేది కొంచెం సాగదీశారు అనిపించింది. అలాగే ఓటు కోసం వేలం పాట పెట్టి ఇద్దరి నాయకులూ ఏకంగా ఇల్లు, భూములు తాకట్టు పెట్టే వరకు వెళ్లడం, కోట్ల రూపాయలు ఇస్తాను అనటం కూడా కొంచెం ఎక్కువ చేశారు అనిపించింది. అలాగే కింగ్, తన దగ్గర పని చేసే బాటా మధ్య చివర్లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీశారు అని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ కూడా అంతగా ఆసక్తికరంగా లేకపోవటం. ఇన్ని సాగదీతలు వున్నా కూడా దర్శకురాలు పూజని మెచ్చుకోవాలి, ఒక మంచి సినిమా వెండి తెర మీద ఆవిష్కరించినందుకు.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా సంపూర్ణేష్ బాబు కెరీర్ లో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. చాలా చక్కటి అభినయంతో, హావభావాలతో సంపూర్ణేష్ తన ప్రతిభని మార్టిన్ లూథర్ కింగ్ అనే పాత్రలో జీవించి చూపించాడు. చాలా సహజంగా నటించి మంచి అభినయంతో ప్రేక్షకులని అక్కటుకున్నాడు అనే చెప్పాలి. ఇప్పటి వరకు వినోదాత్మక స్పూఫ్ కామెడీ చేసే సంపూర్ణేష్ ఒక భావోద్వేగమైన పాత్రలో బాగా నటించి అలరించాడు. ఇక వికె నరేష్ జగ్గు పాత్రలో లీనమై నటించారు, అతను ఈ సినిమాకి ఒక మూల స్థంభం అని చెప్పొచ్చు. అలాగే మహా వెంకటేష్ కూడా లోకి పాత్రలో నరేష్ కి ధీటుగా నటించి చూపించాడు. ఇక వసంత పాత్ర శరణ్య చేసింది, ఆమె ఎంతో సహజంగా నటించి చూపించింది, ఆమె పాత్ర పరిధి కూడా ఎక్కువే, చాలా బాగా చేసింది శరణ్య. మిగతా పాత్రల్లో ఎక్కువగా కొత్త నటులు కనపడతారు, అందరూ సహజంగానే వుంటారు. ఇక ఛాయాగ్రహణం బాగుంది, వెంకటేష్ మహా చక్కటి మాటలు కూడా రాసారు. స్మరణ సాయి నేపధ్య సంగీతం సన్నివేశాలకి తగ్గట్టుగా ఉంటుంది.
చివరగా, 'మార్టిన్ లూథర్ కింగ్' సినిమా దర్శకురాలు పూజ, ఒరిజినల్ సినిమా కథని చెడగొట్టకుండా బాగా తీసింది. రెండో సగంలో కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇది ఒక సందేశాత్మక చిత్రం, సమకాలీన రాజకీయాలొ ఓటు గురించి, దాని బలం, విలువ గురించి వినోదాత్మకంగా ఎక్కడా విసుగు అనిపించకుండా చెప్పే సందేశాత్మక చిత్రం. అలాగే ఆలోంచింపచేసే చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'.