Rana Naidu Review: రానా నటన బాగుంది, కానీ శృతి మించిన శృంగారం ఎబ్బెట్టుగా వుంది !

ABN , First Publish Date - 2023-03-14T16:39:22+05:30 IST

వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని చాలామంది అనుకుంటారు, కానీ ఈ ఇద్దరూ మొదటి సారిగా ఒక వెబ్ సిరీస్ 'రానా నాయుడు' లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ 'రే డొనోవన్' కి అనుకరణ. ఇది ఎలా వుందో చూద్దాం

Rana Naidu Review: రానా నటన బాగుంది, కానీ శృతి మించిన శృంగారం ఎబ్బెట్టుగా వుంది !
Rana Naidu Web Series Review

వెబ్ సిరీస్ పేరు: రానా నాయుడు

నటీనటులు: వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati), సుర్వీన్ చావ్లా (Surveen Chawla), సుచిత్ర పిళ్ళై (Suchitra Pillai), సుశాంత్ సింగ్ (Sushanth Singh), అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), గౌరవ్ చోప్రా, ఆదిత్య మీనన్ (Aditya Menon), ప్రియా బెనర్జీ (Priya Banerjee), తదితరులు

స్క్రీన్ ప్లే: బి.వి.ఎస్. రవి (B.V.S.Ravi)

దర్శకత్వం: సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్

నిర్మాతలు: సుందర్ ఆరోన్, సుమిత్ శుక్ల

--- సురేష్ కవిరాయని

సినిమాల తరువాత చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద నటులు, సాంకేతిక నిపుణులు చాలామంది ఇప్పుడు ఓ.టి.టి వేపు దృష్టి మరల్చారు. చాలామంది తెలుగు నటీమణులు తమన్నా (Tamannah Bhatia), సమంత (Samantha), కాజల్ (Kajal), శృతి హాసన్ (Shruti Haasan) లాంటి వాళ్ళు వెబ్ సిరీస్ లో నటించేసారు. అలాగే హిందీ నుండి ఇంకా ఎక్కువగా నటీ నటులు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇప్పుడు తెలుగు నుండి ఇద్దరు అగ్ర నటులు వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), అతని అన్న కుమారుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) లో నటించారు. ఇది నెట్ ఫ్లిక్ (Netflix) లో విడుదల అయింది. ఇది హిందీ మాతృకగా చేసినా, ఈ ఇద్దరు నటులు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో బాగా ప్రాచుర్యం వున్నవారు కాబట్టి అన్ని భాషలలోకి కూడా తర్జుమా చేసి విడుదల చేశారు. ఈ 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ 'రే డొనోవన్' (Ray Donovan) అనే వెబ్ సిరీస్ కి ఆధారంగా తీశారు.

Rana-Naidu.jpg

Rana Naidu story కథ:

ముంబై లో ఎవరయినా సెలెబ్రెటీ కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేసేది పోలీస్ ని కాదు, రానా నాయుడు (రానా దగ్గుబాటి) ని. ఎందుకంటే సెలబ్రిటీ సమస్యలు బయట జనాలకి తెలియకూడదు కాబట్టి, రానా నాయుడు అలంటి సమస్య చాలా సీక్రెట్ గా పరిష్కరించేస్తాడు. రానా నాయుడు, భార్య (సుర్వీన్ చావ్లా), ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటాడు. రానా నాయుడు తండ్రి నాగా నాయుడు (వెంకటేష్ దగ్గుబాటి) పదిహేను ఏళ్ళ తరువాత జైలు నుండి విడుదల అవుతాడు. రానా కి, తండ్రి నాగా కి అస్సలు పడదు, ఎందుకంటే తండ్రి వస్తే అతనితోపాటే సమస్యలు కూడా వస్తాయని రానా భయం. రానాకీ ఇద్దరు అన్నదమ్ములు తేజ్ (సుశాంత్ సింగ్), జఫ్ఫా (అభిషేక్ బెనర్జీ) వుంటారు. తండ్రి కొడుకుల మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి, నాగ నాయుడు రాకతో రానా కుటుంబంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే 'రానా నాయుడు' చూడండి.

ranadaggubati.jpg

విశ్లేషణ:

ముందుగా చెప్పినట్టు ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' కి అనుకరించి తీశారు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో చాలా అడల్ట్ కంటెంట్ వుంది. అయితే దీన్ని ఇండియా లో తీసినప్పుడు ఆ అడల్ట్ కంటెంట్ తీసి చూపించవచ్చు, కానీ ఎందుకో మరి నిర్మాతలు, దర్శకులు శృంగారాన్ని మరీ ఎక్కువగా చూపించారు. అంటే ప్రతి ఎపిసోడ్ లోనూ ఈ శృతిమించిన శృంగారం కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు 'రే డొనోవన్' కనక చూస్తే మీకు కథ అర్థం అయిపోతూ ఉంటుంది. అయినా కూడా ఇది ఎలా ఉందొ చూద్దాం.

సెలబ్రిటీ ఇళ్లల్లో ముఖ్యంగా బాలీవుడ్ లో జరిగే తెరవెనక చేసే క్రైమ్ బాగోతాలు బయటకి తెలియకుండా మాఫీ చేసే పని చేస్తున్న రానా నాయుడు అనే వ్యక్తి అది చెయ్యటానికి చాలా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అతనికి ఇలాంటి క్లయింట్స్ ఎక్కువమంది బాలీవుడ్ నుండే. ఈ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ లో అటువంటి విషయాలు కుటుంబం మీద ఎలా ఉంటాయి, బంధాలు, అనుబంధాలు ఎలా ఉంటాయి, విడిపోవటం, కలవటం అన్నీ చూపించాలి. కానీ ఈ వెబ్ సిరీస్ లో అలాంటి భావోద్వేగ సన్నివేశాలు చాలా తక్కువ. చివరి మూడు ఎపిసోడ్స్ లో కొంచెం కనిపిస్తాయి.

rananaidu1.jpg

ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' కి అనుకరణగా ఇది తీసుకున్నప్పుడు వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు మనకి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఈ వెబ్ సిరీస్ దర్శకులు అందులో ఎలా వుందో, దానికి అలాగే ఇందులో కూడా శృంగార చేష్టలు, మొగుడు పెళ్ళాలు మధ్య బూతు ఇంగ్లీష్ పదాలు, అలాగే పిల్లలతో కూడా అలాంటి పదాలు చెప్పించారు. ఎక్కడో బాగా డబ్బున్న వాళ్ళింట్లో ఇలా ఉండొచ్చు ఏమో కానీ, ఇలాంటివి చూడటానికి మాత్రం ప్రేక్షకులు ఇష్టపడరు. ఎందుకంటే మన సాంప్రదాయం వేరు. ఇప్పుడు అంత ఆధునికం అయిపొయింది అని మనం అనుకున్నా, సంస్కృతి, అభిరుచులు మారవు కదా. అందుకని దర్శకులు సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ కొంచెం ఆ శృంగారాన్ని తగ్గించి, బంధాలు, అనుబంధాలు మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఇవన్నీ కాకుండా, వెంకటేష్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఒక ఫీల్ గుడ్ సినిమాలు. ఎందుకంటే అతను చేసినవి అలాంటివి. శోభను బాబు తరువాత ఎక్కువగా ఆడవాళ్లు అభిమానులుగా వున్నది వెంకటేష్ కి మాత్రమే. అదీ కాకుండా ఒక పెద్ద సినిమా కుటుంబం అంటే వెంకటేష్ నాన్నగారు రామానాయుడు (Ramanaidu) ఒక లెజెండరీ నిర్మాత. దాదాపు అన్ని భాషల్లోనూ చాలా క్లీన్ మూవీస్ తీశారు. మరి అలాంటి కుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ ఎందుకు ఇంత అడల్ట్ కంటెంట్ వున్న వెబ్ సిరీస్ లో నటించాడో అర్థం కాదు. అతని మాటలు అన్ని కూడా బూతుతో కూడినవే.

కథలో కొన్ని నిజంగా ఆలా అనిపిస్తాయా అని కూడా వుంది. బాలీవుడ్ లో ఒకరి మీద ఒకరు ఎలా నిఘా పెడతారు, ఎవరు ఎవరితో తిరుగుతున్నారు, బయటకి మామూలుగా మాట్లాడే వ్యక్తులు ఇంట్లో ఎలా వుంటారు, ఎలాంటి వేషాలు వేస్తారు ఇవన్నీ చూస్తుంటే సెలబ్రిటీ ఇళ్లల్లో ఇలాగె వుంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే దొంగ స్వామీజీల బాగోతాలు, వాళ్ళు ఆ ముసుగులో పిల్లలను ఎలా లైంగికంగా వేధించారు, అది మానసికంగా పిల్లలు పెద్దయ్యాక కూడా ఎలావుంటుంది ఇవన్నీ చాలా బాగా తీశారు. అందుకేనేమో ఆ పిల్లలు పెద్దయ్యాక ఆలా తయారయ్యారు అనిపిస్తూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు సరిగా లేనప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు అనే విషయం నాగనాయుడు వలన కూడా తెలుస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, కొన్ని సాగదీశారు. తండ్రి కొడుకులకి ఎందుకు పడదు, జఫ్ఫా ఎందుకు ఆలా తయారయ్యాడు, దొంగ స్వామి మహారాజ్ వలన నాయుడు కుటుంబం ఎంతగా నష్టపోయింది చివరి ఎపిసోడ్స్ వచ్చేసరికి తెలుస్తాయి.

Rana-Naidu.jpg

ఎలా చేశారు:

ఇక నటీనటుల విషయానికి వస్తే మాత్రం రానా దగ్గుబాటి ని మొదట చెప్పుకోవాలి. ఆ పాత్రకి రానా బాగా సూట్ అయ్యాడు. ఒక రకమయిన సీరియస్ ఉంటుంది అతని మొహం లో, అందుకని ఆ పాత్ర బాగా చేసాడు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ కి వచ్చేసరికి అతని నటన కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. మహారాజ్, రానాకి ఏమి చేసాడో తెలిసిన తరువాత సన్నివేశాలు చాలా బాగా చేసాడు. అలాగే ఎక్కువగా కళ్ళతో అభినయించి చేసి చూపించాడు రానా. ఒక పక్క కుటుంబం కోసం పడే తపన, ఇంకో పక్క తండ్రిని మళ్ళీ జైలు కి ఎలా పంపాలి అని ఆలోచిస్తూ, ఇంకో పక్క సెలబ్రిటీ కేసులతో సతమతమవుతూ ఇన్నిషేడ్స్ తో రానా నటన అదిరింది. రానా కి ఇది పర్ఫెక్ట్.

వెంకటేష్ కి ఇది భిన్నమయిన పాత్రే కానీ, అతను చెయ్యాల్సిన పాత్ర అవునా కదా అన్నది ఇక్కడ చర్చ. అతనికి నచ్చింది అతను చేసాడు, కానీ ప్రేక్షకులకి అతని పాత్ర అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అతని నోటి నుండి ఎక్కువ బూతు పదాలే వస్తాయి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా బూతు పెట్టారు. వెంకటేష్ అంటే ఒక ఇమేజ్ వుంది ఇంత వరకు, కానీ అదంతా ఈ వెబ్ సిరీస్ తో తుడుచుపెట్టుకుపోయే ప్రమాదం కూడా వుంది. నటన బాగుంది, కానీ పాత్రే బాగోలేదు. ఈ వెబ్ సిరీస్ అంతా వెంకటేష్, రానా ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ లు రానా అన్నాదములుగా బాగా చేశారు. సుర్వీన్ చావ్లా రానా భార్యగా బాగా అమిరింది. అందంగా వుంది కూడా. నటుడు ప్రిన్స్ గా గౌరవ్ చోప్రా (Gaurav Chopra), అలాగే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సూర్య రావు గా ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) వారి పాత్రల పరిధి మేరకి నటించారు. ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ ఇంకా చాలామంది తెలిసిన నటీనటులు వున్నారు. రానా పిల్లలుగా ఆ ఇద్దరు పిల్లలు బాగా నటించారు. సహజంగా వున్నారు.

rananaiduwebseries.jpg

సంగీత్, సిద్ధార్థ్ లు నేపధ్య సంగీతం అందించారు, పరవాలేదు, బాగుంది. మధ్య మధ్యలో వెంకీ సినిమా లోనుంచి తెలుగు పాటలు వినిపిస్తూ ఉంటాయి. గుమ్మడి జయకృష్ణ ఛాయాగ్రహణం చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ లో రాత్రి జరిగే సంఘటనలు బాగా చూపించాడు. అలాగే కొన్ని సన్నివేశాలకి సినిమాటోగ్రఫీ చాల కీలకం అయింది. అలాగే కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ చేయొచ్చు అనిపించింది, ముఖ్యంగా ఆ అసభ్య సన్నివేశాలు. మాటలు మరీ బూతు పురాణం లా తయారయింది. మాటలు రాసేవాళ్ళు వెంకటేష్, రానా వంటి ఇద్దరు అగ్ర నటులు నటిస్తున్నారు అన్న దృష్టి కోణం లో రాస్తే బాగుండేది. ఎందుకంటే ఇది కుటుంబం తో చూడాలి అనుకుంటారు, కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేరు. బి.వి.ఎస్. రవి దీనికి కథనం (screenplay) అందించాడు.

rananaidurana.jpg

చివరగా, 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఎలా వుంది అంటే ఇది పెద్దలకు మాత్రమే అన్నట్టుగా వుంది. అదీ కాకుండా తండ్రి కొడుకుల మధ్య కాస్త ఎమోషనల్ సన్నివేశాలు ఉంటే బాగుండేది. వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ విడుదలకి ముందే చెప్పాడు కుటుంబం అంతా కలిసి చూడొద్దు అని, కానీ అతను అంత మరీ ఓవర్ గా ఈ పాత్రలో బూతులు చెప్పాల్సిన పని లేదు. మొదటి అయిదారు ఎపిసోడ్స్ కొంచెం సాగ దీసినా చివరి మూడు ఎపిసోడ్స్ కొంచెం ఆసక్తికరంగా సాగుతుంది. నేను ఒరిజినల్ అయిన హిందీ భాషలో చూసాను.

స్టాట్యుటరీ వార్నింగ్: పిల్లలు ఈ వెబ్ సిరీస్ చూడకూడదు, కుటుంబం అంతా కలిపి కూడా చూడొద్దు.

Updated Date - 2023-03-14T17:07:03+05:30 IST