Tiger Nageswara Rao film review: ఈ సినిమా చూడటానికి ఓపిక ఉండాలి

ABN , First Publish Date - 2023-10-20T14:32:49+05:30 IST

రవితేజ స్టూవర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వర రావు' అనే సినిమా ఈరోజు విడుదలైంది. వంశీ దీనికి దర్శకుడు, అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Tiger Nageswara Rao film review: ఈ సినిమా చూడటానికి ఓపిక ఉండాలి
Tiger Nageswara Rao movie review

సినిమా: టైగర్ నాగేశ్వర రావు

నటీనటులు: రవితేజ, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, నాజర్, అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, మురళీ శర్మ, జిష్షు సేన్ గుప్తా, అనుకీర్తి వ్యాస్, 'ఆడుకాలం' నరేన్, ప్రదీప్ రావత్ తదితరులు

ఛాయాగ్రహణం: మది

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్

రచన, దర్శకత్వం: వంశీ

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

రవితేజ (RaviTeja) నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao ఈరోజు విడుదలైంది. విడుదలకి ముందు ప్రచారంలో ఈ సినిమా గురించి రవితేజ చాలా గొప్పగా చెప్పారు, అలాగే తెలుగులో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ ప్రచారం చేశారు రవితేజ. ఈ సినిమాకి దర్శకుడు వంశీ (Vamsee), అతను ఇంతకు ముందు 'దొంగాట', 'కిట్టు వున్నాడు జాగ్రత్త' అనే సినిమాలు చేసాడు. ఈ సినిమా డెబ్బయి దశకంలో స్టూవర్టుపురం అనే వూరుకి చెందిన నాగేశ్వర రావు అనే దొంగ గురించి అని ప్రచారం కూడా చేశారు. #TigerNageswaraRaoReview కానీ సినిమాలో అది ఎంత నిజమో తీసినవాళ్లకే తెలియాలి. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ (PawanKalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (RenuDesai) ఈ సినిమాతో మళ్ళీ ఆరంగేట్రం చేశారు. అలాగే ఈ సినిమాలో నుపుర్ సనన్ (NupurSanon), గాయత్రీ భరద్వాజ్ (GayatriBharadwaj) కథానాయికలు. అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) నిర్మాతగా వున్న ఈ సినిమా తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా విడుదలైంది. ఎలా వుందో చూద్దాం. (Tiger Nageswara Rao movie review)

tigernageswararao4.jpg

Tiger Nageswara Rao story కథ:

నాగేశ్వర రావు (రవితేజ) స్టూవర్టుపురానికి చెందిన వ్యక్తి, ఆ వూర్లో అందరూ దొంగతనాలకు ప్రసిద్ధి. ఆలా పేరు పడిపోయింది కాబట్టి పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ ఆ ఊరి ప్రజలని తమ అవసరాల కోసం వాడుకుంటూ వుంటారు. అలాంటి ఊరి నుండి వచ్చిన నాగేశ్వర రావు కూడా దొంగతనాలకు అలవాటు పడతాడు. అయితే ఇతని ప్రత్యేకం ఏంటంటే, ఎక్కడ దొంగతనం చేసినా ముందు చెప్పి వెళతాడు, విజయవంతంగా పని పూర్తి చేసుకు వస్తాడు. చిన్న తనంలోనే తండ్రి తల నరుకుతాడు నాగేశ్వర రావు, అంటే ఆ మనిషి ఎంత కరుడు కట్టిన వాడో అర్థం అవుతుంది. ఇలా దొంగతనాలు చేస్తూ డబ్బు గడించి ఆ ఊరి ప్రజలకు, పిల్లల చదువులకు ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఆ వూర్లో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాలని, అందులో తన ఊరి ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించాలని అనుకుంటూ ఉంటాడు నాగేశ్వర రావు. #TigerNageswaraRaoReview మరి అతని కలలు నిజమయ్యాయా? అతని పనికి కొంతమంది అవినీతి పరులైన పొలిసు ఆఫీసర్లు, రాజకీయనాయకులు అడ్డు తగులుతారు. ఇవన్నీ దాటుకొని నాగేశ్వర రావు తన కలని ప్రధానమంత్రి వరకు ఎలా తీసుకెళ్లగలిగాడు? అసలు ఈ స్టూవర్టుపురం వూరు నేపథ్యం ఏమిటి? చిన్నప్పుడే తండ్రి తలను నాగేశ్వర రావు ఎందుకు నరికాడు? దొంగగా వున్న నాగేశ్వర రావుకి ప్రేమ కథ కూడా ఉందా, ఉంటే అదేమిటి? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

tigernageswararao5.jpg

విశ్లేషణ:

దర్శకుడు వంశీ, కథానాయకుడు రవితేజ, 'టైగర్ నాగేశ్వర రావు' అనే సినిమా స్టూవర్టుపురానికి చెందిన నాగేశ్వరరావు అనే దొంగకి సంబదించిన కథ అని చెప్పారు. ఈ కథలో ఎంత నిజం, అబద్ధం వుంది అనేది పక్కన పెడితే నాగేశ్వర రావు అనే వ్యక్తి దొంగ, దొంగతనానికి వెళ్లే ముందు చెప్పి వెళతాడు, పని పూర్తి చేసుకు వస్తాడు అని అంటారు. సగటు ప్రేక్షకుడిగా నేను సినిమాకి వెళ్ళినప్పుడు నాగేశ్వర రావు ఎంత చాకచక్యంగా తన తెలివి వుపయోగించి దొంగతనాలు చేసాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తాను. #TigerNageswaraRaoReview కానీ దర్శకుడు ఇక్కడే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఢిల్లీలో నాగేశ్వర రావు గురించి అధికారులు మాట్లాడుతూ బాగానే బిల్డ్ అప్ ఇచ్చారు, కానీ అది చూపించటంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ట్రైన్ దొంగతనం మరీ చిన్నపిల్లల గ్రాఫిక్ లా వుంది. అంతే ఇదొక్కటే దొంగతనం ఎలా చేసాడో చూపించింది, ఆ తరువాత అతను ఎంత చాకచక్యంగా చేసాడో అసలు కనపడదు. ఇలా వెళ్లి, అలా వచ్చేస్తూ ఉంటాడు, తప్పితే ఎలా చేసాడు అన్నది ప్రేక్షకుడికి ఆసక్తికరంగా చూపించటంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.

ఇక అతని ప్రేమ వ్యవహారం కూడా ఒక నవ్వులాటగా ఉంటుంది. ట్రైన్ లో అమ్మాయిని చూడగానే దొంగ అయిన నాగేశ్వర రావు వెళ్లి ఆ అమ్మాయికి నీ కొలతలు బాగున్నాయి అని అంటూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. ఇది అంత సహజంగా లేదు. అలాగే నాగేశ్వర రావు ప్రధానమంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు, అది కూడా సాదాసీదాగా అయిపోతుంది. అక్కడ ప్రేక్షకుడు ఎదో ఊహించేస్తాడు, కానీ దర్శకుడు తుస్సుమనిపించాడు. అలానే చాలా సన్నివేశాలు ఉంటాయి. సినిమా ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. మూడుగంటలు పైగా సినిమా, విషయం లేదు అందులో, ఒక అరగంట సినిమా ఈజీ గా తీసేయొచ్చు. మొదటి సగంలో చెప్పిన కథ, రెండో సగంలో నాజర్ చేత ఎందుకు అవన్నీ చేసాడో చెప్పిస్తాడు దర్శకుడు, కొంచెం చూసిన సన్నివేశాలే చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తండ్రి తల నరుకుతాడు మొదట్లో, దాని గురించి చివర్లో చెప్తాడు, కానీ అప్పటికే ప్రేక్షకుడు లేచి వెళ్ళిపోతాడు.

tigernageswararao6.jpg

టైగర్ నాగేశ్వ రావు అనే వ్యక్తి దొంగ, అతన్ని దేశభక్తుడిగా, లేదా వూరు కోసం పాటుపడ్డ వ్యక్తిగానో, లేదా ఇంకో రాకగంగానో ఏదైనా చూపించుకో, కానీ సినిమా అనేది ఆసక్తికాగా ఉండాలి. కథ, కథనం, సంగీతం, వీటన్నిటికీ తోడు భావోద్వేగాలు (Emotions) ఉండాలి సినిమాలో, అది అస్సలు లేదు. ఆ వూరికి, నాగేశ్వర రావు కి వున్న అనుబంధాన్ని సరిగ్గా చూపించలేకపోయాడు దర్శకుడు. రేణు దేశాయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర అంటూ ప్రచారాలు చేశారు, కానీ ఈ సినిమా కన్నా ఆమె రెండో వివాహం గురించి బాగా ప్రచారం వచ్చింది, ఆమె పాత్ర కూడా ఏమీ లేదు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా వున్నాయి, రవితేజని కుర్రాడుగా చూపించాలన్న తాపత్రయంలో ఆ నాసిరకం గ్రాఫిక్స్ వాడారు, దానితో అతని మొహం ఎలా కనపడుతుందో నేను చెపితే బాగుండదు, మీరు ఊహించుకోండి. మొత్తంమీద ఈ సినిమాలో విషయం తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టుగా చేశారు. రెండో సగంలో తలలు, మొండాలు, చేతులు, కాళ్ళు తెగి పడుతూ ఉంటాయి, భరించరాని హింస, అసలు సెన్సారు వాళ్ళు ఇంత హింస ఉంటే ఈ సినిమాకి యు/ఎ ఎలా ఇచ్చారో, 'ఏ' కదా ఇవ్వాలి. మొత్తంమీద ప్రేక్షకుడికి నిరాశే మిగిల్చారు. ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుడికి చాలా సహనం, ఓపిక ఉండాలి.

tigernageswararao7.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, రవితేజ చెయ్యాల్సిన పాత్ర కాదు ఇది. ఒక యువ నటుడు చెయ్యాల్సిన పాత్ర. అయితే రవితేజ అక్కడక్కడా బాగా చేసాడు. గ్రాఫిక్స్ వలన అతని రూపురేఖలు బాగా మారిపోయాయి. ఒక్కోదగ్గర ఒక్కో హెయిర్ స్టైల్ లో కనపడుతూ ఉంటాడు రవితేజ. నాజర్ పాత్ర రెండో సగంలో ఎక్కువగా వస్తుంది, కానీ అతనికి వేసే వేషం (Look) బాగోలేదు. ఇక అనుపమ్ ఖేర్ (AnupamKher) ఢిల్లీలో హిందీ మాట్లాడతాడు, స్టూవర్టుపురం వచ్చి అక్కడ యాస మాట్లాడేస్తూ ఉంటాడు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ వాళ్ళ పాత్రలు తక్కువే అయినా, పాత్ర పరిధి మేరకు నటించారు. రేణు దేశాయ్ పాత్ర సినిమాకి ఎటువంటి హెల్ప్ అవదు, కానీ ఈ సినిమా వలన ఆమెకి హెల్ప్ అయింది, ఎందుకంటే విడుదలకి ముందు ఆమె చేసిన ప్రచారాల వలన ఆమె రెండో వివాహం గురించి బాగా ప్రచారం వచ్చింది. ఇంకా చాలామంది నటీనటులు వున్నారు, వాళ్ళు అందరూ అంతంత మాత్రంగా చేసారని అనిపిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, నేపధ్యం అంతగా మెప్పించలేకపోయింది. అన్నిటికీ ఒకటే నేపధ్యం ఇచ్చాడు అతను. ఛాయాగ్రహణం బాగుంది పరవాలేదు. మాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. కొన్ని పోరాట సన్నివేశాలు బాగున్నాయి అంతే.

చివరగా, 'టైగర్ నాగేశ్వర రావు' అనే సినిమా స్టువర్ట్ పురం దొంగ కథ అని చెప్పి, ప్రేక్షకుడికి వేరే కథ చూపించనట్టుగా ఉంటుంది. దొంగ ఎలా దొంగతనాలు చేసాడో సినిమాలో ఎక్కడా కనిపించదు, కానీ అతన్ని దేశభక్తుడిగా మాత్రం చూపించడానికి ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. దర్శకుడు వంశీ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, ఆసక్తికరంగా చూపించలేకపోయాడు, దానికి తోడు నిడివి ఎక్కువ, ఓపిక ఉండాలి చూడటానికి.

టాగ్ లైన్: విషయం తక్కువ, ప్రచారం ఎక్కువ ఈ 'టైగర్ నాగేశ్వర రావు'

Updated Date - 2023-10-20T14:59:15+05:30 IST