Hatya film review: 'బిచ్చగాడు' విజయ్ ఆంటోనీ సినిమా 'హత్య' ఎలా ఉందంటే...
ABN , First Publish Date - 2023-07-21T18:23:01+05:30 IST
'బిచ్చగాడు' రెండు పార్టులతో విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు 'హత్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రితిక సింగ్, మీనాక్షి చౌదరి కూడా వున్నారు. బాలాజీ కె కుమార్ దీనికి దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చూడండి.
సినిమా: హత్య
నటీనటులు: విజయ్ ఆంటోనీ (VIjayAntony), మీనాక్షి చౌదరి (MeenkashiChaudhary), రితిక సింగ్ (RitikaSingh), మురళీ శర్మ (MuraliSharma), జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్ (RadhikaSarathKumar), సిద్ధార్థ్ శంకర్, కిషోర్ కుమార్త దితరులు
ఛాయాగ్రహణం: శివకుమార్ విజయన్
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాతలు: ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ (Infiniti Film Ventures & Lotus Pictures)
రచన, దర్శకత్వం: బాలాజీ కుమార్ (Balaji K Kumar)
-- సురేష్ కవిరాయని
'బిచ్చగాడు' #Bichagadu సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (VijayAntony). ఈమధ్యనే 'బిచ్చగాడు 2' #Bichagadu2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించాడు. అలాగే విజయ్ ఆంటోనీ కొంచెం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతను నటించిన తమిళ సినిమా 'కొలై' తెలుగులో 'హత్య' (Hatya) గా విడుదల అయింది. ఇందులో 'హిట్ 2' #Hit2 లో అడివి శేష్ (AdiviSesh) పక్కన చేసిన మీనాక్షీ చౌదరి (MeenakshiChaudhary) ఒక ముఖ్యమైన పాత్ర పోషించగా, ఇంకో ముఖ్య పాత్రలో రితికా సింగ్ (RitikaSingh) కనపడుతుంది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Hatya Story కథ:
హైదరాబాద్ సిటీకి వచ్చిన ప్రముఖ మోడల్ లైలా (మీనాక్షీ చౌదరి) తన ఫ్లాట్‌లో హత్య చేయబడుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఐపీఎస్ సంధ్య (రితికా సింగ్)కి ఈ హత్య కేసును అప్పగిస్తారు. ఆమె పరిశోధనలో భాగంగా లైలా బాయ్ ఫ్రెండ్ సతీష్ (సిద్ధార్థ శంకర్), ఆమెని టాప్ మోడల్ చేస్తానని ప్రామిస్ చేసిన మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ), ఆమె ఫోటోలు తీసిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం), అనాథ ఆశ్రమంలో తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్) ఇలా అందరినీ విచారిస్తుంది. ఆమె ఇలా పరిశోధన చేస్తున్న సమయంలోనే ఆమెకి సహాయంగా ప్రముఖ డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోనీ) కూడా వస్తాడు. అయితే పైన చెప్పిన వాళ్లలో ఎవరు ఆమెని హత్య చేశారు? లేదా వేరే వాళ్ళు చేశారా? ఎందుకు చేశారు? డిటెక్టివ్ వినాయక్ ఈ పరిశోధనలో సంధ్యకి ఏ విధంగా సహాయపడ్డాడు? పై అధికారుల ఒత్తిడిని తట్టుకొని సంధ్య ఈ హత్యని ఎవరు చేశారన్నది, వినాయక్ సహాయంతో ఎలా ఛేదించింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే !
విశ్లేషణ:
దర్శకుడు బాలాజీ కె కుమార్ (Balaji K Kumar) ఇంతకు ముందు రెండు తమిళ సినిమాలు చేసాడు, రెండూ ప్రశంసలు పొందిన సినిమాలే. ఈసారి ఒక మర్డర్ మిస్టరీ కథని తీసుకున్నాడు. సినిమా టైటిల్ 'హత్య'కి #HatyaFilmReview తగ్గట్టుగా కథలో ముందే మోడల్ హత్య చూపించేసాడు. ఇది రెగ్యులర్ సినిమాలా కాకుండా కేవలం పరిశోధన చేసుకుంటూ వెళ్ళటం మీదే చూపిస్తాడు. పాటలు, కథ దారితప్పడానికి వేరే హాస్య సన్నివేశాలు, ఇలాంటివేమీ వుండవు ఇందులో. అయితే సినిమాలో థ్రిల్స్, ట్విస్ట్స్ వుండవు కానీ ఎవరు చంపి వుంటారు, ఎందుకు చంపి వుంటారు అనే అంశం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. రెండో సగం కొంచెం స్పీడ్ అనుకుంటుంది.
ఈ సినిమాకి హైలెట్ మాత్రం ఛాయాగ్రహణం. శివకుమార్ సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా ప్రతి ఫ్రేమ్ బాగా చూపించి, ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసాడు. అలాగే సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. #HatyaFilmReview విజయ్ ఆంటోనీ ఇంతవరకు కథానాయకుడిగా, అతని పక్కన కథానాయకురాలు, విలన్, చిన్న రొమాన్స్, కామెడీ ఇలా ఒక ఫార్మేట్ ఉంటుంది కదా ఎటువంటి సినిమా అయినా, ఇందులో అలాంటివి ఏమీ వుండవు. పరిశోధన మామూలుగానే సాగుతూ ఉంటుంది, క్లైమాక్స్ బాగుంది. ఈ సినిమాకి నేపధ్య సంగీతం పరవాలేదు. అలాగే ఇందులో ప్రేక్షకుడికి ఊహకు మించి లాంటి సన్నివేశాలు ఏమీ వుండవు, ముందు తెలిసిపోతూ ఉంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో రితిక సింగ్ ముఖ్య పాత్ర అయిన పోలీస్ ఆఫీసర్ గా కనపడుతుంది. ఆమె బాగానే చేసింది. అలాగే విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ వినాయక్ గా కనపడతాడు, కానీ ఇందులో పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. #HatyaReview ఇదొక మామూలు పాత్రే. అలాగే మీనాక్షి చౌదరి మోడల్ గా కనపడుతుంది, ఆమె పాత్ర చిన్నదే, కానీ పాత్రకి తగ్గట్టుగా నటించింది. రాధికా శరత్ కుమార్, జాన్ విజయ్, మురళి శర్మ కూడా వున్నారు. మురళి శర్మ కి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు, అది కొంచెం బాగోలేదని చెప్పాలి.
చివరగా, 'హత్య' #HatyaFilmReview అనే సినిమా ఒక టైం పాస్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో పాటలు, రొమాన్స్, కామెడీ ఇలాంటివి ఏవీ లేకుండా, మామూలు సినిమాకి భిన్నంగా తీసాడు దర్శకుడు. హత్య జరుగుతుంది, ఎవరు చేశారు అన్నది పరిశోధన సాగుతుంది. ఇదేమీ పెద్దగా చెప్పుకోవలసిన సినిమా అయితే కాదు, కానీ ఇదొక టైం పాస్ సినిమా.