Vinaro Bhagyam Vishnu Katha (VBVK) film review: సరదాగా చూడొచ్చు
ABN , First Publish Date - 2023-02-18T13:30:19+05:30 IST
ఇప్పుడున్న యువ నటుల్లో చిన్నగా చిన్నగా ఎదుగుతున్న వారిలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే మంచి సినిమాతో ఆరంగేంట్రం చేసి, ఆ తరువాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అనే చిత్రంతో కొంచెం పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).
సినిమా: వినరో భాగ్యము విష్ణు కథ (VBVK)
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ, మురళీ శర్మ, పమ్మిసాయి, 'కె.జి.యఫ్' లక్కీ, ఆమని, దేవి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు
ఛాయాగ్రహణం : డేనియల్ విశ్వాస్
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాత : 'బన్నీ' వాస్
దర్శకత్వం : మురళీ కిషోర్ అబ్బూరు
-- సురేష్ కవిరాయని
ఇప్పుడున్న యువ నటుల్లో చిన్నగా చిన్నగా ఎదుగుతున్న వారిలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే మంచి సినిమాతో ఆరంగేంట్రం చేసి, ఆ తరువాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అనే చిత్రంతో కొంచెం పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈమధ్య అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయం సాధించలేదు, ఇప్పుడు ఈ శివరాత్రి పండగకు 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Review) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పకుడిగా వ్యవహరించగా, అతని శిష్యుడు బన్నీవాస్ (Bunny Vas) నిర్మాత. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. (#VBVKReview)
VBVK Story కథ:
ఈ కథ తిరుపతి లో జరుగుతుంది. విష్ణు (కిరణ్ అబ్బవరం) అనే అబ్బాయి లైబ్రరీ లో పని చేస్తూ ఉంటాడు. అతను ఎదుటివాళ్ళకు అలాగే ఎవరు సహాయం అడిగినా చేస్తూ వుండే గుణం కలవాడు. అలంటి అబ్బాయికి దర్శన (కాశ్మీర పర్దేసి) అనే ఒక యు ట్యూబర్ పరిచయం అవుతుంది. ఆమె పాపులర్ అవటం కోసం నెంబర్ నైబర్స్ అని తన ఫోన్ నెంబర్ కి ఒక అంకె ముందు వెనకాల నంబర్స్ కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటుంది. ఆలా కలిసిన వాళ్ళే విష్ణు మరియు శర్మ (మురళి శర్మ). ఇలా ఈ ముగ్గురూ కలిసి వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతూ వుంటారు, అదే సమయం లో విష్ణు దర్శన ని ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకో పక్క శర్మ కూడా దర్శనను ప్రేమిస్తాడు. ఇద్దరితోను సన్నిహితంగా ఉంటూ దర్శన ఒకరోజు ప్రాంక్ వీడియో చేసి విష్ణు కి చూపించాలని శర్మను రివాల్వర్ తో షూట్ చేస్తుంది. అతను మరణిస్తాడు. దర్శనని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టినపుడు, షూట్ చేసినప్పుడు తీసిన వీడియో వుంది కాబట్టి ఆమె దోషి అని తెలుస్తారు. ఇంతకీ దర్శన ఎందుకు శర్మ ని కాల్చింది? దర్శన నిర్దోషి అని విష్ణు కి తెలిసి ఏమి చేసాడు? ముంబై గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ) తిరుపతి ఎందుకు వచ్చాడు, అతనికి విష్ణుకు సంబంధం ఏమిటి? అసలు శర్మ చనిపోయాడా, బతికే ఉన్నడా, వీటన్నిటి వెనక దాగి వున్న రహస్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) ఈసారి ఒక వైవిధ్యమయిన కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. పక్క నెంబర్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకోవడం, అలాగే పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటాము అనే ఈ రెండు భావనలతో దర్శకుడు ఒక ప్రేమ కథని, అందులోనే చిన్న క్రైమ్, చిన్న సస్పెన్స్, సాయం చెయ్యడం, అలాగే దేశభక్తి ఇన్ని ఒకే దానిలో పెట్టి ఆసక్తికరంగా మలచటం అంత సులువు కాదు, కానీ మురళి కిశోర్ అందులో సఫలం అయ్యాడు. కథ మొదలవడం కూడా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది, ముంబై నుండి రాజన్ అనే స్మగ్లర్ రావటం, అతనికి విష్ణు అదే కిరణ్ అబ్బవరం కథ చెప్పటం, కథ మధ్యలో చిన్న చిన్న సస్పెన్స్, ఇవన్నీ కొత్తగా వున్నాయి.
దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నడిపించే తీరు చాలా బాగుంది. విష్ణు తనకి దర్శన ఎలా పరిచయం అయింది, ఆ నైబర్ నెంబర్ కి ఫోన్ చేసి బాగోగులు అడగటం, అలాగే తన తాత చెప్పిన మాట 'పక్కోడు బాగుంటేనే మనం బాగుంటం' అన్నవి ఇవన్నీ దర్శకుడు చెప్పే తీరు బాగుంది. అలాగే యూ ట్యూబర్ పాపులర్ అవటం కోసం విష్ణు, శర్మ లతో చేసిన వీడియోస్ కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా శర్మ, దర్శన మధ్య వచ్చే వీడియోస్ అయితే చాలా హాస్యభరితంగా ఉంటాయి. మొదటి సగం ఇంత ఇలా సరదాగా చూపించిన దర్శకుడు, విరామం ముందు ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులకు చిన్న ఆసక్తి కూడా పెంచాడు. అలాగే రెండో సగం లో అంతా సస్పెన్స్ ని కంటిన్యూ చేసాడు చివరి వరకు. దర్శన ఎందుకు శర్మ ని చంపాల్సి వచ్చింది, దాని వెనక వున్న మిస్టరీ చెప్పే విధానం కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. అలాగే ఈ నెంబర్ నైబర్ కాన్సెప్ట్ తో ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోవటం అనేది మరీ సినిమాటిక్ గా అనిపించినా, ప్రేక్షకుడికి బోర్ అనిపించదు.
ఇది తిరుపతి లో జరిగిన కథ కాబట్టి ఇందులో పాత్రలు ఎక్కువగా అక్కడి యాస మాట్లాడటం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. అలాగే మాటలు చాలా పదునుగా వున్నాయి, కొన్ని మనసుని హత్తుకుంటాయి కూడా. మొత్తానికి మురళి ఒక చిన్న భావన ని తీసుకొని, ఆ కథలోనే నాలుగు రకాలు ప్రేమ, క్రైమ్, సస్పెన్స్ ఇన్ని మేళవించి బాగా చెప్పాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం విష్ణు పాత్రలో ఒదిగిపోయాడు. అతనికి ఆ పాత్ర బాగా సరిపోయింది, అమరింది కూడా. చక్కటి మాటలు, హావభావాలతో అందరిని ఆకట్టుకునేలా మంచి నటనని కనపరిచాడు. అయితే అతను ఇంకా చాలా చేయాల్సి వుంది. భావోద్వేగాల సన్నివేశాలు చేసేటప్పుడు ఇంకా దృష్టి పెట్టాల్సి వుంది. (#VBVKReview) దర్శన గా కాశ్మీరా తన పాత్ర మేరకు నటించింది. మురళి శర్మ (Murali Sharma) కి మాత్రం ఇది ఒక మంచి పాత్ర అవుతుంది అతని కెరీర్ లో. ఎందుకంటే మొదటి సగం లో బాగా నవ్విస్తాడు, అలాగే రెండో సగం లో చాలా గంభీరంగా ఉంటాడు. ఈ రెండూ కోణాల్లోనూ బాగా చేసాడు మురళి శర్మ. ఇంకా ఎల్.బి. శ్రీరామ్, దేవి ప్రసాద్, శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar), ప్రవీణ్ వీళ్ళందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా సపోర్ట్ చేశారు. రాజన్ గా శరత్ సరిపోయాడు. ఇంకా మాటలకు ప్రేత్యేకంగా అభినందనలు చెప్పాలి. కొన్ని సంభాషణలకు అయితే చప్పట్లు మోగుతాయి. అలాగే ఛాయాగ్రహణం, సంగీతం కూడా బాగున్నాయి.
చివరగా, 'వినరో భాగ్యము విష్ణు కథ' (#VBVKReview) సరదాగా మొదలయి, సస్పెన్స్ తో ముగుస్తుంది. దర్శకుడు మురళి తాను ఏమి చెప్పాలనుకున్నాడో, అది ఎక్కడా బోర్ కొట్టకుండా, (#VBVKReview) సాగదీయకుండా చెప్పేసాడు. కిరణ్ అబ్బవరం కి ఇది ఒక మంచి సినిమా అవుతుంది అనడం లో సందేహం లేదు. ఒకసారి సరదాగా చూడొచ్చు ఈ సినిమా. (#VBVKReview)