Anushka Shetty: సుమ కనకాలతో ఇంటర్వ్యూ , ఎందుకో బయటకి రాలేదు
ABN , First Publish Date - 2023-09-12T14:58:18+05:30 IST
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి తో ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఒక వీడియో ఇంటర్వ్యూ చేసిందని తెలిసింది, అయితే ఆ ఇంటర్వ్యూ ఎందుకనో బయటకి రాలేదు, కారణం మాత్రం ఇదే అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
అనుష్క శెట్టి (AnushkaShetty), నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' #MissShettyMrPoliShetty సినిమా గత వారం విడుదలైంది, మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది కూడా. ఈ సినిమా ప్రచారాలు నవీన్ పోలిశెట్టి ఒక్కడే తన భుజం మీద వేసుకొని చేసాడు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంచిమించి ప్రతి పట్టణాన్ని చుట్టుముట్టి వచ్చి, తన సినిమా గురించి ప్రచారం తానే చేసుకున్నాడు.
మొదటినుంచి కూడా అనుష్క శెట్టి ఈ సినిమా ప్రచారాలకు బైటకి రాలేదు. ఎందుకనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో మాత్రమే ఆమె వెండి తెర మీద కనిపించింది. మామూలుగా ఏదైనా షూటింగ్ జరుగుతోంది అంటే ఫోటోస్ లీకు అవుతూ ఉంటాయి, కానీ అనుష్క, నవీన్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క ఫోటో కూడా బయటకి లీకు అవకుండా జాగ్రత్తపడ్డారు. అదీ కాకుండా అనుష్క కేవలం ఈ సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొంది, అంతే ఒక్కసారి కూడా ప్రచారానికి బయటకి రాలేదు. కేవలం కొంతమందికి ఫోన్ లో మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా తెలిసింది.
సమంత (Samantha) ఒక వింతైన వ్యాధి బారిన పడితే, అప్పట్లో 'యశోద' #Yashoda సినిమా కోసం సుమ కనకాల (SumaKanakala) ఆమె దగ్గరికి వెళ్లి, సమంతని ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో ఇంటర్వ్యూ నే మీడియా అందరికీ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు సుమ కనకాల, అనుష్క, నవీన్ పోలిశెట్టి ని కలిపి ఒక వీడియో ఇంటర్వ్యూ చేసినట్టుగా తెలిసింది. అయితే మరి ఎందుకనో ఆ వీడియో ఇంటర్వ్యూ ని బయటకి తీసుకురాలేదు.
ఆ వీడియో ఇంటర్వ్యూ కి కూడా గ్రాఫిక్స్ అవసరమని భావించి గ్రాఫిక్ కంపెనీ ని అడిగితే, వాళ్ళు ఈ అరగంట ఇంటర్వ్యూ కోసం సుమారు రూ 50 లక్షలు అడిగినట్టుగా తెలిసింది. అది చాలా పెద్ద మొత్తం అని, అదీ కాకుండా వీడియో ఇంటర్వ్యూ అసలు బయటకి ఇవ్వోడు అని చివరి నిముషంలో అనుష్క రిక్వెస్ట్ చేసిందని, అందుకని మొత్తం ఇంటర్వ్యూ బయటకి రాకుండా ఆపేసినట్టుగా తెలిసింది. సినిమాలో అయితే చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వాడినట్టుగా తెలిసిపోతుంది, కానీ వీడియో ఇంటర్వ్యూ కి కూడా గ్రాఫిక్ వాడాలి అనుకోవటం, అది అవకపోవటం ఆసక్తికరం.