Vaarasudu: ఆ ఫ్రెంచ్ సినిమాకు కాపీనా..?
ABN , First Publish Date - 2023-01-05T18:37:48+05:30 IST
వారసుడు ట్రైలర్‌ను విడుదల చేయగానే నెటిజన్స్ పలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. హాలీవుడ్ సినిమాను కాపీ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దలపతి విజయ్ (Vijay). ‘మెర్సల్’ (Mersal), ‘బిగిల్’ (Bigil), ‘మాస్టర్’ (Master) చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అతడు తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Varisu). రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించాడు. ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను విడుదల చేయగానే నెటిజన్స్ పలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. హాలీవుడ్ సినిమాను కాపీ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గొవించ్’ (The Heir Apparent: Largo Winch) సినిమాను కాపీ చేశారని నెట్టింట పోస్ట్‌లు పెట్టారు. లార్గొవించ్ సినిమాకు జెరోమ్ సల్లే దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ, ఈ మూవీని కొంచెం మార్పులు, చేర్పులు చేసి మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే సినిమాను అటు తిప్పి, ఇటు తప్పి ‘అజ్ఞాతవాసి’ టైటిల్‌తో గతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సుజిత్ కూడా కొంచెం యాక్షన్‌ను దట్టించి ‘సాహో’ గా తెరకెక్కించాడు. ప్రస్తుతం ‘వారసుడు’ ట్రైలర్ విడుదల కాగా అందులోను లార్గొవించ్ సినిమా ఛాయలు కనిపించాయి. ఒరిజినల్ ‘లార్గొవించ్’ తో సహా దాని స్ఫూర్తితో రాసుకున్న కథలన్ని ప్లాఫ్ అయ్యాయి. వంశీ పైడిపల్లి గతంలో తీసిన ‘ఊపిరి’ సినిమా.. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్‌టచబుల్స్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మరి ‘వారసుడు’ అనేది ఒరిజినల్ స్టోరినా లేదా మరేదైనా సినిమాను స్ఫూర్తిగా తీసుకుని వంశీ కథను రాసుకున్నాడా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.