2023 Year ender: ఈ సంవత్సరం పరభాషా అమ్మాయిలు ఇక్కడ ఘోరంగా ఫ్లాప్

ABN , Publish Date - Dec 13 , 2023 | 02:28 PM

తెలుగులో ఈసారి హిందీ అమ్మాయిలతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం నుండి ఎంతోమంది నటీమణులు పరిచయం అయ్యారు. కానీ వారిలో ఒక్క రెబా మోనికా జాన్ తప్పితే, మిగతా అందరూ ఘోరంగా విఫలం అయ్యారనే చెప్పాలి.

2023 Year ender:  ఈ సంవత్సరం పరభాషా అమ్మాయిలు ఇక్కడ ఘోరంగా ఫ్లాప్
Reba Monica John is the only successful debut actress in Telugu

ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం తెలుగు నిర్మాతలు, దర్శకులు పరభాషా నటీమణులను ఇక్కడ తెలుగులో కథానాయికలుగా పరిచయం చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలామందిని మలయాళం, కన్నడ, తమిళం, అలాగే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ తెలుగులో పరిచయం చేశారు కానీ అందులో ఒకరిద్దరు తప్ప, మిగతా చాలామందికి ఎదురుదెబ్బే తగిలింది. అంత విజయవంతంగా ఆరంగేట్రం చేయలేకపోయారు అనిపిస్తోంది. ఒక్కసారి ఈ సంవత్సరం ఎంతమంది, ఎన్ని సినిమాలతో పరిచయం అయ్యారో చూద్దాం.

rebamonicajohn.jpg

రెబా మోనికా జాన్ (సామజవరగమన)

రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) కన్నడ సినిమాలు చాలా చేసింది, అలాగే మలయాళం, తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఈమె మొదటి తెలుగు సినిమా శ్రీవిష్ణు సరసన 'సామజవరగమన' #Samajavaragamana లో నటించింది. ఇది ఒక వినోదాత్మకమైన సినిమా, ఇందులో రెబా తన నటనతో పాటు క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులని మెప్పించింది. తెలుగు కూడా నేర్చుకుంది, అలాగే ఈ సినిమా ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు తెలుగులో మాట్లాడింది. ఇంతకు ముందు నటీమణులతో పోలిస్తే, రెబా తెలుగు ఆరంగేట్రం చాలా పెద్ద విజయం అని చెప్పాలి. అయితే ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది, కానీ ఎందుకో రెబా ఇంకా తన రెండో తెలుగు సినిమా ప్రకటించలేదు. ఈ సంవత్సరం ఎంతోమంది నటీమణులు తెలుగు పరిశ్రమలో ఆరంగేట్రం చేసినా రెబా మోనికా జాన్ మాత్రమే మంచి విజయం సాధించారు అని చెప్పొచ్చు.

sakshivaidya3.jpg

సాక్షి వైద్య (ఏజెంట్)

దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' #Agent సినిమాలో సాక్షి వైద్య అనే అమ్మాయిని పరిచయం చేశారు. మహారాష్ట్రకి చెందిన సాక్షి వైద్య చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది, అందులో భాగంగా పలు టీవీ ప్రచార చిత్రాల్లో నటించింది. మోడల్ గా మంచి పాపులారిటి సంపాందించి, హిందీ సినిమాలలో అవకాశాలకై తన పోర్టుఫోలియోని పలు ఎజెన్సీలకి పంపింది. అదే సమయంలో సురేందర్ రెడ్డి బృందం 'ఏజెంట్' సినిమాకోసం కథానాయికని వెతుకుతూ ఈమె ప్రొఫైల్ చూసి ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సాక్షి వైద్యకి 'గాండీవదారి అర్జున' #GandeevadhariArjuna సినిమా కూడా వచ్చింది. అయితే మొదటి సినిమా చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద హైప్ కూడా వుంది విడుదలైంది, కానీ సినిమా ఫ్లాప్ అవటంతో, సాక్షి ఆరంగేట్రం అంతగా లేదనే చెప్పాలి. తరువాత వరుణ్ తేజ పక్కన నటించిన 'గాండీవధారి అర్జున' కూడా ఫ్లాప్ అవటంతో సాక్షి వైద్య కెరీర్ అంత సుగమగంగా లేదనే చెప్పాలి.

Nupur-3.jpg

నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ (టైగర్ నాగేశ్వర రావు)

తెలుగులో మహేష్ బాబు సరసన '1: నేనొక్కడినే' అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన నటి కృతి సనన్ (Kriti Sanon). తరువాత ఒకటి రెండు తెలుగు సినిమాలలో నటించినా, ఇక్కడ కన్నా హిందీ పరిశ్రమే మేలు అనుకోని, హిందీలో ప్రయత్నాలు ప్రారంభించి అక్కడ అగ్ర నటీమణుల్లో ఒకరుగా వెలుగొందుతోంది కృతి సనన్. ఈమధ్యనే జాతీయ అవార్డు కూడా తీసుకున్నారు కృతి సనన్. ఆమె చెల్లెలు నుపుర్ సనన్ (Nupur Sanon) కూడా సినిమా రంగ ప్రవేశం చేయదలచి అక్కలాగే, తెలుగులోనే ముందుగా ఆరంగేట్రం చేయాలనుకుంది. అందుకే రవి తేజ పక్కన 'టైగర్ నాగేశ్వరరావు' #TigerNageswaraRao సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అంత విజయం సాధించలేకపోయింది, నుపుర్ కెరీర్ ని పెద్దగా మలుపు తిప్పలేకపోయింది. తరువాత మంచు విష్ణు నిర్మిస్తూ, నటిస్తున్న భక్తి చిత్రం 'కన్నప్ప' #Kannappa లో ముందుగా నుపుర్ సనన్ పేరే ప్రకటించారు, కానీ మళ్ళీ వివిధ కారణాల వలన ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది నుపుర్ సనన్. ఇదే సినిమాలో ఇంకో అమ్మాయి గాయత్రీ భరద్వాజ్ కూడా ఆరంగేట్రం చేసింది తెలుగులో, కానీ ఆమెకి కూడా అనుకున్నంతగా పేరు రాలేదనే చెప్పాలి.

ashikaranganath.jpg

ఆషికా రంగనాథ్ (త్రి అమిగోస్)

ఆషికా రంగనాథ్ కన్నడ అమ్మాయి. కన్నడంలో, తమిళంలో కొన్ని సినిమాలు చేసాక తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన 'త్రి అమిగోస్' అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. అయితే ఈమె కన్నడంలో, తమిళంలో చాలా సినిమాలు చెయ్యడం వలన అనుభవశాలి కాబట్టి, ఒకవేళ తెలుగులో సినిమా విజయం సాధించకపోయినా, ఈమెకి సినిమా ఛాన్సులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే 'త్రి అమిగోస్' ఆశించినంతగా విజయం సాధించకపోయినా, ఆశికా రెండో తెలుగు సినిమా 'నా సామి రంగా' #NaaSaamiRanga లో నాగార్జున (Nagarjuna Akkineni) పక్కన చేస్తోంది. ఈ సినిమా రానున్న సంక్రాంతి పండగకి విడుదలవుతోంది. తెలుగు సినిమాలే కాకుండా, తమిళం, కన్నడ సినిమాలు ఈమె చేతిలో వున్నాయి.

anikhasurendran.jpg

అనిఖా సురేంద్రన్ (బుట్ట బొమ్మ)

మలయాళం హిట్ సినిమా 'కప్పేలా' #Kappela అనే సినిమాని తెలుగులో పెద్ద నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైనమెంట్స్ (SitharaEntertainments) 'బుట్ట బొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. చెప్పాలంటే 'అల వైకుంఠపురంలో... ' సినిమాలో 'బుట్ట బొమ్మా' అనే పాట చాలా పెద్ద హిట్ అయింది, త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) ఆ సినిమాకి దర్శకుడు. ఆ త్రివిక్రమ్ భార్య సౌజన్య ఈ 'బుట్ట బొమ్మ' సినిమాకి ఒక నిర్మాత కూడా. ఈ 'బుట్ట బొమ్మ' సినిమా ద్వారా మలయాళం నటి అనిఖా సురేంద్రన్ (AnikhaSurendran) ని కథానాయికగా పరిచయం చేశారు. అయితే ఈ మలయాళం సినిమా ఓటిటి లో అందరూ చూడటం, దానికి సరిసమానంగా తెలుగు సినిమా లేకపోవటంతో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. అలా అనిఖా సురేంద్రన్ తెలుగు ఆరంగేట్రం అంతగా ముందుకు సాగలేదు. కానీ అనిఖా మలయాళం సినిమాలతో చాలా బిజీగా వుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కూడా మలయాళం ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు.

ishwaryamenon.jpg

ఐశ్వర్య మీనన్ (స్పై)

తెలుగు చిత్ర పరిశ్రమలో హిందీ అమ్మాయిలు కన్నా ఈసారి కన్నడ, తమిళ, మలయాళం అమ్మాయిలే ఎక్కువ ఆరంగేట్రం చేసారు అనిపిస్తోంది. ఇంతకు ముందు రెబా, ఆషికా, అనిఖా లా ఐశ్వర్య మీనన్ కూడా తమిళం, మలయాళం సినిమాలు చేసాక తెలుగులో ఈ 'స్పై' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) కథానాయకుడు, ఇది సుభాష్ చంద్ర బోస్ మరణం గురించిన నేపధ్యంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమాలో ప్రచారానికి ముందు చెప్పినట్టుగా సినిమాలో సుభాష్ చంద్ర మరణం గురించిన ఎటువంటి కొత్త విషయాలు కానీ, ఆసక్తికరమైన కథ లేకపోవటంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఐశ్వర్య తెలుగు ఆరంగేట్రం ఆలా అపజయంతో మొదలైందని చెప్పాలి.

PragatiSrivastava.jpg

ప్రగతి శ్రీవాత్సవ (మను చరిత్ర)

రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి కథానాయకుడిగా వచ్చిన చిత్ర 'మను చరిత్ర'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాత్సవ కథానాయికగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యకి చెందిన ప్రగతి టీవిలో మొదటగా నటించాను అని చెప్పింది. ఆ తరువాత ఈ 'మను చరిత్ర' సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయింది, కానీ ఆ సినిమా అసలు వచ్చినట్టే ఎవరికీ తెలియకపోవడంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'పెద్ద కాపు 1' (PeddhaKapu 1) సినిమాతో మళ్ళీ లాంచ్ అయ్యాను అని చెప్పింది. కానీ ఆసక్తికరం ఏంటంటే రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపు అవటం. అందుకని ప్రగతి సినిమా ఆరంగేట్రం అంత సులువుగా లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈమె మంచి సినిమాల కోసం ఎదురుచూస్తోంది అని చెపుతోంది.

yuktitarejarangabali.jpg

యుక్తి తరేజా (రంగబలి)

యువ నటుడు నాగ శౌర్య (Naga Shaurya) పక్కన 'రంగబలి' #Rangabali అనే సినిమా ద్వారా యుక్తి తరేజా (YuktiTareja) చిత్ర రంగ ప్రవేశం చేసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన యుక్తి ఇంతకు ముందు మోడల్ గా పని చేసింది. అలాగే ఇమ్రాన్ హష్మీ (EmraanHashmi) తో ఒక సంగీత వీడియో లో నటించింది, అది బాగా ప్రాచుర్యం పొందటంతో యుక్తి పేరు కూడా బాగా వినపడింది. అలా పేరుతెచ్చుకున్న ఆమెని ఈ తెలుగు సినిమా 'రంగబలి' ద్వారా చిత్ర నిర్వాహకులు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. కానీ ఈ సినిమా అంతగా నడవలేదనే చెప్పాలి. నాగ శౌర్య కూడా ఈ సినిమా మీద ఎన్నో అసలు పెట్టుకున్నారు కానీ, అతని ఆశలు కూడా ఫలించలేదు.

priyabhavanishankar.jpg

ప్రియా భవానీ శంకర్ (కళ్యాణం కమనీయం)

ఇంకొక తమిళ నటి ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) తెలుగులో 'కళ్యాణం కమనీయం' (Kalyanam Kamaneeyam) అనే సినిమాతో పరిచయం అయ్యారు. ప్రియా ఇంతకు ముందు తమిళ సినిమాలు చాలా చేశారు, అందులో కొన్ని డబ్బింగ్ సినిమాలుగా తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే నేరుగా తెలుగు సినిమా చేసింది మాత్రం 'కళ్యాణం కమనీయం'. ఇందులో సంతోష్ శోభన్ కథానాయకుడు కాగా, ఈ సినిమా ఈ సంవత్సరం మొదట్లోనే విడుదలైంది, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. ఈ సినిమా వలన అటు కథానాయకుడికి, ఇటు ప్రియా భవానీ శంకర్ కి ఎటువంటి ఉపయోగం కలగలేదు.

avantikadasani.jpg

పైన చెప్పిన వాళ్లే కాకుండా, ఇంకొక అమ్మాయి అవంతిక దాసాని (AvantikaDasani) అనే ఆమె 'నేను స్టూడెంట్ సర్' అనే సినిమాతో చిత్ర ప్రవేశం చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ కథానాయకుడు, రాకీ ఉప్పలపాటి దర్శకుడు. అవంతిక, ఒకప్పటి ప్రముఖ హిందీ నటి భాగ్యశ్రీ కుమార్తె అవటం ఆసక్తికరం. ఆమె ఒక చిన్న సినిమా అయిన 'నేను స్టూడెంట్ సర్' పరిచయం అవటం కొంచెం ఆశ్చర్యం అనిపించినా, ఈ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం వర్క్ అవుట్ అవలేదు. అయితే అవంతిక ఇప్పుడు హిందీ సినిమా చేస్తోంది అని తెలిసింది. ఇంకా గీతికా తివారి అనే ఆమె దర్శకుడు తేజ సినిమా 'అహింస' తో పరిచయం అయింది, సినిమా వచ్చినట్టే తెలియలేదు, అలాగే ఒకటి రెండు రోజులు ఆడి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఇంకా రితిక చక్రబోర్తి అనే నటి 'అనంత' అనే ఒక చిన్న సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమాకి మధుబాబు దర్శకుడు కాగా ప్రశాంత్ కార్తీ కథానాయకుడు.

Updated Date - Dec 21 , 2023 | 06:03 PM