రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ కదా, మరి కృష్ణ రాముడిగా రేర్ ఫోటో చూసారా...
ABN , Publish Date - Nov 29 , 2023 | 05:09 PM
కృష్ణుడుగా ఎన్ టి రామారావు తప్పితే వేరేవాళ్లని వూహించుకోలేరు ప్రేక్షకులు, అంతగా అతను ఆ పాత్రలో చెరగని ముద్ర వేశారు, మరి సూపర్ స్టార్ కృష్ణ ఒకసారి రాముడు పాత్ర వేశారు. అదెప్పుడు, ఎక్కడ ఏ సినిమాలో అంటే...
భారతీయ చలనచిత్ర రంగంలో పౌరాణిక సినిమాలు అంటే తెలుగు వాళ్లే తీయాలి అనేది జగమెరిగిన సత్యం. తెలుగులో ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చాయి, అసలు ఎవరూ తీయనన్ని సినిమాలు తెలుగువాళ్లు తీశారు అంటే అతిశయోక్తి కాదేమో. అందులో ఎన్టీఆర్ (NTR) అంటే పౌరాణిక పాత్రలకి పెట్టింది పేరు. 'మాయాబజార్' #Mayabazar సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా వేసిన పాత్ర ఈరోజుకి సినిమా చరిత్రలో ఒక అత్యద్భుతమైన పాత్రగా నిలిచిపోతుంది. తరువాత కృష్ణుడు అంటే ఎన్టీఆర్ (NT Rama Rao) మాత్రమే ఆ పాత్రని వెయ్యగలరు అనేవారు, అలాగే రాముడిగా కూడా మెప్పించారు. పౌరాణిక ప్రతినాయకుల పాత్రలైన రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, ఇంద్రజిత్ ఒకటేమిటి ఎన్నో పౌరాణిక పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్ రాముడుగా, కృష్ణుడుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
అలాగే జేమ్స్ బాండ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) అని చెపుతారు, అతను ఎక్కువ అటువంటి సినిమాలే చేశారు. కానీ చాలా తక్కువ పౌరాణిక చిత్రాల్లో నటించారు అందులో 'కురుక్షేత్రం' ఒకటి, ఈ సినిమాలో అర్జునిడిగా కృష్ణ కనిపిస్తారు. అయితే కృష్ణ రాముడిగా వున్న ఫోటో ఒకటి ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది. కృష్ణ రాముడిగా ఏ సినిమాలో చేశారు, అసలు రాముడుగా కృష్ణ ఎలా వుంటారు, ఇవన్నీ చాలామందికి వుండే ఆసక్తికరమైన ప్రశ్న.
కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' #AlluriSeetharamaRaju సినిమాలో చివర్లో కృష్ణ ని బ్రిటిష్ జనరల్ తుపాకీతో కాల్చమని భారత సైనికులను ఆదేశిస్తే, భారతీయ సైనికులకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనపడతారు కృష్ణ. ఆ సన్నివేశంలోనే కృష్ణ ఒక సైనికుడికి రాముడుగా కనపడతాడు. అప్పుడు కృష్ణ రాముడుగా వేసిన ఆ చిన్న స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కృష్ణ పౌరాణిక సినిమాలు చేసినవి బహు తక్కువ, అందులోనే రాముడు, కృష్ణుడు పాత్రలు అయితే అస్సలు వెయ్యలేదు.