NT Rama Rao: పేకేటి శివరాం నిజంగానే ఎన్టీఆర్ ని కుర్చీతో కొట్టారు.. ఎప్పుడు ఎక్కడ, తరువాత ఏమైంది ?
ABN , First Publish Date - 2023-08-01T12:44:15+05:30 IST
దివంగత ఎన్ టి రామారావు క్రమశిక్షణకు మారుపేరు. ఒకసారి మేకప్ వేసుకొని సెట్ లోకి వచ్చారు అంటే ఇక అతను రామారావు గా కాకుండా, ఆ పాత్రలోనే వుంటారు. 'పాండురంగ మహత్యం' సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశంలో పేకేటి శివరాం, ఎన్టీఆర్ ని కుర్చితో కొట్టాలి అప్పుడు ఏమి జరిగిందో తెలుసా....
భారత చలన చిత్ర పరిశ్రమలో ఎన్ టి రామారావు (NTRamaRao) కి ఒక ప్రత్యేక స్థానం వుంది. 'మనదేశం' #ManaDesam నుండి తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు ఎన్టీఆర్ (NTR). పౌరాణిక పాత్రల్లో తనదైన నటనతో మెప్పించి ఆ పాత్రలకు వన్నె తెచ్చిన మహానటుడు ఎన్టీఆర్. కృష్ణుడు, రాముడు లాంటి పాత్రలే కాకుండా, పౌరాణికాల్లో ప్రతినాయకుడు పాత్రలు అయిన రావణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మెప్పించిన ఓ గొప్ప నట చక్రవర్తి ఎన్టీఆర్.
ఒక్క పౌరాణిక సినిమాలే కాకుండా, జానపదం, సాంఘికం ఒకటేమిటి అన్ని రకాల చిత్రాలలోనూ, అన్ని పాత్రలలోనూ ఇమిడిపోయి ఆ పాత్రనే తెర మీద చూడగలిగేట్టు చేసిన నటుడు ఎన్టీఆర్. ఎన్నో ఆణిముతాల్లాంటి సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కెరీర్ లో 'పాండురంగ మహత్యం' #PandurangaMahatyam కూడా వుంది. ఇది పండరీపురం క్షేత్ర మహాత్మ్యం కథకి సంబందించినది. అయితే ఈ కథను అప్పటికే తమిళంలో 'హరిదాసు' గా వచ్చింది. ఆ సినిమా రెండో సారి విడుదలైనప్పుడు ఎన్టీఆర్, అతని సోదరుడు త్రివిక్రమరావు (TrivikramaRao) ఈ సినిమాను చూసి, ఎంతో ప్రేరణ పొంది, ఎలా అయినా ఆ సినిమాను తెలుగులో తీయాలని సంకల్పించారు ఎన్టీఆర్. అందుకే తన స్వంత బ్యానర్ అయిన నేషనల్ ఆర్ట్ థియేటర్ (NationalArtTheatre) మీదే ఈ సినిమాను నిర్మించారు.
కమలాకర కామేశ్వర రావు (KamalakaraKameswaraRao) దీనికి దర్శకత్వం వహిస్తే, ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మాత. ఈ సినిమా 1957 నవంబర్ 28న విడుదలై తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలు చూరగొంది. ఇందులో ఎన్టీఆర్ పుండరీకుడుగా గొప్ప నటన ప్రదర్శించారు. ఇందులో చాలామంది నటించారు, అందులో పేకేటి శివరాం కూడా వున్నారు. అతను ఒక సన్నివేశంలో అంటే వేశ్యాగృహంలోకి ఎన్టీఆర్ వచ్చి సరోజాదేవిని (BSarojaDevi) బెదిరిస్తున్నప్పుడు అక్కడే వున్న శివరాం (PekeTiSivaram) కుర్చీతో ఎన్టీఆర్ ని కొట్టాలి. "అన్నా దెబ్బ తగులుతుంది నేను ఆలా కొట్టలేను" అని అన్నారు శివరాం.
వెంటనే ఎన్టీఆర్ "శివా, నువ్వు నటుడివి అన్న సంగతి మరిచిపోకు. నువ్వు కొట్టేది రామారావును కాదు, పుండరీకుడిని. కమాన్, గెట్ ఇన్ టూ ది మూడ్ (Get into the mood)" అని చెప్పారు రామారావు. శివరాం ఇంకేమీ మాట్లాడకుండా ఆ సన్నివేశంలో రామారావు ను కుర్చితో కొట్టగానే రామారావు వీపు చిట్లి రక్తం వచ్చింది. కుర్చీ విరిగిపోయింది. శివరాం భయపడి ఓ మూలన కూర్చుండిపోయారు. దర్శకుడు షాట్ కట్ అని చెప్పిన తరువాత రామారావు వీపుకి క్రీము రాశారు.
ఆ సన్నివేశం అవగానే రామారావు, శివరాం దగ్గరకి వచ్చి "ఇదంతా నటన, ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. అందరం నటిస్తున్నాం అంతే, అందులో ఫీల్ అవడానికి ఏమీ లేదు," అని చెప్పారు. అంటూనే శివరాం భుజం మీద చెయ్యివేసి అతన్ని మళ్ళీ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. రామారావు నటనలో నిబద్ధతకు ఇది ఒక ఉదాహరహణ అంటూ అప్పట్లో శివరాం ఒక సందర్భంగా ఒక పత్రికకు రామారావు గురించి రాస్తూ చెప్పిన మాటలు ఇవి.