Vijayakanth funeral : అశ్రునయనాల నడుమ విజయ్‌కాంత్ అంత్యక్రియలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 05:23 AM
డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ అంత్యక్రియలు శుక్రవారం లక్షలాదిమంది అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునివాళుల మధ్య ముగిశాయి.
డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ అంత్యక్రియలు శుక్రవారం లక్షలాదిమంది అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునివాళుల మధ్య ముగిశాయి. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెన్నైనగరానికి తరలివచ్చారు. శుక్రవారం ఉదయం ప్రజల సందర్శనార్థం విజయకాంత్ భౌతికకాయాన్ని కోయంబేడులోని పార్టీ కార్యాలయం నుండి అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు నిర్వహించే చెన్నై ఐలాండ్ గౌండ్స్కు తరలించారు. విజయకాంత్ పార్థీవ దేహానికి దారిపొడవునా అభిమానులు నీరాజనాలు అర్పిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు విజయకాంత్ భౌతికకాయాన్ని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం వద్ద ఓ చందనపు పేటికలో ఉంచి ఖననం చేశారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు ఎం.సుబ్రమణ్యం, టీఎం అన్బరసన్లతో పాటు తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
ప్రేమకు బానిసను : రజనీకాంత్
తాను విజయకాంత్ ప్రేమకు బానిసను అని హీరో రజనీకాంత్ అన్నారు. నివాళులు అర్పించిన తర్వాత మీడియాలో మాట్లాడుతూ, ‘మంచి మిత్రుడిని కోల్పోవడం దురదృష్టం. మనసుకు చాలా కష్టంగా ఉంది. ధృఢచిత్తం కలిగిన మనిషి. ఎలాగైనా సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారని భావించాం. ఒకసారి విజయకాంత్‌తో పరిచయమైతే ఆయన ప్రేమకు బానిసలైపోతాం. స్నేహానికి ప్రతీక. కెప్టెన్ పేరుకు తగిన వ్యక్తి. సినీ రంగానికి చెందిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ, ఆయనపై ఎవరికీ కోపం రాదు. ఆయన కోపం వెనుక ఒక న్యాయం ఉంటుంది. నిస్వార్థపరుడు. విజయ్‌కాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద శక్తిగా అవతరించి ఉండేవారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేసివుండేవారు. ఆ భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయారంటూ’ రజినీకాంత్ కళ్ళు చెమర్చారు.
కోపానికి వీరాభిమానిని : కమల్ హాసన్
విజయ్‌కాంత్ కోపానికి తాను వీరాభిమానిని అని అగ్రనటుడు కమల్ హాసన్ అన్నారు. ఆయనకు కోపం ఎక్కువ. కానీ, ఆ కోపంలో న్యాయం ఉంటుంది. ఆయన కోపానికి నేను వీరాభిమానిని. ఆ న్యాయమైన కోపం కారణంగానే ఆయన ప్రజాసేవకు వచ్చారని నేను భావిస్తున్నాను. మంచి స్నేహితుడికి బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను’ అని పేర్కొన్నారు.
భోజనం చేయకుండా పంపేవారు కాదు
విజయకాంత్ ఇంటికి ఎవరైనా వెళితే భోజనం చేయకుండా బయటకు పంపేవారు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విజయకాంత్ పార్థివదేహానికి ఆమె నివాళులు అర్పించి, ప్రేమలత విజయకాంత్, ఇద్దరు కుమారులను ఓదార్చారు.
- చెన్నై(ఆంధ్రజ్యోతి)