Dil Raju Comments: బలగం.. రాజకీయ ప్రవేశం.. దిల్ రాజు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-04T21:06:36+05:30 IST
‘‘రాజకీయాల్లోకి రమ్మని నన్ను చాలామంది నేతలు అడుగుతున్నారు. ఆ విషయంలో నాకే స్పష్టత లేదు. అటు అడుగు వేయాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నా.
‘‘రాజకీయాల్లోకి రమ్మని నన్ను చాలామంది నేతలు అడుగుతున్నారు. ఆ విషయంలో నాకే స్పష్టత లేదు. (Dil raju political Entry) అటు అడుగు వేయాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నా. నేనున్న రంగంలో ఎవరైనా నాపై కామెంట్స్ చేస్తేనే నేను తట్టుకోలేను. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మానసికంగా అన్నింటికీ సిద్థపడాలి. అది నా వల్ల కాకపోవచ్చు. ఇందులోనే నా సమాధానం ఉంది’’ దిల్‌రాజు అన్నారు. తాజాగా ఆయన నిర్మించిన ‘బలగం’(Politics) చిత్రం సంచలనం సృష్టిస్తోంది. భారీ విజయంతో దూసుకుపోతోంది. సినిమా సాధిస్తున్న సక్సెస్ పట్ల మంగళవారం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ‘బలగం’ షోలను అడ్డుకుంటున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. సినిమా ద్వారా కుటుంబాలు కలుస్తున్నాయనీ, సొసైటీలో మార్పు వస్తుందని అంటుంటే అంత కంటే గొప్ప ఏముంది. దీంతో మా జన్మ ధన్యమైందన్న భావన కలుగుతోందన్నారు. ఏ షోను ఎక్కడా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా చూసినా ఆనందమేనని తెలిపారు. డబ్బు కంటే గొప్ప సినిమా ఇచ్చామనే అనుభూతి కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలా బహిరంగ ప్రదర్శనల వల్ల ఓటీటీ నుంచి న్యాయపరమైన ఇబ్బందులున్నా వాటిని తమ సంస్థ పరిష్కరించుకుంటుందని చెప్పారు. ఇంకా గ్రామాల్లో ఎవరైనా ‘బలగం’ చూడాలనుకుంటే ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తామని దిల్ రాజు చెప్పారు. (balagam success)
‘‘నాకు వస్తున్న పేరు, గుర్తింపు చూడలేని ఓ బ్యాచ్ బలగం సినిమాను అడ్డుకుంటున్నా అనే వార్తను బయటకు వదిలారు. నేను నిజాయతీగా ఉన్నాను. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపే ప్రయత్నం కూడా చేస్తాను’’ అని దిల్ రాజు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీస్తున్నామని తెలుసు కానీ గొప్ప సినిమా అవుతుందని, ఓ చరిత్ర అవుతుందని ఊహించలేదు. చిన్న సినిమాగా ప్రారంభమై మైలురాయిగా నిలిచింది. విడుదలై ఐదు వారాలు దాటుతున్నా.. ఏదో ఒక పక్క నుంచి సినిమా గురించి ప్రశంసలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా వాళ్లే కాకుండా రాజకీయ నాయకులు సైతం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే మరింత బాధ్యత భుజాన వేసినట్లు ఉంది. తెలుగు సినిమా ఇండస్ర్టీలో బలగం ఎప్పుడూ నిలబడిపోయే ఓ చరిత్ర" (Balagam is history)
'ఊళ్లు ఊళ్లు కదిలిస్తున్నావు’ అన్నాడు.
"ఒకప్పుడు ఆంధ్రాలో 16 ఎంఎం. కల్చర్ ఉండేది. పండుగల సమయంలో సినిమాలు తీసుకొచ్చి తెరపై ప్రదర్శించేవారు. నేను 9వ తరగతి చదివేటప్పుడు 16 ఎం.ఎంపై సినిమాలు వేసేవాడిని. అప్పుడు నాతో ఉన్న స్నేహితుడు ఇటీవల ఫోన్ చేసి ఆ సంగతులు గుర్తు చేశాడు. ‘‘ఇప్పుడు పల్లె పల్లెలో మీ బలగం మారు మోగుతోంది. అప్పట్లో నీ ఆలోచన నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు నువ్వే ఒక నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ‘బలగం’ లాంటి సినిమా తీసి ఊళ్లు ఊళ్లు కదిలిస్తున్నావు’ అన్నాడు. చాలా ఆనందంగా అనిపించింది. సోమవారం ఓ వీడియో చూసి షాక్ అయ్యా. మా సినిమా చూసి ఎప్పుడో స్థల వివాదంతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వివాదాన్ని పక్కన పెట్టి గ్రామ సర్పంచ్ ముందు ఒకటయ్యారు. నా 20 ఏళ్ల జర్నీలో ‘బొమ్మరిల్లు’ చిత్రం ఓ కొత్త అనుభూతి కలిగించింది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్‌లో మార్పు వచ్చింది. ‘బలగం’ చూసిన చాలామందిలో మార్పు వచ్చింది. బంధాలు బలపడుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ‘బలగం’కు ఒక పేజీ ఉంటుంది’’ అని అన్నారు.
ఆస్కార్‌కు ట్రై చేస్తాం...
ఈ సినిమా విడుదలకు ముందే హర్షిత్, హన్షిత ఇంటర్నేషనల్ అవార్డు పోటీలకు పంపారు. ఇప్పుడు ఈ చిత్రానికి ఏడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 20 ఏళ్లలో 50 సినిమాలు చేశాను. ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్ రాలేదు. ఈ సినిమాకు వచ్చాయి.