Anchor Jhansi: అతడి మరణం తట్టుకోలేను, ఝాన్సీ భావోద్వేగ పోస్ట్, సినీ ప్రముఖుల స్పందన
ABN , First Publish Date - 2023-11-08T14:02:15+05:30 IST
ఎన్నో ఏళ్లుగా అటు టీవీ ప్రేక్షకులకు, ఇటు సినిమా ప్రేక్షకులకి పరిచయస్తురాలైన ఝాన్సీ తీరని దుఃఖంలో మునిగిపోయింది. ఆమె తన సాంఘీక మాధ్యమంలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టి తన దుఃఖానికి కారణం తెలియచేసింది.
ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ (Jhansi) అందరికీ పరిచయస్తురాలు. ఆమె టీవీ వ్యాఖ్యాతగా, చాలా తెలుగు చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటుకున్నారు. అలాగే సామజిక సమస్యల మీద కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరిగే ఎటువంటి దాడి అయినా ఆమె ఖండిస్తూ వుంటారు. అటువంటి ఝాన్సీ ఇప్పుడు చాలా ఆవేదనకు గురయ్యారు. తన తమ్ముడు లాంటి శ్రీను, తన వ్యక్తిగత కార్యదర్శి కూడా అయిన అతను ఈరోజు గుండెపోటు వచ్చి మరణించాడు. అందుకు ఝాన్సీ ఎంతో ఆవేదనతో అతని గురించి తన సాంఘీక మాధ్యమం అయిన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. (Jhansi secretary Sreenu Babu passed away with cardiac arrest)
"శ్రీను, శ్రీనుబాబు అని నేను ముద్దుగా పిలుచుకునే నా ప్రధాన సపోర్ట్ సిస్టమ్. హెయిర్ స్టైలిస్ట్‌గా అతను నా దగ్గర చిన్నగా ప్రారంభించి, తరువాత నా వ్యక్తిగత కార్యదర్శిగా ఎదిగాడు. అంతే కాకుండా నా పనులన్నీ చూసుకోవటమే కాకుండా, చాలా సమర్థవంతంగా నిర్వహించేవాడు. అతను ఉంటే చాలు నాకు ఎంతో ఉపశమనం, అతనే నా బలం కూడాను. అతను చాలా సౌమ్యుడు, మంచివాడు, నిజాయితీపరుడు, అప్పుడప్పుడూ చమత్కారమైన హాస్యం కూడా మాట్లాడుతాడు. అతను నాకు అన్నిటికంటే ఎక్కువ, నాకు నా కుటుంబానికి అతను సొంత తమ్ముడుగా భావిస్తూ వుంటాను. 35 సంవత్సరాల వయస్సులో, కార్డియాక్ అరెస్టు తో ఈ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు," అని ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు ఝాన్సీ. నేను అతని మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను, నా గుండె బద్దలైంది అంటూ జీవితం నీటి బుడగలాంటిది అని వ్యాఖ్యానించారు ఝాన్సీ.
దీనికి చాలామంది సినీ ప్రముఖులు స్పందించి, ఝాన్సీకి మెసేజ్ లు పెట్టారు. ప్రముఖ నటుడు అడివి శేష్ (AdiviSesh), నిజంగా నీకొచ్చిన ఈ దుఃఖం తీర్చలేనిది అని అన్నాడు. ప్రముఖ కేరక్టర్ నటి సన (Sana) స్పందిస్తూ, అతను నాకు కూడా తెలుసు, చాలా మంచివాడు, బాగా పని చేసే గుణం కలవాడు, చాలా విచారకరం. అవును జీవితం ఎప్పుడూ ఎలా ఉంటుందో ఊహించలేము అని అన్నారు.
అలాగే ఇంకొక క్యారెక్టర్ నటి సురేఖా వాణి (SurekhaVani), దర్శకురాలు నందిని రెడ్డి (NandiniReddy), శృతి బోయినపల్లి ఇంకా చాలామంది ఝాన్సీ పెట్టిన ఈ పోస్ట్ మీద తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఝాన్సీ కి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.