Lava kusa: అరవై ఏళ్ళ లవకుశ.. అసలు ఎలా మొదలైందంటే ..!
ABN , First Publish Date - 2023-03-30T01:44:45+05:30 IST
'రామాయణం’ (Ramayanam) ను తెలుగు చలన చిత్రంగా రూపొందించటం 1932లోనే ప్రారంభమైంది. రామాయణం ఇతివృత్తంగా చాలాకథలే వచ్చాయి. కానీ మార్చి 29 1963 లో వచ్చిన 'లవ కుశ" (Lava kusha) మాత్రం ఎంతో ప్రత్యేకం.
'రామాయణం’ (Ramayanam) ను తెలుగు చలన చిత్రంగా రూపొందించటం 1932లోనే ప్రారంభమైంది. రామాయణం ఇతివృత్తంగా చాలాకథలే వచ్చాయి. కానీ మార్చి 29 1963 లో వచ్చిన 'లవ కుశ" (Lava kusha) మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ చిత్రం విడుదలై ఈ నెల 29 వ తేదికి 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘లవకుశ’ (Lava kusa completes 60 years) ఓ అద్భుతం. అందులోని కథ, పాత్రలు, పాత్రధారులు, వారి నటనా వైభవం, కథను నడిపించిన తీరు.. దర్శకత్వం.. అన్నీ వేటికవే ప్రత్యేకం. ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ, పూర్వ రామాయణాన్ని చెబుతూ, మొత్తంగా రామాయణాన్ని, అద్వితీయమైన రామకథను ఏనాటికీ మరపురాని, ఎప్పటికీ మరువలేని అత్యద్భుత చిత్రంగా తొలిసారి రూపొందించింది లవకుశ చిత్ర నిర్మాత, ప్రత్యేకించి నెల్లూరీయులు... అల్లారెడ్డి శంకరరెడ్డి కావడం సింహపురి సీమకే గర్వకారణం. 60 ఏళ్ల క్రితం ఆయన పడిన కష్టం.. రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయస్థాయిలో నేటికీ చిరస్మరణీయంగానే ఉంది. ఆ చిత్రంతో పాటు, చిత్ర నిర్మాత నేపథ్యం కూడా ఏనాటికీ మరువలేనిదే! (Shankar reddy)
అల్లారెడ్డి శంకరరెడ్డి. ఈ పేరు నెల్లూరుజిల్లాలో సుప్రసిద్ధం. నెల్లూరు జిల్లా, కోవూరు ఫిర్కా నాయుడుపాళెం అనే చిన్నగ్రామంలో, 1916లో సాధారణ రైతు కుటుంబంలో శంకర్ రెడ్డి పుట్టారు. నెల్లూరు, మద్రాసు, కలకత్తా నగరాలలో ఎం.ఎ. బి.ఎల్ చదివారు. పారిశ్రామికవేత్తగా మారి నెల్లూరు సమీపంలో ముత్తుకూరు రోడ్లో నేషనల్ పిరమిడ్స్ అనే పింగాణి పరిశ్రమ స్థాపించారు. ఆ తర్వాత మైకా వ్యాపారం చేశారు. సంగీతం, సాహిత్యం పట్ల మొదట నుండి ఆయనకు మక్కువ ఎక్కువ. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటులు, సంగీతవేత్తలు బళ్లారి రాఘవ, ఋష్యేంద్రమణి, పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి, నేలనూతల రామ కృష్ణయ్య, ఘంటసాల రాధాకృష్ణయ్యలాంటి వారితో ఆయన సన్నిహితంగా ఉండేవారు. వారి స్నేహ సౌరభాలతో 1950న సినీరంగ ప్రవేశంచేసి మానవతి, చరణదాసి సినిమాలను తీశారు. 1959 ఫిబ్రవరి 5న ‘లవకుశను’ ప్రఖ్యాత దర్శకులు సి.పుల్లయ్య దర్శకత్వంలో ప్రారంభించారు. (Lava Kusa)
లవకుశ నిర్మాణం చేపట్టడానికి, అంతటి కావ్యాన్ని చిత్రమకుటంగా మలిచేందుకు ప్రధాన ప్రేరణ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. శంకరరెడ్డి చరణదాసి సినిమాలో, ఒక సన్నివేశానికి అనుగుణంగా 9C Pullసీతారాములుగా రామారావు అంజలి అతిథి పాత్రలో నటించారు. అతిథి పాత్రలు అయినప్పటికీ ఆ సినిమాలో ఆ చిన్న సన్నివేశం ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా మారింది. ఆ సినిమా విజయానికి అది కారణమైంది. ఇవన్నీ కాకుండా సీతారాములుగా వారిద్దరి జంట ముచ్చటగా ఉండి, శంకర్ రెడ్డి అభిమానాన్ని పొందింది. మనసును తాకింది. వారిలో నిజమైన సీతారాములను చూసిన శంకరరెడ్డి, విఖ్యాత నటులు ఎన్టీరామారావు, మహానటి అంజలితో ఎప్పటికైనా సినిమాను, అదికూడా పూర్తి నిడివి గల సినిమాగా రూపొందించాలని ఒక ఆలోచన వచ్చి అదే సంకల్పంగా మారిందని సినీ రంగంలో పలుమార్లు వారు చెప్పుకునేవారు. (Ntr), Anjali Devi)
చిత్రకీర్తి తెలుగు కీర్తిపతాకంగా నిలిచిన ‘లవకుశ’ నిర్మాణ సమయంలో ‘సీతరాముల్లా’గా వారు కష్టనష్టాలు అనుభవించారని చెప్పేవారు. తెలుగు తమిళ భాషల్లో తొలిసారిగా రంగుల చిత్రంగా లవకుశను నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణ ప్రారంభోత్సవానికి అక్కినేని, బి.ఎన్. రెడ్డి తదివతర సినీరంగ ప్రముఖులు హాజరైనారు. మొదట వేగవంతంగా నిర్మాణ పనులు జరిగాయి. ఆర్టిస్టుల డేట్స్ వలన రెండు భాషల్లో ఒకేసారి తీసేందుకు వీలు కాలేదు. మొదట ఈ సినిమా అనగానే చాలామంది మిత్రులు, సన్నిహితులు సినీ పరిశ్రమ వారు శంకరరెడ్డిని నిరాశపరిచారు. వెనకడుగు వేసేందుకు అత్యధికంగా కృషి చేశారు. నష్టపోతారు. అపకీర్తి వస్తుంది వంటి పదాలన్నీ కూడా శంకర్‌రెడ్డికి స్వాగతం పలికాయి. అయినప్పటికీ కూడా సంకల్పబలం అనేది వారిని ముందుకు నడిపించింది. అప్పటికే ‘శ్రీరామ పట్టాభిషేకం’ కథ మార్పులు చేర్పులతో మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు కూడా అపజయం పాలయ్యాయి. ఆ తర్వాత కాలంలో బి.ఎన్. రెడ్డి ఈ కథను సినిమాగా మార్చాలని స్క్రిప్టు కూడా సిద్ధం చేశారు. అయినప్పటికీ గత మూడు సినిమాల ఫలితాలు ఇవన్నీ కూడా ఆలోచింపచేశాయి, ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి, ముందుకు నడిపించలేకపోయాయి. దీనితో అర్ధాంతరంగా బి.యన్. రెడ్డి గారు ఆ సినిమా ఆలోచనను విరమించుకున్నారు. ఇలాంటి అనేక నేపథ్యాల నుంచి ఆత్మవిశ్వాసం, సంకల్పబలం వంటి బలమైన ఆయుధాలతో లవకుశ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారాయన.
సంకల్పం.. ఆత్మవిశ్వాసంతోనే ముందుకు.. (C. Pullayya)
1958 మార్చి 5న మద్రాసు విజయ వాహినీ స్టూడియోలో ప్రారంభిం చారు శంకరరెడ్డి. ప్రారంభం తర్వాత అత్యంత ఉత్సాహంగా వేగవంతంగా, నాణ్యతపరంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా వేగవంతంగా సినిమాను, షూటింగును నడిపించారు. ఆ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు వలన ఆగి పోయింది. పట్టుదలకు ప్రతీకగా ఉంటూ, ఇష్టపడి నిర్మించాలనుకున్న లవకుశ ఆగిపోవటం ఇష్టం లేక, నెల్లూరొచ్చి డబ్బు సమకూర్చుకొని తిరిగి ప్రారంభించారు. ఇందుకు మూడేళ్ల వ్యవధి పట్టింది. తిరిగి చిత్ర నిర్మాణం 1961లో ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది సమయానికి మరొక పెద్ద అవాంతరం ఎదురయింది. దర్శకులు పుల్లయ్య అనారోగ్యంపాలు కావడం. కూర్చుంటే లేవలేక పోవడం, లేస్తే కూర్చోలేకపోవటం లాంటి ఆరోగ్య సమస్యల వలన చిత్ర నిర్మాణం మళ్ళీ కుంటుబడింది. అప్పటికి కేవలం 8వేల అడుగుల షూటింగ్ మాత్రమే జరిగింది. వారి కుమారుడు సి.ఎస్. రావును దర్శకుడుగా నియమించుకొని ఆ కష్టాన్ని అధిగమించారు. సిఎస్ రావు మిగిలిన 12 వేల అడుగుల నిర్మాణం పూర్తిచేశారు. చిత్ర నిర్మాణం ఆలస్యం వలన కొద్దిమంది నటుల శరీర ఆకారాలలో మార్పులు రావటం, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోననే వేదనకు కూడా గురైనారు నిర్మాణకర్తలు. 1932 నుండి మూడు రామాయణ కథా చిత్రాలు విజయవంతం కాకపోవటం ఈ కథ ఎన్నుకోవటం కారణమని, ఇప్పటికైనా ఆ చిత్ర నిర్మాణం చేపట్టవద్దని మిత్రులు, శ్రేయోభిలాషులు తిరిగి వారించినా, పట్టుదల ఆత్మవిశ్వాసం తోనే శంకరరెడ్డి తన కృషిని (C. S. Rao) కొనసాగించారు. ఈ చిత్రం గేవా కలర్ కావటంతో లైటింగ్ ఎక్కువ అవసరమయ్యాయి. మేకప్‌లో మార్పులు తప్పని సరయ్యాయి. అందులో భాగంగా శక్తివంతమైన లైటింగ్‌ను వాడటం, ఆ వేడిని నటీనటులు తట్టుకోలేక పోవటంతో మళ్ళీ కొంత జాప్యం జరిగాయి. చివరలో భూమి విడిపోయి, సీతమ్మను భూదేవి తనతో భూమిలోకి తీసుకెళ్లే సన్నివేశాల్లో సాంకేతికంగా కొంత ఇబ్బందులు ఎదురైనా, జాప్యం జరిగినా సమస్యలన్నీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, అచంచల విశ్వాసంతో పూర్తి చేయగలిగారు శంకరరెడ్డి.
హాస్యనటుడు రమణారెడ్డికి అవకాశం :
శంకరరెడ్డి తన తొలి చిత్రం ‘మానవతి’లో మన నెల్లూరీయులు.. హాస్యనటులు రమణారెడ్డికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా నెల్లూరు నుడికారాన్ని తొలిసారిగా వారిచే చిత్రాలలో ప్రవేశ పెట్టారు. మరో నెల్లూరీ యుడు, విఖ్యాత రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డికి కూడా ‘సతీ సావిత్రి’ సినిమా ద్వారా అవకాశం ఇచ్చారు. ఎన్నో కష్టాలను, అవరోధాలను అధిగమించి 1963 మార్చి 29న లవకుశను విడుదల చేశారు. ఆ చిత్రం విడుదలై నేటికి ఆరు దశాబ్దాలు అవుతున్నా.. నేటికీ లవకుశ ఓ అద్భుతచిత్రంగా.. ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సంచలన విజయాలెన్నో సాధించింది. అనేక భాషల్లో కూడా తర్జుమా అయి విజయం సాధించి పంపిణీదారులకు ఆర్ధికబలం చేకూర్చింది. ‘లవకుశ’ చిత్ర నిర్మాతగా అల్లారెడ్డి శంకరరెడ్డికి ఆ చిత్రం అనంత కీర్తిని అందించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వద్ద నుంచి శంకరరెడ్డి బంగారు పతకం అందుకోవడం తెలుగు సినీరంగంలో మరో మరపురాని ఘట్టం. అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్, నెల్లూరీయులు బెజవాడ గోపాలరెడ్డి కూడా స్వయంగా ఒక సంచలన సినిమా నిర్మాతగా శంకర్‌రెడ్డిని ఆహ్వానించి సత్కరించడం కూడా అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో మరో గొప్ప విశేషం. లవకుశ ఎన్నో సంచలన విజయాలకు మారుపేరైనా శంకరరెడ్డి జీవితంలో మాత్రం ఏ సంబరం మిగల్చలేదంటారు. ఆర్ధికంగా ఆయన ఏమీ మిగుల్చుకోలేదని అంటుంటారు. అయినా, ఆయనే నాడూ ధనం కోసం వెంపర్లాడలేదు. ధనం మిగలకపోయినా అనంతమైన కీర్తిని, తరతరాల విఖ్యాతిని వారు సంపాదించుకున్నారు. అందుకే ఆయన నాటికీ, నేటికీ, ఏనాటికైనా.. అత్యద్భుతమైన ‘లవకుశ’ చిత్ర నిర్మాతగా.. శంకరరెడ్డి చిరస్మరణీయులే...