Manchu Manoj - Mounika: ప్రేమ.. పెళ్లి మనోజ్ ఏం చెప్పారంటే..!
ABN , First Publish Date - 2023-04-20T11:00:33+05:30 IST
మౌనిక భూమాతో (Mounika Bhuma) వివాహం తర్వాత తొలిసారి మనోజ్ (Manchu Manoj) ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వెన్నెల కిశోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో మనోజ్ - మౌనికల ప్రేమాయణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
మౌనిక భూమాతో (Mounika Bhuma) వివాహం తర్వాత తొలిసారి మనోజ్ (Manchu Manoj) ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వెన్నెల కిశోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో మనోజ్ - మౌనికల ప్రేమాయణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు పరిచయం, ప్రేమ, పెళ్లి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. (Manoj love story)
మనోజ్ మాట్లాడుతూ ‘‘15 ఏళ్లగా మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇరు కుటుంబాల్లో మంచీ చెడులకు హాజరయ్యేవాళ్లం. మొదట మా ఇద్దరి జీవితాలు వేరు. వేర్వేరు అడుగులు వేశాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అభిప్రాయాలను పంచుకున్నాం. అలా మా జర్నీ మొదలైంది. ఇప్పుడు అవన్నీ తలచుకుంటే సిగ్గేస్తుంది. మౌనికపై ఇష్టాన్ని మొదట నేనే బయటపెట్టాను. జీవితంలో నేను ఎదుర్కొన్నవే చాలా పెద్ద కష్టాలు అనుకునేవాణ్ని. కానీ మౌనిక కష్టాలు విని, చూశాక.. నాది చాలా చిన్న కష్టం అనిపించింది.
జీవితంలోకి వెలుగు వచ్చింది...
అప్పుడు ‘నువ్వంటే ఇష్టం.. ప్రాణం అని చెప్పా. మళ్లీ మళ్లీ సంతోషం.. ఆశ.. జీవితంలోకి వెలుగు వస్తుందంటే అది నీ వల్లే.. నాకు హ్యాపీగా బతకాలని ఉంది. నలుగురితో సంతోషంగా ఉండాలుంది. నువ్వు అంగీకరిస్తే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా’ అని చెప్పా. అప్పుడు మౌనిక ‘కరెక్ట్‌గానే ఆలోచించి చెప్పావా? ఇంట్లో ఒప్పుకొంటారా.. ఈ సొసైటీ గురించి ఆలోచించావా? చాలా రకాలు మాట్లాడతారు. వాటిని తట్టుకోగలవా అని అంది. ‘అవన్నీ నాకు అనవసరం. ఇంట్లో నేనొక మాట చెప్పానంటే కాదు అనరు. పైగా అది నా సమస్య. అలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటానన్నాను. అప్పుడు తను సరేనంది. శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది. తర్వాత ‘ఉప్పెన’ సినిమాలో ‘ఈశ్వర...’ పాటలా దేశాలు తిరిగాం. మా మధ్య చాలా కథలున్నాయి. చెబితే పెద్ద సిరీస్ అవుతుంది. కానీ మాటల్లో చెప్పినంత ఈజీగా ఏమీ మా జీవితాలుసాగలేదు. ‘ఎన్ని డోర్లు మూస్తారో మూయండి చూద్దాం’ అన్నట్లుగా స్టెప్ తీసుకున్నాం. ఇదిగో ఇప్పుడిలా ఒకటిగా ఉన్నాం. మా ఇద్దరిలో నేనే రొమాంటిక్. అందుకే మౌనిక కోసం నా భావాలన్ని పంచుకుంటూ అనంత శ్రీరామ్‌తో పాట రాయించుకుని ఇటీవల విడుదల చేశాను’’ అని అన్నారు.
అక్కే దగ్గరుండి చూసుకుంది...
ఈ మొత్తం ప్రయాణంలో మా అమ్మ ఎంతో ఇబ్బందిపడింది. నా వల్ల అమ్మా, అక్కా బాధపడుతున్నారని అనిపిస్తుండేది. ఫైనల్‌గా వాళ్లిద్దరే నాకు అండగా నిలిచారు. పెళ్లి బాధ్యత మొత్తం అక్కే దగ్గరుండి చూసుకుంది. జీవితాంతం వాళ్లిద్దర్నీ కష్టపెట్టకుండా సుఖంగా ఉండేలా చూసుకుంటా.