StudentsSuicide: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై 'మ్యూజిక్ స్కూల్' దర్శకుడు పాపారావు ఏమన్నారు అంటే
ABN , First Publish Date - 2023-05-13T16:28:56+05:30 IST
పాపారావు బియ్యాల, ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేసి సినిమా దర్శకత్వం వేపు దృష్టి సారించి ఒక సందేశాత్మక 'మ్యూజిక్ స్కూల్' అనే చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం లో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల గురించి దర్శకుడు ప్రతిస్పందించారు...
సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజమాబాద్ ప్రాంతాలకు చెందిన కొంతమంది విద్యార్థులు తక్కువ మార్కులు తెచ్చుకోవటంతో ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఈ ఘటనలపై 'మ్యూజిక్ స్కూల్' దర్శకుడు పాపారవు బియ్యాల స్పందించారు.
ఐఏఎస్ (IAS) ఆఫీసర్‌గా పని చేసిన పాపారావు బియ్యాల (PapaRao Biyyala) 'మ్యూజిక్ స్కూల్' (Music School) చిత్రంతో చిత్ర దర్శకుడిగా మారారు. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం అందించిన ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు అతనే ఈ సినిమా నిర్మించారు. పిల్లల్లో కళల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది, ఆలా కాకుండా వారి మీద విద్యాపరమైన ఒత్తిడిని పెంచేస్తున్నారు. ఇలా చెయ్యటం వలన వారిలోని ఎదుగుదలను ఆపేస్తున్నట్టు అవుతుంది. ఇదే విషయాన్ని 'మ్యూజిక్ స్కూల్' అనే మల్టీలింగ్వువల్ చిత్రం ద్వారా ఎంటర్‌టైనింగ్‌గా వివరించారు. డ్రామా టీచర్‌గా శర్మన్ జోషి (SharmanJoshi), మ్యూజిక్ టీచర్‌గా శ్రియా శరన్ (ShiryaSaran).. ఓ లొకేషన్‌లో తల్లిదండ్రులు, టీచర్స్ ద్వారా విద్యాపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంత మంది పిల్లలతో కలిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాటకాన్ని రూపొందించటానికి కష్టపడటమే మ్యూజిక్ స్కూల్ ప్రధాన కథాంశం.
తెలంగాణాలో జరిగిన ఘటనలపై దర్శకుడు పాపారావు మాట్లాడుతూ ‘‘చుట్టూ సమాజం కారణంగా వారు నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాల కారణంగా గొప్ప సామర్థ్యం ఉన్న కుర్రాడు తన ప్రాణాలను కోల్పోవటం మన దురదృష్టం. ఈ విషయాన్నే మా 'మ్యూజిక్ స్కూల్' చిత్రం ద్వారా తెలియజేశాం. విద్యార్థుల శ్రేయస్సు, అభివృద్ధి ముఖ్యమని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. హిందీలో పి.వి.ఆర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.