Paruchuri Review - Dasara: నాని కెరీర్‌కి గుర్తుండిపోయే సినిమా!

ABN , First Publish Date - 2023-05-21T17:05:17+05:30 IST

నాని - కీర్తి సురేశ్‌ జంటగా నటించిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

Paruchuri Review - Dasara: నాని కెరీర్‌కి గుర్తుండిపోయే సినిమా!

నాని (Nani)- కీర్తి సురేశ్‌ (Keethisuresh) జంటగా నటించిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా' (Dasara) శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నాని కెరీర్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు పరుచూరి గోపాలకృష్ణ.(paruchuri gopala krishna review) నాని నటన సినిమాకు హైలైట్‌ అని పేర్కొన్నారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఔరా అనిపించేలా ఉంది. నాని నటన, లుక్‌ ఆశ్చర్యానికి గురి చేసింది. మామూలుగా ఆయనను ఎక్కువగా లవర్‌ బాయ్‌గా క్యూట్‌ లుక్‌లో చూస్తాం. అలాంటి నానిని ఈ చిత్రంలో మాస్‌ లుక్‌లో, మద్యానికి బానిసైన యువకుడిగా చూశాం. తన పెర్ఫార్మెన్స్‌తో నభూతో నభవిష్యతి! అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. మిత్రుడిగా నటించిన దీక్షిత్‌శెట్టి కూడా నటనతో అదరగొట్టాడు. ఇది పూర్తిగా నాని - కీర్తిసురేశ్‌ల సినిమా. అంతర్లీనంగా రామాయణం - మహాభారత కథలు నడిచాయి, విలన్‌ ఒక రావణాసురుడు లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠాన్ని చూపించారు. సాయికుమార్‌ పాత్ర చిన్నదే అయినా చక్కగా ఉంది. క్లైమాక్స్‌లో అతడు చెప్పే డైలాగ్‌ విని.. ఇతడే విలనా అన్న అనుమానం కలిగింది.

క్ల్లైమాక్స్‌లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ కూడా హీరోకు సాయం చేయరు. కేవలం చూస్తూ నిల్చుంటారు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడిన పేద ప్రజలు ఎలా బతుకుతారు? అని చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తిని పొందిన వాళ్లు ఇలాంటి సీన్స్‌ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్‌ ఉంటాయి. సూరి పాత్రధారి దీక్షిత్‌ శెట్టి చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్‌)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. ఇదొక అద్భుతమైన షాట్‌. పాత రోజుల్లో దర్శకులు చేయలేని సాహసం ఇప్పుడున్న వాళ్లు చేస్తున్నారనడానికి నిదర్శనం ఆ షాట్‌.

విలన్‌ చనిపోయాక కూడా సినిమా మరికొంత సేపు రన్‌ అవుతుంది. ధరణి ప్రేమను వెన్నెల అంగీకరించిందా? అనే ఆసక్తిని అక్కడ దర్శకుడు క్రియేట్‌ చేశాడు. అలా చివరి షాట్స్‌లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకుడు మనస్ఫూర్తిగా థియేటర్‌ నుంచి బయటకు వచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు. నాని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది’’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-05-21T17:05:17+05:30 IST