Posani krishna murali: ఆ నందులు ఇవ్వాలా? కొత్తగా ప్రారంభించాలా అన్న మీమాంస..!
ABN , First Publish Date - 2023-04-07T15:45:24+05:30 IST
ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ది, నంది అవార్డుల గురించి సీఎం జగన్‌తో చర్చిండానికి ప్రణాళిక సిద్ధం చేశాం. గతంలో ప్రకటించిన నంది అవార్డుల ఇవ్వాలా లేదా?
‘‘ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ది, నంది అవార్డుల(Nandi Awards issue in Ap) గురించి సీఎం జగన్‌తో చర్చిండానికి ప్రణాళిక సిద్ధం చేశాం. గతంలో ప్రకటించిన నంది అవార్డుల ఇవ్వాలా లేదా? కొత్తగా మళ్లీ ప్రారంభించాలా అన్న మీమాంసలో ఉన్నాం. దీనిపై త్వరలో ఏ మంచి నిర్ణయం తీసుకుంటాం’’ అని ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి (APFDC) అన్నారు. ఏపీ ఫైబర్‌నెట్ వినియోగానికి సంబంధించి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోసాని కృష్ణ మురళి (Posani krishna murali) మాట్లాడారు. విడుదల రోజే సినిమా చూసే అవకాశాన్ని ఏఫీ ఫైబర్ నెట్ (AP Fiber net) కల్పిస్తోందని చెప్పారు. చిన్న చిత్రాలకు ఇదొక మంచి అవకాశమన్నారు. ఇదే వేదికపై ఆయన నంది పురస్కారాల గురించి ప్రస్తావించారు.
‘‘నంది అవార్డుల గురించి నేను పరిశ్రమలో భాయ్‌గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. అవార్డుల ప్రకటన వచ్చిన రోజు నుంచి ‘ఆ కాంపౌండ్‌కి రెండు, ఈ కాంపౌండ్‌కి మూడు, ఈ దర్శకుడికి మూడు ఇవ్వాలి’ అంటూ (Nandi awards) పంచుకునేవారు. అవార్డు లేకపోతే నేను ఫంక్షన్‌కి వెళ్లను అలుగుతా అన్నవారినీ చూశాం. నంది అవార్డుల విషయంలో జరిగిన అన్యాయాన్ని బయటపెడుతూ నేనే రెండు సార్లు పోరాటం చేశా. దానికి పర్యావసానంగా ‘పోసానికి నంది అవార్డు ఇవ్వకూడదని డిసైడ్ చేశారు. రచయితగా 100కు పైగా కథలు రాశా. అందులో అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలెన్నో ఉన్నాయి. కానీ నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. 2015లో నటించిన ‘టెంపర్’ చిత్రంలో నా పాత్రకు నంది ప్రకటించారు. అది మొక్కుబడిగా ఇచ్చిన అవార్డు. అది కులానికి సంబంధించిన అవార్డుల అనిపించింది. అందుకే ఆ నందిని తిరస్కరించా. ఇండస్ట్రీలో కాపు, కమ్మ కులాల డ్యామినేషన్ ఏమీ లేదు. ‘వీడు నావాడు.. వీడిని రక్షించుకుందాం’ అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. ఇక్కడ ఏదైనా డబ్బుతోనే మూడిపడి ఉంటుంది. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను మంచి చేస్తానో లేదో చెప్పలేను కానీ చెండాలం మాత్రం చేయను. భవిష్యత్తులో నంది అవార్డుల సంగతి ఏంటి? గతంలో ప్రకటించిన అవార్డులు ఇవ్వాలా లేక కొత్తగా మళ్లీ ప్రారంభించాలా అన్నది ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.
ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ ఇచ్చిన వరం లాంటిది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఫైబర్ నెట్ అనేది చిన్న నిర్మాతలకు ఆక్సిజన్ లాంటిది. ఇది అభివృద్ది చెందటానికి ఎంత టైం పడుతుందో తెలీదు కానీ.. సినిమాకు మాత్రం మంచి జరుగుతుంది’’ అని సి.కల్యాణ్ (C Kalyan) అన్నారు.