Sai pallavi fire : మంచి సమయంలో పనికి మాలిన విషయాల గురించి స్పందించడం బాధగా ఉంది!

ABN , First Publish Date - 2023-09-22T17:36:08+05:30 IST

లేడీ పవర్‌స్టార్‌ సాయిపల్లవి పెళ్లి అయిపోయింది.. తమిళ దర్శకుడితో ఏడడుగులు వేసింది... ఇదిగో దండలు మార్చుకున్న సాక్ష్యం అంటూ మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Sai pallavi fire : మంచి సమయంలో పనికి మాలిన విషయాల గురించి స్పందించడం బాధగా ఉంది!

లేడీ పవర్‌స్టార్‌ సాయిపల్లవి పెళ్లి అయిపోయింది..

తమిళ దర్శకుడితో ఏడడుగులు వేసింది...

ఇదిగో దండలు మార్చుకున్న సాక్ష్యం అంటూ

మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ తరుణంలో సాయిపల్లవి కూడా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. అయితే గతంలో ఇలాంటి రూమర్స్‌ వచ్చినా ఆమె స్పందించలేదు. ఈసారి కుటుంబ సభ్యులను కూడా ఇన్‌వాల్వ్‌ చేయడంతో కాస్త ఘాటుగా స్పందించారు. అసలు విషయం ఏంటంటే..

రెండు రోజుల క్రితం దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. సాయి పల్లవి పెళ్లి చేసుకున్నారంటే నెటిజన్లు వైరల్‌ చేశారు. ‘శివ కార్తికేయన్‌ 21’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో అది. అందులో దర్శకుడు, సాయి పల్లవి మెడలో దండలు వేసుకున్న ఫొటోలను చూసి ఆమె పెళ్లి చేసేసుకుందని రూమర్లు పుట్టించారు. ఆ ఫొటోలు చూసి సాయిపల్లవితో ‘విరాట పర్వం’ చిత్రంతీసిన దర్శకుడు వేణు ఉడుగుల క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంపై సాయిపల్లవి స్పందించారు.

Sai-palavai.jpg

‘‘మామూలుగా అయితే నేను రూమర్స్‌ను అసలు పట్టించుకోను. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను ఇందులో భాగం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను నటించిన ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంఽధించిన ఫొటోలను క్రాప్‌ చేసి, డబ్బు కోసం, నీచమైన ప్రచారాలు చేస్తున్నారు. నా కొత్త సినిమాలకు సంబంధించిన మంచి అప్‌డేట్స్‌ పంచుకునేందుకు సిద్థమవుతున్న సమయంలో ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి స్పందించడం నిజంగా బాధగా ఉంది. ఒక వ్యక్తికి ఇలా ఇబ్బంది కలిగించేలా చేయడం నిజంగా నీచమైన చర్యే’’ అంటూ సాయి పల్లవి మండిపడ్డారు. కొంతగ్యాప్‌ తర్వాత సాయి పల్లవి మళ్లీ తెలుగుతెరపై మెరవబోతోంది. నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో ఆమె కథానాయికగా సెలెక్ట్‌ అయింది. చందూ మొండేటి దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుంది.

Updated Date - 2023-09-22T17:36:08+05:30 IST