Saptagiri: 'బ్రదర్‌.. నువ్వు కమెడియన్‌వి కావు.. నువ్వో నటుడివి’ అన్నారు

ABN , First Publish Date - 2023-06-11T10:10:01+05:30 IST

సప్తగిరి.. భలే చమత్కారి. చిత్తూరు స్లాంగ్‌ ఎత్తుకొంటే థియేటర్‌ గొల్లుమంటుంది.‘ఇంతకీ మన పరిస్థితి ఏంట్సార్‌’ అని అమాయకంగా అడిగినా ‘మగజాతి ఆణిముత్యం’ అంటూ కాలర్‌ ఎగరేసినా ‘అక్కా... నన్నొదిలేయ్‌ అక్కా..’ అంటూ దెయ్యంతో బేరాలాడినా.. చక్కిలిగింతలు క్యూ కడతాయ్‌. యాక్షన్‌ సినిమా అయినా, లవ్‌ స్టోరీ అయినా.. హారర్‌ జోనర్‌ అయినా .. సప్తగిరి ఎంటర్‌ అయితే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్ ప్రెస్ లా పరుగు పెడుతుంది.

Saptagiri: 'బ్రదర్‌.. నువ్వు కమెడియన్‌వి కావు.. నువ్వో నటుడివి’ అన్నారు

సప్తగిరి(Saptagiri).. భలే చమత్కారి. చిత్తూరు స్లాంగ్‌ ఎత్తుకొంటే థియేటర్‌ గొల్లుమంటుంది.‘ఇంతకీ మన పరిస్థితి ఏంట్సార్‌’ అని అమాయకంగా అడిగినా ‘మగజాతి ఆణిముత్యం’ అంటూ కాలర్‌ ఎగరేసినా ‘అక్కా... నన్నొదిలేయ్‌ అక్కా..’ అంటూ దెయ్యంతో బేరాలాడినా.. చక్కిలిగింతలు క్యూ కడతాయ్‌. యాక్షన్‌ సినిమా అయినా, లవ్‌ స్టోరీ అయినా.. హారర్‌ జోనర్‌ అయినా .. సప్తగిరి ఎంటర్‌ అయితే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్ ప్రెస్ లా పరుగు పెడుతుంది. డిఫరెంట్‌ డైలాగ్‌ డెలివరీతో, సరి కొత్త బాడీ లాంగ్వేజ్‌తో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకొన్న సప్తగిరి ఈవారం ‘నవ్య’ అతిథి. ఆయనతో బాతాఖానీ ఇదీ! (Comedian.. Hero Saptagiri)

ఇరవై ఏళ్ల సినీ ప్రయాణం మీది.. ఇన్నేళ్లలో ఏం సాధించారు?

సినిమాల్లోకి వెళ్లి.. ఏదోటి సాధించాలి అనుకొన్నప్పుడు నా జేబులో ఉన్నది కేవలం రెండొందల యాభై రూపాయలు మాత్రమే. దాంతో పోలిస్తే ఇప్పటి నా బ్యాంకు బ్యాలెన్స్‌ ఎన్నో వందల రెట్లు. సహాయక దర్శకుడిగా ‘బొమ్మరిల్లు’ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రానికి పని చేశాను. నటుడిగా నవ్వించాను. హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లాంటి సినిమాలున్నాయి. అన్నింటికీ మించి... ఇంత పేరు, గుర్తింపు దక్కింది. ఇవన్నీ నేను చిత్రసీమకు వచ్చి సాధించుకొన్నవే కదా!

మధ్యలో హీరోగా అవతారం ఎత్తడం హాస్య నటుడిగా మీ కెరీర్‌కి ఇబ్బంది కలిగించిందా?

హాస్య నటుడిగా బిజీగా ఉన్నప్పుడు ‘తిరుడాన్‌ పోలీస్‌’ అనే సినిమా నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని ఎలాగైనా సరే, తెలుగులో చేయాలనిపించింది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథ అది. పైగా అందులో హీరో నాన్న ఓ కానిస్టేబుల్‌. మా నాన్న కూడా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో గార్డ్‌గా పని చేసినవారే. ఆయన్ని రోజూ యూనిఫామ్‌లో చూసీ చూసీ అలవాటైపోయింది. అందుకే ఆ సినిమా చేద్దామని రంగంలోకి దిగాను. నేను ఇంటర్‌లో నేర్చుకొన్న ‘దాన వీర శూర కర్ణ’ డైలాగ్‌ని ఈ సినిమాలో వాడాను. థియేటర్లో తప్పకుండా ఆ సీన్‌కి విజిల్స్‌ పడాతాయని ఊహించా. అదే జరిగింది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ కొన్న బయ్యర్లంతా హ్యాపీ. వాళ్లు బాగా డబ్బులు సంపాదించుకొన్నారు. ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బీ’ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. హీరో అయ్యాక.. ‘వీడికి మనం చిన్న చిన్న వేషాలిస్తే చేస్తాడా? లేదా?’ అనే అనుమానంతో చాలామంది నన్ను పిలవలేదు. ఆ సమయంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ.. జీవితం ఎత్తుపల్లాలు సహజం. నేనేం గొప్పింటి కుటుంబం నుంచి రాలేదు. మా నాన్న చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. దిగువ మధ్యతరగతి జీవితం. క్రికెట్‌, సినిమా.. ఈ రెండింటిపై ప్రేమతో చదువుని నిర్లక్ష్యం చేశాను. ‘నేను ఎంత బాగా ఆడినా, జాతీయ జట్టు వరకూ వెళ్లలేను’ అనే నిజం నేను గ్రహించేలోగా నా చదువు షెడ్డుకి వెళ్లిపోయింది. అప్పుడు నా ముందున్న ఒకే ఒక్క ఆప్షన్‌.. సినిమా. హైదరాబాద్‌ వెళ్తే.. ఏదో ఓ పని చేసుకొంటూ, నాలుగు డబ్బులు సంపాదించొచ్చు అనుకొని ఇటువైపు వచ్చా. కష్టాలంటే ఏమిటో తెలిసినవాడ్ని కాబట్టి.. ఇక్కడ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంది.

Untitled-1.jpg

సహాయ దర్శకుడిగా కెరీర్‌ మొదలెట్టి.. దర్శకత్వం వైపు అడుగులు వేయలేదెందుకు?

నా దృష్టి ముందు నుంచీ డైరెక్షన్‌ మీదే ఉండేది. కానీ సెట్లో నా చలకీదనం చూసిన వాళ్లంతా.. ‘నీలో మంచి నటుడున్నాడ్రా’ అంటుండేవాళ్లు. దిల్‌రాజు కాంపౌండ్‌లో పనిచేసే సహాయ దర్శకులు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాళ్లు. అదో సెంటిమెంట్‌గా మారుతూ వచ్చింది. నేను కూడా ‘బొమ్మరిల్లు’లో ఓ చిన్న పాత్ర వేశా. అది కాస్త పెద్ద హిట్‌ అయ్యే సరికి సెంటిమెంట్‌ కొద్దీ.. ‘పరుగు’లో ఓ మంచి వేషం ఇచ్చారు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌. ‘ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్‌..?’ అనే డైలాగ్‌ భలే పేలింది. నా పాత్రకూ మంచి గుర్తింపు వచ్చింది. ‘కందిరీగ’లో ఒకే ఒక్క సీన్‌లో కనిపించా. ఆ అవకాశం కూడా చాలా గమ్మత్తుగా వచ్చింది. ఆ సినిమాకి అనిల్‌ రావిపూడి రైటర్‌గా పని చేశారు. ‘ఈ సినిమాలో ఓ సీన్‌ ఉంది.. అది నువ్వు చేస్తేనే బాగుంటుంది’ అని చెప్పి, ఆ సీన్‌ మొత్తం తాను నటించి చూపించాడు. ఆ సీన్‌ గనుక నేను చేయకపోతే.. అనిల్‌ రావిపూడి చేసేస్తాడు. లక్కీగా నేను చేశాను. థియేటర్లో ఆ సీన్‌ బాగా పండింది. విజయోత్సవ యాత్రలకు టీమ్‌ మొత్తం వెళ్తున్నప్పుడు ‘ఈ టూర్‌కి సప్తరిగి వస్తున్నాడా’ అని హీరో రామ్‌ వాకబు చేశార్ట. ‘వాడు వస్తేనే.. నేను టూర్‌కి వస్తా. ఎందుకంటే ఈ సక్సె్‌సలో వాడికీ చోటుంది’ అన్నార్ట. ‘కందిరీగ’తో నాకు అంత మంచి పేరొచ్చింది. ఇక ‘ప్రేమ కథా చిత్రమ్‌’తో అయితే నా కెరీర్‌ టర్న్‌ అయిపోయింది. ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం రాలేదు.

బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ.. ఈ రెండింటిలో మీ బలం ఏమిటి?

రెండూనండీ. ఎలాంటి సంభాషణ అయినా సరే, నేను చిత్తూరు స్లాంగ్‌లో చెబితే - ఫక్కున నవ్వొస్తుంది. ఏ నటుడ్నీ అనుకరించని బాడీ లాంగ్వేజ్‌ నాది. ఇవి రెండూ నా ప్రత్యేకతలే. నిజానికి ‘నేను సినిమాల్లోకి వెళ్లి రాణించగలనా?’ అనే డౌటు నాక్కూడా వచ్చింది. అలాంటప్పుడు ‘దాన వీర శూర కర్ణ’లోని ‘ఏమంటివి.. ఏమంటివి’ అనే డైలాగ్‌ నాకో ఛాలెంజ్‌ విసిరింది. ఎంతటి నటుడికైనా అంత పెద్ద డైలాగ్‌ని, నాన్‌ స్టాప్‌గా చెప్పడం చాలా కష్టం. కానీ నేను ఆ డైలాగ్‌ని బట్టీపట్టి నాదైన స్టైల్‌లోకి మార్చుకొని, సింగిల్‌ టేక్‌లో గడ గడ చెప్పేసేవాడ్ని. అది అందరికీ నచ్చేసేది. నాలో ఓ నటుడున్నాడన్న సంగతి గుర్తించిందే ఈ డైలాగ్‌తో. ‘ఏమంటివీ..’ డైలాగే గడ గడ చెప్పేశానంటే ఇక ఎంత పెద్ద డైలాగ్‌ అయినా పలికేయొచ్చన్న ధీమా కలిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ డైలాగే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

స్పాట్‌ ఇంప్రువైజేషన్‌లు మీరు బాగా చేస్తారని అంటుంటారు. దాని వెనుక సీక్రెట్‌ ఏమిటి?

సెట్‌కి వెళ్లాక నా డైలాగ్‌ ఏమిటో చూసుకొంటా. ఆ తరవాత దర్శకుడితో డిస్కర్షన్‌ చేస్తా. ‘ఇందులో రాసింది రాసినట్టు చేస్తే చాలా.. ఇంకొంచెం బాగా రావడానికి నేనేమైనా ట్రై చేయనా’ అని అడుగుతా. చాలామంది నాకు ఫ్రీ హ్యాండ్‌ ఇస్తారు. ఇంకొంతమంది ‘రాసింది చేస్తే చాలు’ అన్నట్టు మాట్లాడతారు. స్వతహాగా సీన్‌ బాగుంటే మనం చేయడానికి కూడా ఏం ఉండదు. ఆనందంగా అందులోకి దూకేయడమే. నా వంతు నేనేమైనా చేయగలను, అది ఆ సీన్‌కి అవసరం అనుకొన్నప్పుడే ఇంప్రవైజేషన్లు చేస్తుంటా. అదృష్టం కొద్దీ అవి చాలా బాగా వర్కవుట్‌ అయ్యాయి.

థియేటర్లో అందర్నీ నవ్వించే మీరు.. బాధ పడిన సందర్భాలు ఉన్నాయా?

సంతోషం, బాధ.. రెండూ పక్క పక్కనే ఉంటాయి. లేనిదెవరి? నా గురించి రకరకాల వార్తలు కొన్ని వెబ్‌ సైట్లలో వస్తుంటాయి. అవి రాసిందెవరో, రాయిస్తుందెవరో నాకు తెలుసు. కానీ మౌనంగా ఉన్నాను. గీతలో కృష్ణుడు ఓ మాట చెప్పాడు. ‘నీ శత్రువుపై దండెత్తే శక్తి నీకు లేనప్పుడు నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకో.. నీ శుత్రువు సంగతి నేను చూసుకొంటా’ అన్నాడు. నేను దాన్ని బలంగా నమ్ముతా.

5.jpg


‘‘సునీల్‌ అన్న కెరీర్‌ నాకు ఆదర్శం. నటుడిగా తను మూడో ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాడు. హాస్య నటుడిగా చేశాడు, హీరోగా మారాడు, ఆ తరవాత మళ్లీ ఇప్పుడు విలన్‌ వేషాలేస్తున్నాడు. తమిళంలోనూ అదరగొడుతున్నాడు. నా కెరీర్‌నీ అలానే మార్చుకోవాలని ఉంది. ‘నాలో కమెడియన్‌ని చూడకండి.. నటుడ్ని చూడండి’ అని చెప్పాలని ఉంది. నన్ను నిరూపించుకొనే ఛాన్స్‌ వస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధమే. ఈమధ్య ‘సలార్‌’లో చేశా. సినిమా షూటింగ్‌ అంతా అయిపోయాక.. ప్రశాంత్‌ నీల్‌ నన్ను పిలిచి.. ‘బ్రదర్‌.. నువ్వు కమెడియన్‌వి కావు.. నువ్వో నటుడివి’ అన్నారు. ఆ మాట నాకెంతో ఆత్మ సంతృప్తిని కలిగించింది’’


‘‘నేను చాలా సాధుజీవిని. ఇరవై రెండేళ్ల క్రితం వెంకటేశ్వరుడి గర్భ గుడిలో ‘ఈ కట్టె కాలేంత వరకూ నాన్‌ వెజ్‌ ముట్టుకోను’ అని ఒట్టు వేసుకొన్నాను. అప్పటి నుంచి మాంసాహారం జోలికి వెళ్లలేదు. ఇకపై వెళ్లను కూడా. దానికీ ఓ బలమైన కారణం ఉంది. నా అసలు పేరు.. వెంకట ప్రభు ప్రసాద్‌. ఆ తరవాత సప్తగిరిగా మార్చుకొన్నా. వెంకన్న పేరు పెట్టుకొనే అర్హతా, స్థాయి నాకు కావాలనిపించింది. ప్రసాద్‌కీ, సప్తగిరికీ తేడా చూపించాలనుకొన్నాను. అందుకే నాన్‌వెజ్‌ మానేశా. యోగా మొదలెట్టా. ఈ రెండు అలవాట్లూ నా జీవన శైలిని బాగా మార్చాయి.’’

  • అన్వర్‌

Updated Date - 2023-06-11T10:10:01+05:30 IST