నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం, ‘సర్’ డాక్టరేట్ బిరుదు ప్రదానం
ABN , First Publish Date - 2023-11-25T16:44:16+05:30 IST
ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలో పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి. నరేష్ కు నైట్ హుడ్, అత్యున్నత బిరుదు 'సర్' ను ప్రదానం చేశారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ (ISCAHR), UNO ముఖ్యమైన విభాగం NATOతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్లోని ఆటం హాల్లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది.
ఈ సమావేశానికి NASDP సెక్రటరీ జనరల్ AMB జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఆరోగ్యమంత్రి, నేవీ, ఎయిర్ వింగ్ ,గ్రౌండ్ ఫోర్స్‌కు చెందిన 12 మంది మిలిటరీ జనరల్స్, అనేక మంది బ్రిగేడ్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్లు, దేశాల డిప్యూటీ మంత్రులు, దౌత్యవేత్తలు, థాయ్‌లాండ్, ఇతర దేశాల నుంచి ప్రతినిధులు, ఇండియా నుంచి డాక్టర్ నరేష్ విజయకృష్ణ సన్మానాలు స్వీకరించేందుకు హాజరయ్యారు.
పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి.
డాక్టర్ నరేష్ విజయకృష్ణకు నైట్ హుడ్, అత్యున్నత బిరుదు 'సర్' ను ప్రదానం చేశారు. మిలిటరీ ఆర్ట్స్, హ్యూమన్ సర్వీస్‌లో గౌరవ డాక్టరేట్, పిహెచ్‌డితో సత్కరించారు. ఆర్బిట్రేషన్ & శాంతి మధ్యవర్తిత్వానికి సహచరుడిగా గుర్తించారు. పౌర హక్కుల సంరక్షకుడు బిరుదుతో గౌరవించారు.
అంతర్జాతీయంగా పూర్తి దౌత్య నిరోధక శక్తితో NASDP ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్లో మిలిటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్, లెఫ్టినెంట్ కల్నల్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియన్ కమాండ్‌గా డాక్టర్ నరేష్ విజయకృష్ణ నియమించబడ్డాడు.
డాక్టర్ నరేష్ తన స్వాగత ప్రసంగంలో.. ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడం, అరికట్టడంలో మీడియాకు గొప్ప బాధ్యత వుందని చెప్పారు. ఈ కాంపెయిన్ ని ఒక సెలబ్రిటీ, దౌత్యవేత్తగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని జాతీయ క్యాడెట్ కార్ప్స్ (భారతదేశంలోని సాయుధ దళాల విద్యార్థి విభాగాలు), ఇతర దేశాలలో దేశం పట్ల బాధ్యత భావాన్ని తీసుకురావడానికి నియమించాలని అన్నారు.
దేశంలో ఇలాంటి గౌరవాలు, పోస్టింగ్‌లు అందుకున్న మొదటి నటుడు నరేష్. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ క్రిజ్, లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, యూనివర్శిటీ అధినేత డాక్టర్ సురేష్ అగర్వాల్, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ సమావేశానికి హాజరై కళారంగంలో అందించిన సేవలకుగాను మెడల్ అందుకున్నారు.