Prabhas: చిన్న సినిమాలకి రి-రిలీజుల దెబ్బ
ABN , First Publish Date - 2023-08-19T12:44:28+05:30 IST
పెద్ద సినిమాలు విడుదల కానీ సమయంలో థియేటర్స్ దొరుకుతాయని కొన్ని చిన్న సినిమాలు విడుదల చేసుకుంటే, మళ్ళీ ఈ రి-రిలీజుల పేరుతో అగ్ర నటుల సినిమాలు విడుదలవుతున్నాయి, ఇవి కూడా చిన్న సినిమాలకి థియేటర్స్ లేకుండా చెయ్యడమే కాకుండా, చిన్న సినిమాల రెవిన్యూ కూడా లాగేసుకుంటున్నాయి అని పరిశ్రమలో టాక్
ఈమధ్య అగ్ర నటులు పాత సినిమాలు ఆ నటుల పుట్టినరోజు నాడో, లేదా ఆ సినిమా ఇన్నేళ్లు పూర్తి చేసుకుందనే మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇలా విడుదలైన సినిమాలు డబ్బులు కూడా బాగానే చేసుకుంటున్నాయి కూడా, అయితే ఇలా విడుదలవడం మంచిదే కానీ, ఇవి ఇప్పుడు విడుదలవుతున్నప్పుడు థియేటర్స్ కూడా వేరే సినిమాలకి ఇవ్వటం లేదని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇలా అగ్ర నటుల పాత సినిమాలు మళ్ళీ విడుదల సమయంలో, అవి మెయిన్ థియేటర్స్ లో విడుదలవ్వటం, దాని వలన అదే సమయంలో చిన్న సినిమాల విడుదల ఉంటే, వాటికి సినిమా థియేటర్స్ ఇవ్వకుండా, ఈ అగ్ర నటుల మళ్ళీ విడుదలైన సినిమాలకి తీసుకుంటున్నారని, ఇలా చెయ్యడం వలన చిన్న సినిమా నష్టపోతోంది అని అంటున్నారు.
ఉదాహరణకి నిన్న విడుదలైన 'మిష్టర్ ప్రెగ్నంట్' #MrPregnant సినిమా చూస్తే కనక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే నిన్న ప్రభాస్ (Prabhas) పాత సినిమా 'యోగి' #Yogi విడుదలైంది, అలాగే ధనుష్ (Dhanush) నటించిన 'రఘువరన్ బిటెక్' #RaghuvaranBTech కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTCCrossRoads) దగ్గర థియేటర్స్ అన్నీ నిండిపోయాయి, మరి 'మిష్టర్ ప్రెగ్నంట్' సినిమాకి అక్కడ ఒకటి రెండు షోస్ మాత్రమే దొరికాయి అని అంటున్నారు.
మా సినిమా పోస్టర్ కూడా థియేటర్స్ దగ్గర పెట్టడం లేదు అని అంటున్నాడు 'మిష్టర్ ప్రెగ్నంట్' #MrPregnant లో కథానాయకుడిగా వేసిన సోహెల్ (Sohel). నిన్న సోహెల్ తన సినిమా ప్రచారాలు నిమిత్తం థియేటర్స్ కి వెళ్లి చేస్తున్నప్పుడు కొన్ని థియేటర్స్ లో పోస్టర్స్ కూడా పెట్టడం లేదు, ఎందుకంటే చిన్న సినిమా కదా, ఎందుకు పెట్టడం అని అనుకున్నారేమో అని అంటున్నాడు. "అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో చిన్న సినిమాలని కూడా ప్రోత్సహిస్తే ఎక్కువమంది సినిమాలు తీస్తారు, ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది, కొత్త టాలెంట్ కూడా పరిశ్రమలోకి వస్తుంది. చిన్న సినిమాలు థియేటర్స్ లో ఆడకుండా ఉంటే ఇక మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి," అని అంటున్నాడు సోహెల్.
తన సినిమా ప్రచారాల నిమిత్తము ఈరోజు నుండి థియేటర్స్, ముల్టీప్లెక్స్ కి వెళ్లి ప్రచారం చెయ్యాలని అనుకుంటున్నాను అని, కానీ మా సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర మా సినిమా పోస్టర్ కనిపించటం లేదని, ఎందుకు ఇలా అవుతోందో అర్థం కావటం లేదని అంటున్నాడు. అలాగే హైదరాబాద్ లో కాకుండా, మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా పోస్టర్స్ పెట్టడం లేదని అభిమానులు ఫోనులు చేసి చెపుతున్నారని, మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో పరిశ్రమలో వారికే తెలియాలని అంటున్నాడు.