Peddha Kapu-1: శ్రీకాంత్ అడ్డాల సినిమా టైటిల్ కి 'గుండమ్మకథ' లో ఎన్టీఆర్ డైలాగ్...
ABN , First Publish Date - 2023-09-11T15:21:04+05:30 IST
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తనదైన శైలిలో కథలను ఎన్నుకొని సినిమాలుగా మలుస్తూ వస్తూ వున్నాడు. ఇప్పుడు 'పెదకాపు 1' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ వెనక చాలా పెద్ద కథే వుంది..
మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) ఒకరు. చేసినవి కొన్ని సినిమాలు అయినా, ఆ సినిమాల ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. తనకి రచనలో చాలా పట్టు ఉండటం, దానికితోడు నిజ సంఘటనలు ఆధారంగా, అలాగే అతని కథలు కూడా మన చుట్టుపక్కల జరిగేటట్టుగా ఉంటూ వస్తూ ఉంటాయి, కాబట్టి, అతను తన సినిమాల ద్వారా తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు తాజాగా 'పెదకాపు-1' #PeddhaKapu1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది.
అయితే ఈ సినిమా టైటిల్ పెట్టడానికి అతను ఒక వూర్లో చూసిన నేమ్ బోర్డు ఒక స్ఫూర్తి అంటున్నాడు. అక్కడ ఒక వ్యక్తి పేరు ముందు 'పెదకాపు' అని రాయటం అతనికి వెంటనే ఆ పదం నచ్చడం, అదే విషయం నిర్మాతకి చెప్పి టైటిల్ ఖరారు చెయ్యడం జరిగింది అని చెప్పాడు. పెదకాపు అంటే వూర్లో అన్నిటినీ చూసుకునే ఒక పెద్దాయనని పెదకాపు అని అంటారని అది ఒక కులానికి సంబంధించింది కాదని, ఆ పేరుకి పెట్టినదాన్ని బట్టి అర్థం అయిందని, అందుకే ఈ సినిమాకి కూడా ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పాడు.
అయితే శ్రీకాంత్ అడ్డాలకి ఇంకో స్ఫూర్తి ఏంటో తెలుసా, అదే 'గుండమ్మకథ' #GundammaKatha సినిమాలోని ఎన్టీఆర్ (NTR) డైలాగ్ ఒకటుంది. రమణారెడ్డి (RamanaReddy), ఎన్టీఆర్ ని సూర్యకాంతం (Suryakantham) దగ్గరకికి తీసుకువచ్చినప్పుడు మీది ఏ కులం అని సూర్యకాంతం, ఎన్టీఆర్ ని అడిగితే, అదే ప్రశ్న ఎన్టీఆర్ సూర్యకాంతంని అడుగుతారు. అప్పుడు సూర్యకాంతం మేము కాపులం అని చెపుతుంది, వెంటనే ఎన్టీఆర్ అయితే మేము 'పెదకాపులం' అంటారు. ఆ డైలాగ్ కూడా శ్రీకాంత్ అడ్డాలకి స్ఫూర్తి అని చెప్పాడు.
ఈ సినిమా మిర్యాల రవీందర్ రెడ్డి (MiryalaRavinderReddy) నిర్మాతగా, అతని బావమరిది విరాట్ కర్ణ కథానాయకుడిగా నిర్మించారు. ప్రగతి ఇందులో కథానాయికగా నటిస్తోంది, కాగా రావు రమేష్ (RaoRamesh), అనసూయ (Anasuya) ఒక ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు.