SS Rajamouli: ఇప్పుడు సినిమా.. అప్పట్లో ఏంటి?

ABN , First Publish Date - 2023-07-02T10:16:28+05:30 IST

‘‘మహేంద్ర సింగ్‌ ధోనికి నేను పెద్ద అభిమానిని. అతని సారథ్యంలో భరత్‌ జట్టు టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు సాధించినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ధోనీ ఎలాంటి ప్రాంతం నుంచి వచ్చాడు.. ఎలా ఎదిగాడు? ప్రస్తుత క్రికెటర్లకు అతడు ఒక రోల్‌ మోడల్‌గా ఎలా మారాడో అందరికీ తెలిసిందే! అలాంటి ధోనీలు మన జట్టులోకి మరింత మంది రావాలనేది నా కోరిక’’ అని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు.

SS Rajamouli: ఇప్పుడు సినిమా.. అప్పట్లో ఏంటి?

‘‘మహేంద్ర సింగ్‌ ధోనికి (MS Dhoni) నేను పెద్ద అభిమానిని. అతని సారథ్యంలో భరత్‌ జట్టు టీ20, వన్డే వరల్డ్‌కప్‌లు సాధించినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ధోనీ ఎలాంటి ప్రాంతం నుంచి వచ్చాడు.. ఎలా ఎదిగాడు? ప్రస్తుత క్రికెటర్లకు అతడు ఒక రోల్‌ మోడల్‌గా ఎలా మారాడో అందరికీ తెలిసిందే! అలాంటి ధోనీలు మన జట్టులోకి మరింత మంది రావాలనేది నా కోరిక’’ అని దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన ‘ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్‌’ (ఐఎస్‌బీసీ) (Rajamouli as ISBC Chairman) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. క్రికెట్‌ అంటే ఆయనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కొవ్వూరులో ఉంటున్నప్పుడు రోజూ క్రికెట్‌ ఆడేవాణ్ణి. అన్నయ్యలు, మిత్రులతో కలిసి మాది ఒక టీమ్‌ ఉండేది. టీమ్‌ మొత్తానికి ఒకటే బ్యాట్‌. అది కూడా ఇప్పుడు ఉపయోగించే బ్రాండెడ్‌ బ్యాట్‌ లాంటిది కాదు. చెక్కతో చేయించినది. దాంతో చాలా జాగ్రత్తగా ఆడేవాళ్లం. ఎందుకంటే ఉన్న ఆ ఒక్క బ్యాట్‌ విరిగిపోతే, మళ్లీ ఇంకోటి సంపాదించడం అప్పట్లో చాలా కష్టం. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఆడే బంతులతో కాకుండా కార్క్‌బాల్‌తో ఆడేవాళ్లం. అది చాలా గట్టిగా ఉండేది. అయితే, ఆ బాల్‌ మొత్తం పగుళ్లు వచ్చి, పెచ్చులు ఊడే వరకు దాంతోనే బౌలింగ్‌ చేసేవాళ్లం. ఇలా బాల్యంలో మొదలైన నా క్రికెట్‌ ప్రయాణం కళాశాల వరకు సాగింది. ఏలూరు సి.ఆర్‌రెడ్డి కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజీ టీమ్‌ తరఫున చాలా మ్యాచ్‌ల్లో ఆడాను. మా టీమ్‌లో నేను అందరికంటే బాగా ఆడేవాణ్ణి. మా టీమ్‌తో పోలిేస్త కొవ్వూరులోని మా జట్టు ఆటగాళ్లు ఇంకా బాగే ఆడేవారు. అయితే వాళ్లు ఏలూరు వచ్చి ఆడే పరిస్థితి అప్పుడు లేదు. అలానే మా కళాశాల టీమ్‌లో కూడా చాలా ప్రతిభావంతులు ఉన్నారు. అయితే, వారు హైదరాబాద్‌ వచ్చి క్రమం తప్పకుండా క్రికెట్‌ ఆడే ఆస్కారం చాలా తక్కువ ఉండేది. టాలెంట్‌ ఉన్నా సదుపాయాలు లేమివల్ల నాకు తెలిసినవారే చాలామంది క్రికెటర్లు కాలేకపోయారు.

1.jpg

ఐఎస్‌బీసీ సీఈఓ సునీల్‌బాబు నా దగ్గరకు వచ్చి రూరల్‌ క్రికెట్‌ టూ వరల్డ్‌కప్‌ కాన్సెప్ట్‌ చెప్పగానే నాకు నచ్చేసింది. ప్రతిభ ఉన్నా సరైన సదుపాయాలు, దిశా నిర్దేశం చేేసవారు లేక, లీగ్‌ల్లో ఆడించే వ్యవస్థ వేదిక లేకపోవడంతో ఎందరో గ్రామీణ క్రికెటర్లు వెలుగులోకి రాకుండానే వారి కెరీర్‌ ముగిసిపోయింది. ఇకపై అలాంటి వారికి ఐఎఎస్‌బీసీ ఒక చక్కటి వేదిక కానుంది. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులను తమ క్రికెట్‌ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఐఎస్‌బీసీ అవకాశం కల్పిస్తోంది. ఇందుకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-02T10:43:34+05:30 IST