Thammareddy Bharadwaja Fire : దేనికి పోటీ పడుతున్నారు.. ఎందుకు కొట్టుకుంటున్నారు?
ABN , First Publish Date - 2023-07-30T11:43:33+05:30 IST
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్న వేళ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హడావిడి చూస్తుంటే సంతోషించాలో ఏడవాలో తెలియట్లేదని అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (Film Chamber elections) జరుగుతున్న వేళ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హడావిడి చూస్తుంటే సంతోషించాలో ఏడవాలో తెలియట్లేదని అన్నారు. ‘‘నేను ఛాంబర్లో 15 ఏళ్లు పనిచేశా. మా నాన్న కూడా పని చేశారు. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎలక్షన్లు చూశాను. ప్రెసిడెంట్గా గెలిచాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని ఇంతకుమునుపు ఎప్పుడూ చూడలేదు. బయట, లోపల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలా, లేక జనరల్ ఎలక్షన్లను తలపిస్తున్నాయని సిగ్గుపడాలా? అన్నది తెలియడం లేదు. ఛాంబర్ అనేది అన్ని సెక్టార్ల వారికి మంచి చేయడానికి ఉంది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఎన్నికల విషయంలో దేనికి పోటీ పడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికల క్యాంపెయిన్ చూస్తుంటే భయమేస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే! నిర్మాతలు సి.కల్యాణ్(C Kalyan), దిల్ రాజు (Dil raju)ప్యానళ్లు పోటీ పడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు వీరిద్దరు ఎన్నికల బరిలో దిగారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.