Baby: ఒకప్పుడు చిరు అభిమాని, ఈరోజు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు, ఇంతకీ అతనెవరంటే...
ABN , First Publish Date - 2023-07-24T14:07:17+05:30 IST
'బేబీ' సినిమా నిర్మాత SKN ఈరోజు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా వున్నాడు. ఆ సినిమా కథని, నటీనటుల్ని సాంకేంతిక నిపుణలను నమ్మి సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో కూడా తనదైన స్టయిల్ లో SKN విజయం సాధించాడు. ఈరోజు సినిమా రూ. 60 కోట్లకి పైగా వసూలు చేసిందంటే దాంట్లో SKN కష్టం చాలా వుంది. అందుకే ప్రతి దగ్గరా అతని పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఎవరీ SKN, ఎక్కడ నుండి వచ్చాడు, అతని గురించి తెలుసుకోవాలంటే ఇది కచ్చితంగా చదవాల్సిందే !
ఈరోజు 'బేబీ' #BabyMovie అనే ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండీ ఈరోజు వరకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఈ చిన్న సినిమా. ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), విరాజ్ అశ్విన్ (VirajAswin), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) ఇందులో లీడ్ యాక్టర్స్ గా నటించగా, సాయి రాజేష్ (SaiRajesh) దీనికి దర్శకుడు. నటీనటుల నటనా ప్రతిభతో పాటు, విజయ్ బుల్గానిన్ (VijayBulganin) సంగీతం, బాలరెడ్డి (Balareddy) ఛాయాగ్రహణం ఈ సినిమాకి అత్యంత ఆకర్షణగా నిలిచాయి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ సినిమాని అభిరుచి తో నిర్మించిన ఎస్ కె ఎన్ (SKN) ఈ సినిమాకి ఒక వెన్నుముక లాంటివాడు. అతనే డబ్బులు పెట్టింది ఈ సినిమాకి, ఎందుకంటే సాయి రాజేష్ కథని నమ్మి, ఈ నటీనటులందరినీ నమ్మి ఈ సినిమాలో నటింపచేసి, మూడేళ్ళ పాటు ఈ సినిమా మీద అందరికి కష్టం తెలియకుండా, తాను కష్టపడుతూ ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చిన నిర్మాత ఎస్ కె ఎన్ (SKN) అని అందరిచేత పిలవబడే శ్రీనివాస్.
శ్రీనివాస్ ప్రయాణం కూడా ఒక సినిమా కథలాగే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏలూరులో పుట్టి పెరిగాడు, అక్కడే డిగ్రీ కూడా పూర్తి చేసాడు. అయితే మిగతావాళ్ళకి ఇతనికీ తేడా ఏంటంటే, శ్రీనివాస్ కి సినిమా అంటే పిచ్చి, అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) అంటే ఇంకా పిచ్చి. అప్పట్లో అంటే ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వచ్చిన అన్ని వార్తలను సేకరించి ఇంటర్నెట్ లో పెట్టేవాడు. అది అప్పుడు 2001 సంవత్సరం. "చిరంజీవి గారి గురించి ఎటువంటి సమాచారం అయినా, వ్యక్తిగతం, సినిమాలు రెండిటిని సేకరించి ఇంటర్నెట్ లో ఒక ఫ్యాన్ పేజీ తయారుచేసి పెట్టాను. బహుశా అప్పట్లో ఇలా ఒక స్టార్ గురించి మొత్తం సమాచారం సేకరించి ఆ స్టార్ కోసం ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ పేజీ తయారుచెయ్యడం అనేది అదే మొదటిసారేమో అని నేను అనుకుంటాను," అని చెపుతూ ఉంటాడు శ్రీనివాస్.
ఆలా మెగాస్టార్ గురించిన సమాచారం పెడుతూ ఉండటంతో మెల్లగా చిరంజీవి అభిమానులు ఇతన్ని కాంటాక్ట్ చెయ్యడం మొదలెట్టేవారు. ఆలా శ్రీనివాస్ గురించి అందరికీ మౌత్ టాక్ అంటారు చూడండి ఆలా స్ప్రెడ్ అయింది. అయితే శ్రీనివాస్ కి ఎటువంటి సెలబ్రిటీ అంతవరకు తెలియదంటే నమ్ముతారా ! అప్పట్లో కుమార్ అనే ఒక ఎన్ఆర్ఐ, అతను కూడా మెగా ఫ్యాన్, శ్రీనివాస్ చేస్తున్న పని చూసి అతనికి ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ కొనిచ్చాడు. ఇక శ్రీనివాస్ పని ఇంకా సులువైంది, ఇంటి దగ్గర నుండే ఎక్కువ చేసేవాడు. ఆ ఎన్ఆర్ఐ కంప్యూటర్ తో పాటు అల్లు అర్జున్ (AlluArjun) తమ్ముడు శిరీష్ (AlluSirish) ఇమెయిల్ ఐడి కూడా ఇచ్చి అతన్ని కాంటాక్ట్ చెయ్యమన్నాడు.
అప్పట్లో పెద్ద స్టార్ సినిమాలు తెల్లవారుజామున మూడుగంటలకే థియేటర్ లో షోస్ స్టార్ట్ చేసేవారు. శ్రీనివాస్ ఆ సినిమా రివ్యూస్ కూడా పెట్టడం మొదలెట్టాడు. ఆలాగే ఆ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఇమెయిల్ తో అల్లు శిరీష్ ని కాంటాక్ట్ చేసి అతనితో శ్రీనివాస్ మంచి స్నేహితుడు అయిపోయాడు. ఇంద్ర (IndraHundredDaysFunction) నూరు రోజుల ఫంక్షన్ అప్పుడు శిరీష్ తన అన్నయ్య అల్లు అర్జున్ ని శ్రీనివాస్ కి పరిచయం చేసాడు. ఆలా అల్లు అర్జున్ పరిచయం అవ్వటం, అతనేమో శ్రీనివాస్ ని హైదరాబాద్ వచ్చేయమనటం, శ్రీనివాస్ ఏలూరు నుండి హైదరాబాద్ పయనం అవటం అంతా అలా జరిగిపోయింది. హైదరాబాద్ వచ్చాక శ్రీనివాస్ అల్లు అర్జున్ కి మేనేజర్ గా చేసాడు, అలాగే పీఆర్వో గా కూడా చాలా సినిమాలకు పని చేసాడు.
అల్లు అర్జున్ పరిచయం తరువాత, అతని దగ్గర చేరాక, ఎస్.కె.ఎన్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ లాంటి పెద్ద స్టార్స్ అందరి దగ్గర పని చేసే అవకాశం లభించింది. అయితే అతను ఎందరి దగ్గర పని చేసినా అల్లు అర్జున్ మాత్రం అతనికి ఒక కెరీర్ ని ఇచ్చారు. అల్లు అర్జున్ ని విడిచిపెట్టకుండా అతనితో ఉంటూ మిగతా వాళ్ళకి పనిచేశాడు ఎస్.కె.ఎన్. అందుకే ఈరోజు ఎస్.కె.ఎన్ ఎటువంటి సినిమా చేసినా, ఆ సినిమా ప్రచారాలకు ప్రత్యక్షంగా వస్తూ, ఒకవేళ అలా కానీ పక్షంలో వెనకాల నిలబడి వెన్ను తడుతూ ఎస్.కె.ఎన్ ని ముందుకు నడిపిస్తున్న ఫోర్స్ ఎవరంటే అది అల్లు అర్జున్ అని మాత్రమే అని అంటాడు ఎస్.కె.ఎన్.
హైదరాబాద్ నుండి శ్రీనివాస్ ప్రస్థానం చాలా మారింది. మొదట్లో శ్రీనివాస్ ఒక ఛానల్ లో రిపోర్టర్ గా జాయిన్ అవటం, తరువాత సినిమా తీయాలన్న తలంపుతో దర్శకుడు మారుతీ తో కలిసి మొదటగా 'ఈరోజుల్లో' అనే ఒక చిన్న సినిమా తీసాడు. అది విజయం సాధించింది. ఆ తరువాత 'బస్టాప్' అనే ఇంకో సినిమా ఇలా చిన్న సినిమాలు తీసాడు శ్రీనివాస్. తరువాత మారుతీ చేసిన కొన్ని సినిమాలకి కోప్రొడ్యూసర్ గా కూడా శ్రీనివాస్ వ్యవహరించాడు.
"నేను ఒక్కడినే నిర్మాతగా ఏదైనా సినిమా చెయ్యాలన్న ఆలోచన నాకు మొదటి నుండీ వుంది. అప్పుడే దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ (RahulSankrityan) 'టాక్సీవాలా' #Taxiwala సినిమా కథతో రావటం జరిగింది. నేను 'పెళ్లి చూపులు' #PelliChoopulu సినిమా విడుదలకి ముందే విజయ దేవరకొండ (VIjayDeverakonda) ని కలిసి అతనితో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నాను. ఈ 'టాక్సీ వాలా' కథ అతనికి వినిపించగానే అతను చేస్తాను అన్నాడు. అలా నేను సోలో నిర్మాతగా విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా' అనే హిట్ సినిమా తో మొదలెట్టాను" అని చెప్పుకొచ్చాడు శ్రీనివాస్.
ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరుకోండతో (AnandDeverakonda) ఈ 'బేబీ' అన్న సినిమా తీసాడు శ్రీనివాస్ లేదా ఎస్ కె ఎన్ (SKN). ఇద్దరన్నదమ్ములతో ఇలా సినిమాలు తీసి హిట్ కొట్టిన నిర్మాత బహుశా శ్రీనివాస్ ఒక్కడే అయి ఉంటాడు. ఇప్పుడు పరిశ్రమలో ఎస్.కె.ఎన్ (SKN) పేరు మారుమోగుతోంది. ఎందుకంటే ఇంత చిన్న సినిమా అయినా 'బేబీ' ని తీయటమే కాకుండా, ఆ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్ లో ప్రచారాలు చెయ్యడంలో ఎస్.కె.ఎన్ తన సత్తా ఏంటో చూపించాడు. ఈరోజు 9 రోజులకు గాని ఆ సినిమా సుమారు రూ. 60 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేసింది అంటే అందులో నిర్మాత ఎస్.కె.ఎన్ పడిన కష్టం, అతని హార్డ్ వర్క్ చాలా ఉందనే చెప్పాలి.
శ్రీనివాస్ తో పెద్ద పెద్ద నటులు కూడా ఇప్పుడు సినిమాలు చెయ్యడానికి ఉత్సాహంగా వున్నారు అని పరిశ్రమలో పెద్ద టాక్. అలాగే శ్రీనివాస్ కూడా సందీప్ రాజ్ అనే నటుడితో ఇంకో సినిమా ప్లాన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం 'బేబీ' ప్రచారాల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పలు నగరాల్లో తిరుగుతూ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు శ్రీనివాస్ లేదా ఎస్.కె.ఎన్.
మెగాస్టార్ కి అభిమాని గా, తరువాత రివ్యూస్ ఎప్పటికప్పుడు రాసే రివ్యూయర్ గా, తరువాత హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ అంతటి స్టార్ దగ్గర మేనేజర్ గా చేసి, పీఆర్వోగా కూడా చేసి, ఇప్పుడు నిర్మాతగా మారిన శ్రీనివాస్ ప్రయాణం కూడా ఒక సినిమా కథ లాగే చాలా ఆసక్తికరంగా ఎన్ని మలుపులు తిరిగిందో కదా ! అభిమానులు అంటే ఎదో ఆవారాగా తిరుగుతూ ఏదేదో చేస్తారు అనుకునేవాళ్ళందరికీ, శ్రీనివాస్ కథ చాలా స్ఫూర్తిగా కూడా వుంది కదా ! ఒక మెగా అభిమాని ఎలా నిర్మాత అయి, అదే మెగా స్టార్ తో అభినందనలు అందుకోవటం అంటే మాటలా! 'టాక్సీ వాలా' విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఆ టీముతో పాటు ఆ సినిమా తీసిన ఎస్.కె.ఎన్ ని కూడా ఎంతో అభినందించారు.
ఇది కూడా చదవండి:
Baby film review: ముగ్గురి మధ్యలో నడిచే ప్రేమాయణం ఎలా ఉందంటే...