NandiAwards: చివరిసారిగా ఇచ్చింది 2016లో, అప్పుడే ఎన్టీఆర్ అవార్డు ఎవరికిచ్చారో తెలుసా...
ABN , First Publish Date - 2023-05-01T13:48:32+05:30 IST
ఇప్పుడు మళ్ళీ నంది అవార్డుల ప్రస్తావన లేవదీశారు. అసలు ఇప్పటి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అవార్డులు ఇచ్చే ఆసక్తి లేదని చెప్పారు నిర్మాతలు. చివరిసారిగా ఎప్పుడు ఇచ్చారో తెలుసా, అప్పుడు రజినీకాంత్ కూడా ఒక ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు తెలుసా...
కృష్ణ నిర్మించి, (Super Star Krishna) నటించిన సినిమా 'మోసగాళ్లకు మోసగాడు' Mosagallaku Mosagadu) అప్పట్లో ఒక సంచలనం. అది అప్పట్లోనే పాన్ వరల్డ్ సినిమా, ఎందుకంటే ఆ సినిమాని చాలా భాషల్లోకి తర్జుమా చేశారు, ఇంగ్లీష్, రష్యన్ భాషల్లోకి కూడా. మొదటి కౌబాయ్ సినిమా కూడా అదే. అటువంటి సినిమా మళ్ళీ ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరణ అంశాల గురించి నిర్మాతలు మాట్లాడేరు. అందులో నంది అవార్డు గురించి కూడా వుంది.
భారతీయ సినిమా కోసం కృష్ణ చేసిన సేవ ప్రశంసనీయం, అలంటి నటుడు, నిర్మాత, దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి తగిన అర్హత కలవాడు, మరి దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా అని ఒక విలేకరి అడిగాడు. దానికి కృష్ణ తమ్ముడు, నిర్మాత ఆదిశేషగిరి రావు (Adiseshagiri Rao) సమాధానం ఇస్తూ, కృష్ణ ఎప్పుడూ అవార్డుల పట్ల ఆసక్తి చూపేవాడు కాదని, ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే తీసుకునే వాడు, అంతే తప్ప తను ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలేదని చెప్పాడు. అలాగే ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు కూడా ప్రయత్నం చెయ్యనని, ఎవరైనా చేస్తే సంతోషం అని కూడా అన్నాడు.
అదే క్రమంలో నంది అవార్డులు గురించి మాట్లాడుతూ, "ఇప్పటి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా వున్నవాళ్లకే ఇస్తున్నారు ఈ అవార్డులు, అయినా ఇంతకు ముందు ప్రభుత్వ అవార్డు అంటే వేల్యూ ఉండేది, ఇప్పుడు ఆ వేల్యూ పోయింది," అని చెప్పాడు ఆదిశేషగిరి రావు. ఇంకా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులు #NandiAwards అప్రస్తుతం అయిపోయాయి అని అలాగే ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అవార్డులు ఇచ్చే ఆసక్తి లేదు అని చెప్పాడు ఆదిశేషగిరి రావు. పరిశ్రమ తనకి తానుగా వెళుతుంది తప్ప, ఎవరిని అడగదు అని చెప్పాడు.
నంది అవార్డులు చివరిసారిగా 2016లో చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం వున్నప్పుడు అనౌన్స్ చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఉత్తమ నటుడు, 'జనతా గ్యారేజ్', 'నాన్నకు ప్రేమతో' సినిమాలలోని నటనకి ఇచ్చారు. ఉత్తమ నటిగా రీతూ వర్మ 'పెళ్లిచూపులు' సినిమాలో చేసిన నటనకు ఎన్నికయింది. ఉత్తమ చిత్రంగా 'పెళ్లిచూపులు' ఎంపికయింది. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఎన్టీఆర్ జాతీయ అవార్డును (NTRNationalAward) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కి ఇచ్చారు. ఇప్పుడు అదే రజనీకాంత్ వార్తల్లో వున్నాడు. విజయవాడ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయి తనకి ఎన్టీఆర్ కి వున్న అనుబంధాన్ని చెప్పాడు. దానికి వైసీపీ వాళ్ళు రజనీకాంత్ ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, ఇది అందరూ కండిస్తున్నారు.