Mega Star: చిరంజీవి గురించి అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళ చెంప పగులకొట్టినట్టయింది
ABN , First Publish Date - 2023-08-14T13:10:42+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి మీద సాంఘీక మాధ్యమాల్లో ఏవేవో రూమర్స్ వస్తున్నాయి, అదే రూమర్స్ పట్టుకొని వార్తలుగా రాసేవాళ్ళు కూడా వున్నారు. అలాంటి వాళ్లందరికీ 'బేబీ' సినిమా దర్శకుడు సాయి రాజేష్ చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చాడు
ఏదైనా ఒక సినిమా బాగా ఆడటం లేదు అంటే చాలు, ఆ సినిమా గురించి అందులో నటించిన వారి గురించి లేనిపోనివి అన్నీ ఏవేవో రాసేస్తూ వుంటారు. అందులోకి ఇప్పుడు ఈ సాంఘీక మాధ్యమం ఎక్కువయినకొద్దీ ఇలాంటి నెగటివ్ వార్తలు ఎక్కువయ్యాయి. అందులో ఎంత నిజం వుంది అని ఆలోచించకుండా ఏవేవో రాసేస్తూ వుంటారు. ఆ నటుడు ఎలాంటి వాడు, అతని స్థాయి ఎటువంటిది అని కూడా పట్టించుకోకుండా ఏవేవో రాసేస్తూ వుంటారు.
మూడు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar సినిమా విడుదలైంది. మెహెర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడటం లేదు, అలాగే విమర్శకుల నుండి కూడా ఈ సినిమాకి అంతగా స్పందన రాలేదు. ఈ సినిమా మెగా అభిమానులు ఆశించినంతగా లేకపోవటంతో దీని మీద సాంఘీక మాధ్యమంలో మొదలెట్టేసారు పిచ్చి రాతలు రాయడం. సినిమా బాగోలేకపోతే ఆ సినిమా గురించి ఎంతైనా రాసుకోవచ్చు, చెప్పొచ్చు కానీ అందులో నటించిన నటీనటుల గురించి వ్యక్తిగత దూషణలకు దిగడం మాత్రం మంచిది కాదు అని పరిశ్రమలో చాలామంది అభిప్రాయ పడుతున్నారు.
అలాంటి వ్యక్తిగత దూషణే ఒకటి సాంఘీక మాధ్యమంలో ఇప్పుడు తిరుగుతోంది. ఇందులో నటించిన మెగాస్టార్ చిరంజీవి, తన పారితోషికం సినిమా విడుదలకి ముందు ముక్కు పిండి వసూల్ చేసారని, నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) అందుకోసం తనకి ఎక్కడెక్కడో వున్న ల్యాండ్ తనకా పెట్టి, చిరంజీవికి పారితోషికం ఇచ్చాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. మళ్ళీ ఇవి వార్తలు కింద కూడా రాసేస్తూ వుంటారు కొంతమంది తమ మీడియా వెబ్ సైట్స్ లో.
అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. చిత్ర పరిశ్రమలో ఏ నిర్మాత, ఏ నటుడుతో సినిమా చేసినా, చెయ్యబోయినా, ఆ నటుడి స్థాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర అతని సామర్ధ్యం ఇవన్నీ చూసుకునే ఆ నటుడితో సినిమా చేస్తాడు కదా. ఆ నటుడి పారితోషికం కూడా ముందుగానే మాట్లాడుకుంటారు కదా! అలాగే ఆ నటుడితో సినిమా చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది అన్నది ముందుగానే నిర్మాతకి అవగాహన ఉంటుంది కదా ! ఇవన్నీ తెలిసే కదా ఆ నటుడుని ఆ నిర్మాత సంప్రదించి అతనితో సినిమా తీయడానికి ఉద్యుక్తుడు అవుతాడు. అంటే ఆ నిర్మాత ముందుగానే ఆ సినిమాకి సరిపడా డబ్బుని తన దగ్గర, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచో తెచ్చుకొని పెట్టుకుంటాడు కదా. ఇందులో నిర్మాతకి నష్టం ఏముంది, అతను అన్నీ తెలుసుకొని ముందడగు వేస్తాడు, ఒకవేళ నిర్మాత దగ్గర డబ్బులు లేవు అంటే అందులో నటిస్తున్న ఆ నటుడి తప్పు ఎలా అవుతుంది.
ఇన్నీ తెలిసి, కావాలనే ఇప్పుడు 'భోళాశంకర్' సినిమా సరిగ్గా పోవడం లేదని చిరంజీవి మీద ఏవేవో అబాండాలు వేస్తున్నారు. చిరంజీవి అంటే ఏంటో అతనితో సన్నిహితంగా ఉన్నవాళ్ళకి తెలుస్తుంది, అతన్ని దగ్గర నుండి చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, అలాగే అతన్ని అభిమానించే వాళ్ళకి తెలుస్తుంది. అంతే కానీ ఇంటి దగ్గరో, లేదా ఇంకో దగ్గరో కూర్చొని, ఫ్రీ గా ఇంటర్నెట్ దొరికింది, మొబైల్ చేతిలో వుంది కదా అని ఏది పడితే అది రాసేవాళ్ళకి ఏమి తెలుస్తుంది. చిరంజీవి చేస్తున్న సామాజిక సేవ అందరికీ తెలుసు, ఎందుకంటే అవన్నీ పబ్లిక్ గా చేస్తున్నవి. కానీ ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పరిశ్రమ నుండి చిరంజీవి వలన సహాయం పొందుతున్న కొన్ని వందలమందిని అడిగితే తెలుస్తుంది, చిరంజీవి ఎటువంటి వ్యక్తో, ఎంతటి మహోన్నత శిఖరాగ్రం మీద నిలబడి వున్నారో?
హిట్, ఫ్లాప్ లు చిరంజీవి కి కొత్త కాదు. తన కెరీర్ లో ఇలాంటివి ఎన్నో చూసారు అయన. అసలు పారితోషికం ఎంత అని అడగకుండా, కేవలం ఇంతకు ముందు తనతో తీసినందుకు, మీరు సినిమా చెయ్యాలి అని చెప్పగానే పలానా రోజు నుండి షూటింగ్ పెట్టుకో అని చెప్పిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ఇలాంటి నిజాలు చెప్పడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ (ThammareddyBharadwaj) లాంటి నిర్మాత, దర్శకులని అడగండి చెప్తారు. తమ్మారెడ్డి చాలా ఓపెన్ గా ఎన్నోసారి చెప్పారు కదా, 'మొగుడు కావాలి' సినిమాకి అసలు కథ కూడా అడగలేదు, పారితోషికం అడగలేదు అని. ఎందుకంటే అంతకు ముందు అదే చిరంజీవి తో 'కోతలరాయుడు' అనే సినిమా తమ్మారెడ్డి చేశారు. ఆ సినిమా చేసినప్పుడు ఏర్పడ్డ చనువుతో తదుపరి సినిమాకి కనీసం పారితోషికం పెంచాలి, కానీ ఏమీ అడగకుండానే చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో వున్నాయి చిరంజీవి కెరీర్ లో.
పరిశ్రమలో చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకుపోయే చిరంజీవి తన దగ్గరికి ఎవరు వచ్చినా లేదు అనకుండా వొట్టి చేతులతో పంపించే సంఘటన ఒక్కటైనా ఉందా? తన అభిమానులకి, పరిశ్రమలో వారికి, అలాగే పరిశ్రమలో వున్న ఫిలిం రిపోర్టర్స్ కి ఇలా ఒకరేమిటి ఎవరికీ ఎటువంటి సహాయం కావాలన్నా అందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ వుండే చిరంజీవి నిర్మాత దగ్గర మరీ అంతలా డబ్బులు కోసం ప్రవర్తిస్తారా? అందుకే ఇలాంటి అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళదారి చంప పగలకొట్టేలా 'బేబీ' #Baby దర్శకుడు సాయి రాజేష్ (SaiRajesh) చాలా క్లియర్ గా మెసేజ్ పెట్టాడు చిరంజీవి గురించి. ఇకనైనా చిరంజీవి మీద ఆరోపణలు ఆపండి, సినిమా బాగోలేకపోతే, బాగోలేదు అని చెప్పండి, అంతే కానీ అందులో నటించిన చిరంజీవి మీద ఇష్టం వచ్చిన రీతిలో మీకు తోచిన విధంగా ఏది పడితే అది రాయకండి అని పరిశ్రమలో అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.