Alia Bhatt: ఆలియా హీరోలు.. ఎవరు ఎలాంటి వారంటే..

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:53 AM

పాత్ర ఏదైనా... అందులోకి అవలీలగా పరకాయప్రవేశం చేస్తుంది అలియాభట్‌. తాజాగా ‘జిగ్రా’తో యాక్షన్‌లోకి దిగింది. అయితే ఆమె ఇప్పటిదాకా పనిచేసిన సహనటుల గురించి ఏం చెబుతోందంటే...

పాత్ర ఏదైనా... అందులోకి అవలీలగా పరకాయప్రవేశం చేస్తుంది అలియాభట్‌ (Alia bhatt). వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాలీవుడ్‌ చిచ్చరపిడుగు తాజాగా ‘జిగ్రా’తో యాక్షన్‌లోకి దిగింది. అయితే ఆమె ఇప్పటిదాకా పనిచేసిన సహనటుల గురించి ఏం చెబుతోందంటే...

Ntr.jpg

తారక్‌ పెట్టిన పేరే... (Jr NTr)

ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్లో చరణ్‌, తారక్‌ ఇద్దరూ ఉన్నారంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. కాకపోతే నేనొకదాన్ని పక్కనున్నాననే విషయం మర్చిపోయి మరీ ఇద్దరూ తెలుగులో ఏదో మాట్లాడుకుంటూ, నవ్వుకునేవారు. డైలాగ్స్‌ పలకడంలో నేను తడబడితే వెంటనే తారక్‌ సరిచేసేవాడు. నిజానికి నా కూతురుకి ‘రాహ’ అనే పేరును సూచించిందే తనే. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌ వెళ్లినప్పుడు తారక్‌ నన్ను, రణబీర్‌ని డిన్నర్‌కి ఇంటికి ఆహ్వానించాడు. ఆ సమయంలో నేను తొమ్మిది నెలల గర్భిణిని. సాయంత్రం అందరం టెర్రస్‌పై కూర్చున్నాం. ‘నాకు పాప పుడితే ఏ పేరు పెట్టాలి? బాబు అయితే ఏం పెట్టాలి?’ అని సరదాగా చర్చించుకున్నాం. ‘పాప పుడితే రాహ అనే పేరు పెడితే బాగుంటుంద’ని ఎన్టీఆర్‌ సూచించారు. అదే పేరు మా పాపకు పెట్టాం.

Ram-charan.jpg

చరణ్‌ బలం అదే... (Ram charan)

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో అడుగుపెట్టిన కొత్తలో చరణ్‌ అస్సలు మాట్లాడేవాడు కాదు. తర్వాత మెల్లమెల్లగా మాటలు కలపడం మొదలెట్టాడు. అలా కొద్దికాలానికే ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయాం. అప్పటి నుంచి షూటింగ్‌ సమయంలోనూ, ప్రమోషన్స్‌ సమయంలోనూ చరణ్‌ నన్ను చాలా కేరింగ్‌గా చూసుకునేవాడు. ఆయన లాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితుడుగా దొరకడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. ఏదైనా సన్నివేశం చేయడానికి ముందే అన్ని విషయాలను నిశితంగా గమనిస్తూ, నిబద్ధతతో పూర్తి చేసేవాడు. ఇతరుల పనుల్లో అస్సలు జోక్యం చేసుకోడు. అదే చరణ్‌ బలం.

Sidd.jpg

తన కళ్లల్లో మ్యాజిక్‌ ఉంది... (Siddharth malhotra)

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో నేను, సిద్ధార్థ్‌మల్హోత్రా ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. ఆ సినిమా పట్టాలెక్కడానికి ముందు వరుణ్‌ ధావన్‌ (varun Dhavan) , సిద్ధార్థ్‌, కరణ్‌ జోహర్‌, నేను స్టోరీ గురించి చర్చించుకోవడానికి కలిశాం. అయితే నన్ను హీరోయిన్‌గా తీసుకోవద్దని వాళ్లిద్దరూ కరణ్‌కు సందేశాలు పంపారట. నేను చూడటానికి చిన్న పిల్లలా ఉన్నానని వద్దన్నారట. వాళ్ల మాటలు పక్కనపెట్టి మరీ కరణ్‌ నన్ను ఎంపికచేశారు. సిద్‌ విషయానికొస్తే ఎప్పుడూ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే మనస్తత్వం తనది. ఇక తన కళ్లలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉందనిపిస్తుంది. అందుకే సిద్‌కి అంతమంది లేడీ ఫ్యాన్స్‌ ఉంటారు. నిజానికి అతడు మంచి గాయకుడు. నాకు పెట్స్‌ అంటే ఇష్టమని తెలుసుకుని ఓరోజు పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. ఆ క్షణం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.

Shah.jpg

ఎగిరి గంతేశా.. (Shah Rukh Khan)

షారుక్‌కి నేను వీరాభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది షారుక్‌ సరసన నటించే అవకాశం రాగానే ఎగిరి గెంతేశా. సెట్‌లో (డియర్‌ జిందగీ) అడుగుపెట్టిన మొదటి రోజు షారుక్‌ను నేరుగా చూసి ‘ఇది కలా, నిజమా?’ అని కొద్దిసేపు షాక్‌లో ఉండిపోయా. ఇద్దరం కలిసి ఒక రోజు ముందే డైలాగ్స్‌ అన్నీ రిహార్సల్‌ చేసేవాళ్లం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఆయనే సరైన ఉదాహరణ. ఇప్పటిదాకా నేను పనిచేసిన వాళ్లలో బెస్ట్‌ కో యాక్టర్‌ అంటే షారుకే.

Updated Date - Oct 20 , 2024 | 09:05 AM