Film Celebrities: బతుకుదెరువు కోసం ఏమేం చేశారంటే!
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:44 PM
ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదిగారు కొందరు తారలు. వెండితెర మీద విభిన్న పాత్రల్లో అలరించిన వీరంతా... అంతకుముందు బతకుదెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలే చేశారు.
ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదిగారు కొందరు తారలు. వెండితెర మీద విభిన్న పాత్రల్లో అలరించిన వీరంతా... అంతకుముందు బతకుదెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలే చేశారు. ఇంతకీ స్టార్స్ కాకముందు ఎలాంటి ఉద్యోగాలు చేశారో వారి మాటల్లోనే...
క్యాషియర్‌గా...
డిగ్రీ అవ్వగానే ఇంటి ఆర్థిక భారాన్ని మోసే బాధ్యతను నా భుజాలపై వేసుకున్నా. అందుకే కాలేజీ పూర్తయి వారం రోజులు కూడా తిరగకముందే ఒక నిర్మాణరంగ సంస్థలో అకౌంట్ అసిస్టెంట్‌గా చేరాను. ఆపై బట్టల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా కొంతకాలం పనిచేశాను. ఇక్కడిస్తున్న దానికి నాలుగింతలు రెట్టింపు జీతమిస్తామని దుబాయి నుంచి ఆఫర్ రాగానే వెంటనే అక్కడ వాలిపోయా. అకౌంటెంట్‌గా రెండేళ్లపాటు పనిచేశాను. 2003లో తిరిగి ఇండియాకు వచ్చి స్నేహితులతో కలసి ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ ప్రారంభించా. అనుకున్న స్థాయిలో లభాలు రాకపోయేసరికి, మార్కెటింగ్ కంపెనీలో కొన్ని నెలలు పనిచేశా.
విజయ్ సేతుపతి
జర్నలిస్ట్‌గా...
ఒకప్పుడు నేను జర్నలిస్ట్‌గా పనిచేశానని చాలామందికి తెలీదు. మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందిన వెంటనే శ్రీలంకలోని ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌గా కొంతకాలం పనిచేశా. తాజా వార్తల కోసం.. మైకు పట్టుకొని, ఉదయం నుంచే అన్వేషణ ప్రారంభించేదాన్ని. ప్రతీరోజూ ఛాలెంజింగ్‌గా ఉండేది. ఒక డిటెక్టివ్‌లా ఫీలవుతూ లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసేదాన్ని. నాణానికి రెండు వైపులా ఆలోచించే ధోరణి అప్పటి నుంచే అలవర్చుకోవడం మొదలెట్టా. నిజానికి ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. ఏదైనా సినిమాలో జర్నలిస్ట్‌గా నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోను.
- జాక్వెలిన్ ఫెర్నాండెజ్
వెయిటర్‌గా...
నా మొదటి సంపాదన పదిహేనేళ్ల వయసులోనే ప్రారంభమైంది. అప్పట్లో రెండు వందల రూపాయల జీతానికి ఒక ట్రావెల్ ఏజెన్సీతో కలిసి పనిచేసేవాడిని. ఆ తర్వాత ఢాకాలోని ఒక హోటల్‌లో చెఫ్ కమ్ వెయిటర్‌గా కొంతకాలం పనిచేశా. ఆపై బ్యాంకాక్ వెళ్లి ఐదేళ్లపాటు థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నా. తిరిగి ఇండియాకు వచ్చి పొట్టకూటి కోసం ఆభరణాలను విక్రయించేవాడిని. ఢిల్లీలో కొన్న ఆభరణాలను ముంబాయి తీసుకెళ్లి అమ్మేవాడిని. ఆపై మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా. అలాగే లైట్‌మ్యాన్, స్టంట్‌మ్యాన్‌గా కూడా కొంతకాలం పనిచేశా.
- అక్షయ్ కుమార్
టీచరమ్మగా...
సినిమాల్లోకి రాకముందు మా అమ్మ నిర్వహిస్తున్న ప్రీస్కూల్‌లో నర్సరీ టీచర్‌గా పనిచేశాను. పిల్లలకు అక్షరాలు, అంకెలు, రైమ్స్ నేర్పించడం దగ్గర నుంచి డైపర్స్ మార్చడం దాకా... అన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. పొద్దున్న ఏడు గంటలకే స్కూలుకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. వాళ్లతో ఎంతసేపు గడిపినా సమయమే తెలిసేది కాదు. ఒక్కోసారి నేనూ చిన్నపిల్లలా మారిపోయి వాళ్లతో కలసి బాగా అల్లరి చేసేదాన్ని. అందుకే గుడ్‌న్యూస్, కబీర్‌సింగ్ సినిమాల్లో గర్భిణీగా నటించడం అంత కష్టంగా అనిపించలేదు.
- కియారా అద్వానీ
రేడియో జాకీగా...
నేను చిన్నప్పటి నుంచి చలాకీగానే ఉండేవాణ్ని. డిగ్రీ పూర్తయిన వెంటనే ‘బిగ్ ఎఫ్‌ఎమ్’లో రేడియో జాకీగా అవకాశం వచ్చింది. నా స్టైల్‌లో శ్రోతలను ఉర్రూతలూగించేవాడ్ని. కొద్ది కాలానికే మంచి గుర్తింపు లభించడంతో పాటు, వీడియో జాకీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆపై ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోతో టెలివిజన్ యాంకరింగ్ మొదలెట్టి... ఆపై ‘మ్యూజిక్ కా మహా ముఖాబ్లా’, ‘జస్ట్ డ్యాన్స్’ షోలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యా. ఆ తర్వాత సూపర్‌హిట్ సీరియల్ ‘ఖయామత్’లో సపోర్టింగ్ రోల్ చేశా. ‘ఏక్ థీ రాజకుమారి’లో మెయిన్ విలన్‌గా నటించా.
- ఆయుష్మాన్ ఖురానా