Yami Gautam: తల్లి కాబోతున్న ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్యూటీ.. టాలీవుడ్‌కు పరిచయమే
ABN , Publish Date - Feb 08 , 2024 | 07:15 PM
తెలుగు, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ శుభవార్త చెప్పింది.
తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే తెలుగు సినిమా కన్నడ రీమేక్ ‘ఉల్లాస ఉత్సాహ’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ యామీ గౌతమ్ (Yami Gautam Dhar). ఆ తర్వాత తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా’, నితిన్‌తో ‘కొరియర్ బాయ్ కల్యాణ్’, అల్లు శిరీష్‌తో ‘గౌరవం’, తరుణ్‌తో ‘యుద్దం’ వంటి సినిమాలలో నటించి ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలోనే అక్కడ హృతిక్‌రోషన్ వంటి స్టార్‌తో ‘కాబిల్’ అనే భారీ సినిమాలో నటించి పెద్ద హీరోయిన్గా పేరు సంపాదించింది. అదే జోరులో బాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. ‘విక్కీ డోనర్, యాక్షన్ జాక్షన్, బదలాపూర్, బూత్ పోలీస్, దస్వీ, ఓ మైగాడ్ 2’ వంటి సినిమాల్లోనూ నటించింది.
ఈ క్రమంలోనే 2019లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూరి (ది సర్జికల్ స్ట్రైక్ ) సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు అదిత్య ధార్ (Aditya Dhar)ను ప్రేమించి రెండేళ్లు డేటింగ్ చేసి 2021లో వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించుకున్న యామీ గౌతమ్ (Yami Gautam Dhar) తాజాగా తన భర్త నిర్మించిన ఆర్టికల్ 370 (Article 370) అనే హిందీ సినిమాలో ప్రియమణితో కలిసి ప్రధాన పాత్రలో నటిస్తుండగా చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు (గురువారం) ముంబైలో విడుదల చేశారు.
ఈ క్రమంలో యామీ గౌతమ్ (Yami Gautam Dhar), భర్త ఆదిత్య (Aditya Dhar) తో కలిసి తన అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలో తల్లిని కాబోతున్నానని, మేలో బిడ్డకు జన్మనివబోతున్నట్లు తెలిపి సర్ఫ్రైజ్ చేసింది. దీంతో బాలీవుడ్ మీడియా ఈ వార్తను బాగా వైరల్ చేయడంతో సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అయితే ఈ ముద్దుగుమ్మకు సినిమాలతో వచ్చిన గుర్తింపును మించి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో వచ్చిన గుర్తింపే ఎక్కువ. దీంతో ఇప్పటికీ చాలామంది యామీ గౌతమ్‌ను ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్యూటీ అంటూ పిలుస్తుంటారు. అదీగాక ఫెయిర్ అండ్ లవ్లీకి ఎక్కువ కాలం అంబాసిడర్‌గా ఉన్న ఏకైక నటి కూడా యామీనే కావడం గమనార్హం.