Kriti Sanon: శృంగార సన్నివేశం తగ్గించండన్న సెన్సారు బోర్డు
ABN , Publish Date - Feb 08 , 2024 | 02:59 PM
షాహిద్ కపూర్, కృతి సనన్ మొదటిసారిగా జంటగా నటిస్తున్న 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' హిందీ సినిమా రేపు శుక్రవారం విడుదల కానుంది. దీనికన్నా ముందు ఈ చిత్రం సెన్సారు సర్టిఫికెట్ కోసం పంపినప్పుడు సెన్సారు బోర్డు ఈ సినిమాలో కొన్ని అభ్యంతరాలు తెలిపింది
షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా హిందీ సినిమా 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' (Teri Baaton Mein Aisa Uljha Jiya) ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 9న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో ఇదే పెద్ద హిందీ సినిమా విడుదలవడం ఆసక్తికరం. దీనికి అమిత్జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం అని అంటున్నారు. ఇందులో సీనియర్ నటి డింపుల్ కపాడియా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలు ఈమధ్యనే పూర్తి చేసుకుంది.
అయితే సెన్సారు బోర్డు ఈ సినిమా దర్శక నిర్మాతలకి షాక్ లాంటి వార్త చెప్పింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ మధ్య నడిచే ఒక శృంగార సన్నివేశాన్ని తగ్గించమని చెప్పింది అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సన్నివేశం నిడివి 36 సెకండ్లు పాటు ఉంటే 9 సెకండ్స్ కట్ చేసి 27 సెకండ్లకి సెన్సారు బోర్డు కుదించింది అని వార్త. అలాగే ఇంకో సన్నివేశంలో 'దారు' అనే పదానికి బదులు 'డ్రింక్' అనే పదం పెట్టమని సెన్సారు బోర్డు సూచించిందని చెపుతున్నారు.
ఇక షాహిద్ కపూర్, కృతి సనన్ మొదటి సారిగా ఈ సినిమాలో జంటగా నటించారు. అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఇద్దరూ వెండితెర మీద నిజ జంటగా కనపడుతున్నారని, అలాగే వీరిద్దరి మధ్య కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని, ఈ ఇద్దరూ అవి బాగా చేసారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో కృతి సనన్ ఒక రోబోగా నటించగా, ఆమె ప్రియుడుగా షాహిద్ కపూర్ నటించారు. ఈ ఇద్దరి మధ్య నడిచే ప్రేమ కథే ఈ 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు బాగా వైరల్ అయ్యాయి. రేపు శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.