Kangana Ranaut: దేశ విధిని మార్చిన క్షణాలు మీ ముందుకు..

ABN , Publish Date - Nov 18 , 2024 | 02:03 PM

భారతదేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు మీ ముందుకు రానున్నాయి’’ అంటూ కంగనా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు


కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ (Emergency)’. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాకు విముక్తి కలిగింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుందని కొత్త పోస్టర్‌ విడుదల చేసిన తెలిపారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. చిత్రీకరణ పూర్తై ఏడాది కావొస్తుంది. కంగనా ఎన్నికల బిజీతో ఉండడంతో ఓసారి, సన్నివేశాల అభ్యంతరాలతో మరోసారి, సెన్సార్‌ విషయం ఇలా పలు కారణాలతో ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ చిత్రంలో తమని తక్కువ చేసి చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్‌ న్యాయస్థానాన్ని సంప్రదించింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. అలాగే సెన్సార్‌ బోర్డు సూచనలకు నిర్మాణసంస్థ కూడా అంగీకరించడంతో దీని సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలకు క్లియరెన్స్‌ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రం రిలీజ్‌ కానున్నట్లు తాజాగా కంగనా తెలిపారు. భారతదేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు మీ ముందుకు రానున్నాయి’’ అంటూ కంగనా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రం తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక  పాత్రలు పోషించారు. 

Updated Date - Nov 18 , 2024 | 02:04 PM