Kushboo: మహిళ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు

ABN , Publish Date - Sep 17 , 2024 | 07:35 PM

మహిళ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించవద్దు. ఒంటరిగా ప్రయాణిస్తుందని ఆమెను ఒంటరి దానిగా చూడొద్దు


ఇటీవల జస్టిస్‌ హేమ కమిటీ (Hema committee Report) నివేదికపై స్పందించిన  నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (kushboo)చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరోసారి స్పందించారు. అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. బాధిత మహిళలకు అండగా నిలవాలని పురుషులను కోరిన ఆమె ఎనిమిదేళ్ల వయసులో.. కన్న తండ్రే తనను లైంగికంగా వేధించారని వాపోయారు. తర్వాత, ఆయనకు ఎదురు తిరిగానన్నారు. ఈ మేరకు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘మహిళ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించవద్దు. ఒంటరిగా ప్రయాణిస్తుందని ఆమెను ఒంటరి దానిగా చూడొద్దు. స్త్రీ శక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తిరిగి మిమ్మల్ని కొట్టే వరకూ ఆమె బలం గురించి మీకు తెలియదు. మహిళలను వేదించే వారు, అసభ్యకరంగా మాట్లాడేవారు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. చేసిన తప్పులకు చింతిస్తారు. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలన్నా వణుకుతారు’’ అని అన్నారు. దయచేసి మహిళలు ఎవరూ ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడవద్దని, తాము అండగా ఉంటామని మహిళలకు భరోసా ఇచ్చారు. విమెన్‌పవర్‌ అని హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు.
 

Updated Date - Sep 17 , 2024 | 07:35 PM