Manoj Bajpayee : ఆ జోన్ నుంచి బయటకు రావాలి.. మొండిగా పోవాలి..
ABN , Publish Date - Dec 09 , 2024 | 10:10 AM
బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు.. ఈరోజు చిత్ర పరిశ్రమలో గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నమ్ముతారా? నా లక్ష్యాలను నెరవేర్చడానికి ఆదాయం లేని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను.
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ (Manoj Bajpayi) వైవధ్యమైన పాత్రలతో అలరిస్తుంటారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాతోపాటు ఓటీటీ సిరీస్‌లతోనూ ఆయన బిజీగా ఉన్నారు. ఆయన ఓ పాత్ర ఎంపిక చేస్తున్నారంటే అది ఎంతో బలమైనది అని అర్థం. ‘సత్య’, ‘భోంస్లే’, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ (Gangs of wasseypur) లాంటి వెవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘‘జీవితంలో మొండిగా ఉండకపోతే.. పరిస్థితులు ప్రతిక్షణం మిమ్మల్ని సవాలు చేస్తాయ’’ని ఆయన అంటున్నారు. త్వరలో ‘డిస్పాచ్’ (Dispatch movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆయన పాత్రికేయుడిగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన రోజుల్ని, ఎంచుకునే పాత్రల గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
‘‘బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు.. ఈరోజు చిత్ర పరిశ్రమలో గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నమ్ముతారా? నా లక్ష్యాలను నెరవేర్చడానికి ఆదాయం లేని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. నాలాగే ఎంతో మంది కోరికల్ని, ఆశయాలను సాధించలేక వెనకబడిపోయారు. కానీ మనం కన్న కలల్ని ఎందుకు నిజం చేసుకోకూడదు. మీరు తెలివిగా, మొండిగా, ధైౖర్యంగా ఉండాలి. నా లక్ష్యాల విషయంలో నేను ఎప్పుడూ మొండిగానే ఉన్నా.. ఒకవేళ అలా లేకపోతే పరిస్థితులు మిమ్మల్ని ప్రతి క్షణం సవాలు చేస్తాయి. నాకు తెలిసి చిత్రపరిశ్రమలో అప్పటి వరకు బీహార్ నుంచి వచ్చి విజయవంతంగా రాణిస్తున్న ఏకైక నటుడు శత్రుఘ్న సిన్హా.. ఆయన తర్వాత బీహార్‌కు చెందిన ఓ పల్లెటూరి అబ్బాయి స్టార్‌గా ఎదగడం ఇదే మొదటిసారి కావచ్చు. జీవితంలో మనం కోరుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం. అప్పట్లో చాలా మంది యువకులకు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి పోరాడేంత ధైర్యం లేదు. కానీ ఆ జోన్ నుంచి వస్తేనే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది.
‘‘సత్య’ సినిమా ఆడిషన్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఓసారి రామ్‌గోపాల్ వర్మ సినిమా ‘దౌడ్’ ఆడిషన్‌కు వెళ్లా. అక్కడ ఆయనకు ‘బాండిట్ క్వీన్’లో మాన్‌సింగ్ పాత్రను నేను పోషించానని తెలియగానే.. ‘నీ గురించి తెలుసుకోవాలని నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా. నీతో సినిమా తీయాలని అనుకుంటున్నా’’ అన్నారు. అలా వచ్చిన అవకాశమే ‘సత్య’లోని భికూ మాత్రే పాత్ర. నా కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర ఇది. ఈ సినిమా తర్వాత నాకు అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆ అవకాశాలన్నీ విలన్ తరహావే. అందుకే మూస ధోరణి పాత్రల్ని ఎంచుకోవడానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలనుకున్నా. కొందరు దర్శకనిర్మాతలు అలాంటి పాత్రలు చేయనంటే డబ్బు ఆఫర్ చేశారు. కానీ చిత్రపరిశ్రమలో నేను విలన్‌గా ఉండాలనుకోవట్లేదు. ఒకవేళ డబ్బుకు ఆశపడి ఆ పాత్రలు అంగీకరిస్తే ఆ తరహా పాత్రలతో అక్కడే ఉండిపోయేవాణ్ణి. ఎప్పటికీ బయటికి రాకపోయేవాణ్ని’’.