మోహన్‌బాబు.. మనోజ్ మధ్య గొడవ?
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:28 AM
సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు....
సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీషరీఫ్ పరిధిలోని మోహన్‌బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్‌బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మనోజ్‌పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు.. గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్-100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాలుకు గాయం అయిన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు.
కాగా, మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. మనోజ్‌కు ఎంఎల్‌సీ (మెడికో లీగల్ కేసు) పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్థారించారని తెలిసింది. సిటీ స్కాన్, ఆలా్ట్ర సౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని సూచించగా.. సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలిసింది.
అంతా అబద్దం : మోహన్‌బాబు
ఆస్తుల పంపకాల్లో మా ఇంట్లో గొడవలు జరిగాయని.. మనోజ్‌ను నేను కొట్టానని ఉదయం నుంచి మీడియాలో షికార్లు చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్‌బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు సూచించారు.
హైదరాబాద్, ఆంధ్రజ్యోతి