Kona Venkat: తెలుగమ్మాయి 50 సినిమాలు చెయ్యడం గొప్ప విషయం
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:43 PM
నటి అంజలి తన 50వ సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలని అనుకున్నారు, అందుకు 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా అవటం తనకి చాలా సంతోషంగా ఉందని చెప్పారు అంజలి. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
అంజలి నటించిన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. ఇంతకు ముందు వచ్చిన 'గీతాంజలి' సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తోంది. హర్రర్ కామెడీ గా ఏప్రిల్ 11 న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి కోన వెంకట్ ఒక నిర్మాత. అతను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతకు ముందు వచ్చిన ‘గీతాంజలి' మాకెంతో స్పెషల్ మూవీ. ఇప్పుడు వస్తున్న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఇంకా చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఈ సినిమా అంజలికి 50వ సినిమా. ఆమెను అభినందించాల్సిందే. ఓ తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడటమంటే గొప్ప విషయం. ఇప్పుడింకా గొప్పగా రాబోతుంది,' అని చెప్పారు.
ఈ గీతాంజలి ఐడియాను తన దగ్గరకు తెచ్చింది కమెడియన్ నటుడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పారు కోన. ఆ సినిమా సక్సెస్ మా టీమ్‌ను కలిపింది. నేను 55 సినిమాలకు రచయితగా పని చేశాను. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది మాత్రం భాను, నందు. 'సామజవరగమన', 'భైరవకోన' సినిమాలకు వాళ్లు పని చేశారు. ఈ స్క్రిప్ట్ లో కీలక పాత్రను పోషించారు. కథను నేనిచ్చినా వాళ్లు దాన్ని 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు అని చెప్పారు కోన సినిమా గురించి.
ఈ చిత్రంలో కథానాయిక అయిన అంజలి మాట్లాడుతూ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బావుంటుంది అని చెప్పింది. 'నా 50వ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'తో తీరింది', అని చెప్పింది అంజలి. తన ఎంటైర్ టీమ్ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. అందరూ ఎంటర్ టైన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. కోన వెంకట్ గారికి థాంక్స్. స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం, అని చెప్పారు అంజలి.