ఈ క్రెడిట్‌ అంతా సుకుమార్‌దే

ABN , Publish Date - Dec 08 , 2024 | 02:13 AM

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. వై.రవి శంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా....

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. వై.రవి శంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బ్లాక్‌బస్టర్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్స్‌. ఫాస్టెస్ట్‌ రూ.500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమాని అమితంగా ప్రేమించే ఇద్దరు కలసి పనిచేస్తే ఎలా ఉంటుందో అదే ‘పుష్ప 2’’ అని నిర్మాత రవిశంకర్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఫహాద్‌ ఫాజిల్‌ లాంటి గొప్ప నటుడితో పని చేయడం నా అదృష్టం. ఈ విజయానికి కారణం చిత్రబృందం పడిన శ్రమ. సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో నా టీమ్‌ ముందుగానే లెక్కలతో సహా చెప్పేశారు’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. ‘‘దేశ నలుమూలల నుంచి మాకు సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా సుకుమార్‌దే. ఆయనకి రుణపడి ఉంటాను. అలాగే మాకు ఎంతో సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌.. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే్‌షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. 20 ఏళ్లుగా ఇలాగే ఆ థియేటర్లో అభిమానులతో సినిమా చూడ్డానికి వచ్చేవాడ్ని. కానీ ఇంటికి వచ్చిన తరువాత ఆ రోజు జరిగిన సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం రూ.25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇచ్చినా.. మనిషి లేని లోటును ఎవరూ తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంతా కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని తెలిపారు.

Updated Date - Dec 08 , 2024 | 02:13 AM