Nandamuri Balakrishna @50: మొదటి స్టిల్, మొదటి సన్నివేశం, తండ్రి దర్శకుడు, ఏమన్నారంటే...

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:16 PM

నందమూరి బాలకృష్ణ నటించిన 'తాతమ్మ కల' సినిమా రేపు ఆగస్టు 30కి 50 సంవతసరాలు పూర్తి చేసుకుంటుంది. అంటే బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ మొదటి స్టిల్, మొదటి సన్నివేశం, తండ్రి ఎన్టీఆర్ దర్శకుడు బాలకృష్ణతో ఏమన్నారు, ఎలా చేయించారు ఆ వివరాలు...

Nandamuri Balakrishna's first still from his first film Tatamma Kala

రేపు ఆగస్టు 30 అంటే, నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా వెండితెరపై నటించిన సినిమా 'తాతమ్మకల', 50 సంవత్సరాల క్రితం అంటే ఆగస్టు 30, 1974లో విడుదలైంది. ఈ సినిమాకి తన తండ్రి లెజెండరీ నటుడు ఎన్.టి. రామారావు దర్శకుడు, అలాగే ఇందులో రెండు విభిన్న పాత్రలు కూడా చేశారు. బాలకృష్ణ లెజెండరీ నటుడు, తండ్రి ఎన్టీఆర్ తో, అప్పట్లో ప్రఖ్యాత నటీమణిగా పేరుపొందిన భానుమతితో కలిసి ఈ 'తాతమ్మ కల' సినిమాలో నటించారు. భానుమతికి మనవడిగా కనిపిస్తారు బాలయ్య.

అయితే ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో బాలకృష్ణని తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం చేస్తూ నడుచుకుంటూ రమ్మని చెప్పారు. బాలకృష్ణకి అద్దాలు లేని ఒక కళ్ళద్దాల ఫ్రేమ్ పెట్టుకోమన్నారు, నడిచి రమ్మన్నారు. బాలకృష్ణ అప్పుడు 'నిండు మనసులు'లో ఎన్టీఆర్ ఎలా నడుస్తారో అలా నడుచుకుంటూ వస్తున్నారు.

వెంటనే ఎన్టీఆర్ కట్ చెప్పారట. "నేను నడిచి రమ్మన్నది ఒక స్టూడెంట్ లా, అంతేకానీ రౌడీలా కాదు, వెళ్లి మళ్ళీ స్టూడెంట్ లా నడుచుకుంటూ రా' అని చెప్పారట. అది మొదటి సన్నివేశం, తండ్రి ఎన్టీఆర్ అలా బాలకృష్ణకి మొదటి దర్శకుడిగా తర్ఫీదు ఇచ్చారని చెపుతూ వుంటారు. ఆ సినిమాలో మొదటగా నటించిన బాలకృష్ణ 50 ఏళ్ళు నటుడిగా ఈ ఆగస్టు 30కి పూర్తి చేశారు.

nandamuriblakrishnaat50.jpg

అయితే బాలకృష్ణ నటించిన 'తాతమ్మ కల' సినిమాకి ఇంకో ప్రత్యేకత వుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ బహుసంతానం ఉండాలని అనే విధంగా వచ్చే మాటలు పెట్టారు. అలాగే బాలకృష్ణ, భానుమతి లకి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె. అలాగే నిజ జీవితంలో కూడా ఎన్టీఆర్ కి చాలామంది సంతానం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా విడుదల అయ్యే సమయంలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణకై కృషి చేస్తున్న సమయంలో, ఈ సినిమాలో అందుకు వ్యతిరేకంగా ఉండటం వలన, ఈ సినిమాని నిషేధించాలని అనుకున్నారు.

tatammakalastill.jpg

అయితే ఎన్టీఆర్ తాను చెప్పదలుచుకున్న కథని ఆ సినిమాలో సరిగ్గా చెప్పలేకపోయాను, ప్రేక్షకులు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు అని ఆ సినిమాని తనే ఆపుచేశారు. మళ్ళీ కొన్ని మార్పులు, చేర్పులులతో ఆ చిత్రాన్ని జనవరి 8, 1975లో విడుదలచేశారు. మొదటిసారి విడుదలైనప్పుడు బాలకృష్ణకి పి సుశీల ప్లేబాక్ పాడారు, కానీ మళ్ళీ విడుదల చేసినప్పుడు మాధవపెద్ది రమేష్ తో పాడించారు. అలాగే సినిమాలో కూడా ఇంకొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇలా బాలకృష్ణ మొదటి సినిమా రెండు సార్లు విడుదల కావటం అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 02:26 PM